close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

మహిళా అభ్యర్థులతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలుపుదల

* గురుకులాల్లో నియామకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు
* పురుష అభ్యర్థులకు స్థానం కల్పించకపోవడంపై ఆక్షేపణ

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సాధారణ పరిపాలనాశాఖ 2016 జూన్ 4వ తేదీన ఇచ్చిన జీవో 1274 ఆధారంగా సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ గురుకుల బాలికలు/మహిళల విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర విభాగాల్లోని ఉద్యోగాలను.. మహిళా అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేసే ప్రక్రియను హైకోర్టు నిలుపుదల చేసింది. తెలంగాణ పాఠశాల, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి, తెలంగాణ సాంఘిక, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు బుధవారం(జులై 19) ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. జీవో 1274 చట్టబద్ధతను సవాలు చేస్తూ వరంగల్ జిల్లా నగరం గ్రామానికి చెందిన కె.సత్యనారాయణ, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. బాలికా/మహిళా విద్యాసంస్థల్లోని అన్ని ఉద్యోగాలను మహిళా సిబ్బందితోనే భర్తీ చేసేలా ఆయా విద్యాసంస్థలు.. తమ బైలాలను, నియామక నిబంధనలను సవరించుకోమంటూ ప్రభుత్వం జీవో 1274లో కోరిందన్నారు. ఎటువంటి సవరణలు చేయకుండా ఆయా విద్యాసంస్థల్లో మహిళా అభ్యర్థులతోనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఏ ఉద్యోగాలకు పురుషుల కంటే మహిళా అభ్యర్థులే సమర్థులని భావిస్తారో.. ఆ ఉద్యోగాల భర్తీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలు 22(ఏ)(3) చెబుతున్నాయి తప్ప.. పూర్తిగా పురుష అభ్యర్థులను ఆ ఉద్యోగాల భర్తీ నుంచి మినహాయించమని చెప్పడం లేదన్నారు. తాజాగా జారీచేస్తున్న ఉద్యోగ ప్రకటనల్లో పురుష అభ్యర్థులను మినహాయించడం వివక్షతతో కూడుకున్నదన్నారు. ఇటువంటి చర్య అధికరణ 14, 16కు విరుద్ధమన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆ జీవో అధారంగా మహిళా అభ్యర్థులతో ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Posted on 20-07-2017