close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

350 ఖాళీల భర్తీకే సన్నాహాలు

* మొత్తం ఖాళీలు 2,118
* 500 మార్కుల ప్రతిపాదనకు పచ్చజెండా
* రాతపరీక్ష నిర్వహించాలంటూ టీఎస్‌పీఎస్‌సీకి లేఖ
ఈనాడు - హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖలో ఏడాదిగా ఉన్న మొత్తం 2,118 ఖాళీల్లో ప్రస్తుతానికి 350 ఉద్యోగాల నియామకాలకే ఆమోదం దక్కనుంది. ఆర్థిక శాఖ అనుమతి లభించి సంవత్సరం గడిచినా.. ‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు’ అన్నట్లు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియలో తాజాగా కదలిక మొదలైంది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యుల పోస్టులను మినహాయించి, వైద్యవిధాన పరిషత్‌, వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని వైద్యుల పోస్టుల నియామకానికి ఆరోగ్యశాఖ తాజాగా పచ్చజెండా వూపింది. ఈ పోస్టులను పరీక్షల ద్వారానే భర్తీ చేయాలని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)కి వైద్యఆరోగ్యశాఖ లేఖను సిద్ధంచేసింది. దీనికి సంబంధించిన దస్త్రంపై మార్చి 2న మంత్రి లక్ష్మారెడ్డి సంతకం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ సంతకం చేస్తే నేరుగా టీఎస్‌పీఎస్‌సీకి లేఖను పంపిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి.
ఇతర ఖాళీలకూ ప్రకటనలు..
తొలుత అన్ని విభాగాల వైద్యుల పోస్టులనూ రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ భావించినా.. ప్రజారోగ్య విభాగంలో పని చేస్తున్న ఒప్పంద వైద్యుల వినతిమేరకు ఆ విభాగంలోని 235 పోస్టుల భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టారు. మిగిలిన 350 వైద్యుల ఖాళీలను పరీక్ష ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇంకా నర్సులు, ఏఎన్‌ఎంలు, ఫిజియోథెరపిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్‌, తదితర పోస్టులు కూడా భర్తీకి సిద్ధంగానే ఉన్నాయి. వీటన్నింటినీ టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే భర్తీ చేస్తారు. వైద్యుల పోస్టుల భర్తీ అనంతరం ఇతర ఖాళీల నియామకాల ప్రకటనలనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
పరీక్ష ఇలా..
* పరీక్ష నిర్వహణపై టీఎస్‌పీఎస్‌సీ రెండు రకాల ప్రతిపాదనలు పంపించగా.. ఇందులో మొదటి ప్రతిపాదనకు ఆరోగ్యశాఖ పచ్చజెండా వూపింది.
* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, డెంటల్‌ సర్జన్‌, సీఏఎస్‌ స్పెషలిస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ట్యూటర్ల భర్తీకి ఈ విధానం అమలవుతుంది.
* రాతపరీక్షలో రెండు రకాల ప్రశ్నపత్రాలుంటాయి. ఒక్కోదానికి 150 నిమిషాల చొప్పున సమయముంటుంది.
* మొదటిది జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌. వీటిల్లో 150 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు.
* రెండోది సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం. ఇందులోనూ 150 ప్రశ్నలుండగా, ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
* అనుభవానికి 25 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కుల చొప్పున ఉంటాయి.
* ప్రభుత్వ వైద్యంలో గిరిజన ప్రాంతాల్లో ఆరు నెలలు పనిచేస్తే 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతంలో అయితే రెండు, పట్టణ ప్రాంతంలోనైతే ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.
Posted on 03-03-2017