close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

డిగ్రీ అధ్యాపకుల రాతపరీక్షపై హైకోర్టు స్టే

* రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీలకు నోటీసులు
* పోస్టులన్నీ మహిళలకు కేటాయించడంపై అభ్యంతరం

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో మహిళా అధ్యాపక పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం జులై 30న జరగాల్సిన పరీక్షపై హైకోర్టు 'స్టే' విధించింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు సోమవారం(జులై 17) ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ సర్కారుతో పాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), తదితరులకు నోటీసులు జారీచేశారు. వ్యాజ్యంలో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 546 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 2న టీఎస్‌పీఎస్సీ జారీచేసిన ప్రకటనను సవాలు చేస్తూ మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన ఎస్.వెంకటనర్సింహ గౌడ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రమేష్ వాదనలు వినిపిస్తూ.. మొత్తం పోస్టులను మహిళా అభ్యర్థులతో భర్తీ చేయాలని నిర్ణయించడం పురుష అభ్యర్థులపట్ల వివక్షత చూపడమేనన్నారు. సాధారణ నియామకాల (జనరల్ రిక్రూట్‌మెంట్) కోసం నోటిఫికేషన్లు జారీచేసినప్పుడు మొత్తం పోస్టులు మహిళలకు కేటాయించడం అధికరణ 14, 16, 19లకు విరుద్ధమన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జులై 30న జరగనున్న పరీక్ష నిర్వహణపై స్టే విధించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి.. వంద శాతం పోస్టులను మహిళలకు కేటాయించడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తంచేశారు. పరీక్ష నిర్వహణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
Posted on 20-07-2017