close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు

* గ్రూప్‌-2 పరీక్షలను రద్దు చేయాలంటూ పిటిషన్‌
* మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు జులై 13న‌ ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ జూన్‌ 1న జారీ చేసిన మెరిట్‌ జాబితాను సవాలు చేస్తూ ఎం.రవీందర్‌గౌడ్‌.. మరో 19 మంది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జులై 13న‌ జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ చేపట్టి టీఎస్‌పీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ.. మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించారు. 2015, 2016లలో గ్రూప్‌ - 2 ఉద్యోగాల భర్తీ నిమిత్తం జారీ చేసిన ఉద్యోగ ప్రకటన మేరకు చేపట్టిన నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాల (ఓఎంఆర్‌ షీట్లు) మూల్యాంకనం జరిగిందన్నారు. ఓఎంఆర్‌ షీట్లలో పేర్కొన్న సూచనలను పాటించని అభ్యర్థులను ఎంపిక చేశారన్నారు. పరీక్షల నిర్వహణలో పలు లోపాలున్నాయని, ఓఎంఆర్‌ షీట్ల మూల్యాంకనం కంప్యూటర్ల ద్వారా జరగాలన్న నిబంధననూ పాటించలేదని, ఈ కారణంగా అర్హులైన పలువురు అభ్యర్థులు అవకాశాలు కోల్పోయారని చెప్పారు. 5 లక్షల మంది పరీక్షలకు హాజరవగా.. టీఎస్‌పీఎస్సీ 3,147 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిందని, ఆ జాబితాపై పలు అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని అభ్యర్థించారు.
Posted on 20-07-2017