close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గురుకుల పరీక్షలన్నీ వాయిదా

* కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం
* సవరణ పరీక్ష తేదీలు తరువాత ప్రకటిస్తాం
* టీఎస్‌పీఎస్సీ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులతో పాటు వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నిర్వహించ తలపెట్టిన రాత పరీక్షలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. శుక్రవారం(జులై 21) నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరగాల్సిన వివిధ కేటగిరీల పరీక్షలన్నీ నిలిపేసింది. బాలికలు, మహిళా విద్యాసంస్థల్లో పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతో భర్తీచేయాలన్న జీవో నెం.1274ను హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నుంచి తదుపరి స్పష్టత వచ్చేవరకు రాత పరీక్షలు నిర్వహించబోమని తెలిపింది. హైకోర్టు తీర్పు మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. రాత పరీక్షల సవరణ తేదీలు తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నాయి. మరోవైపు జీవో నెం.1274పై సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తదుపరి నిర్ణయంపై సమాలోచనలు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌కు సర్కారు బాధ్యతలు అప్పగించింది.
* తొలి నుంచీ వివాదాలే...
గురుకుల పోస్టుల భర్తీ ప్రకటనలు జారీచేసినప్పటి నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తొలి విడత కింద 8408 పోస్టులతో ప్రకటనలు జారీ చేసింది. వీటిలో 7308 పోస్టులు గురుకుల పాఠశాలల్లో ఉన్నాయి. గురుకుల పోస్టుల భర్తీకి సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ప్రతిపాదించిన అర్హతలు వివాదం సృష్టించాయి. జాతీయ ఉపాధ్యాయ విద్య మార్గదర్శకాలకు విరుద్ధంగా అర్హత మార్కులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆ ఉద్యోగ ప్రకటనలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ రద్దుచేసింది. ఆ తరువాత అర్హత మార్కులు సవరించి కొత్త ప్రకటనలు జారీచేసినా, సమస్యలు తప్పలేదు. సూక్ష్మ విషయాలను మరచిపోయి, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ టీఎస్‌పీఎస్సీ ప్రకటనల్లో సవరణలు చేస్తూ మార్పులు చేసింది. అర్హతలు మార్చడం, పరీక్షల పేపర్లు కుదించడం పలు రకాలుగా సవరణలు కొనసాగుతూనే ఉన్నాయి.
* జీవో నెం.1274పై అభ్యంతరాలు...
బాలికలు, మహిళా గురుకుల విద్యాలయాల్లో పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతో భర్తీచేయాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ నియామక నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ జీవోనెం.1274 జారీచేశారు. ఈ జీవోపై తొలినుంచీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా మంజూరైన గురుకులాల్లో 50 శాతానికిపైగా బాలికలవే ఉన్నాయి. వీటిలోని బోధన, బోధనేతర పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతో భర్తీ చేసేందుకు వీలుగా సాంఘిక సంక్షేమశాఖ టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు పంపించింది. బాలుర పాఠశాలల్ని జనరల్ పాఠశాలలుగా పరిగణిస్తూ అక్కడ మహిళలు, పురుష అభ్యర్థులతో పోస్టులు భర్తీచేయాలని కోరింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. మహిళా విద్యాలయాలు ఎక్కువగా ఉండటం, అక్కడి పోస్టులన్నీ మహిళలతో భర్తీచేయాలని నిర్ణయించడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిర్ణయం లింగ వివక్షకు దారితీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు జీవోనెం.1274 నిలిపివేసింది. ఈ మేరకు పరీక్షలన్నీ వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
* వాయిదా వేసిన పరీక్షలివీ...
జులై 21: టీజీటీ ఫిజికల్ సైన్స్, సోషల్ ప్రధాన పరీక్ష
జులై 22: టీజీటీ సైన్స్ ప్రధాన పరీక్ష
జులై 30: డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, పీడీ, లైబ్రేరియన్ ప్రిలిమినరీ పరీక్ష
జులై 30: జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్స్, పీడీ, లెక్చరర్లు, లైబ్రేరియన్ ప్రిలిమినరీ పరీక్ష
జులై 30: గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల ప్రిలిమినరీ
జులై 31: ఆర్ట్ టీచర్ రాత పరీక్ష
ఆగస్టు 1: క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ రాత పరీక్ష
ఆగస్టు 2: లైబ్రేరియన్(పాఠశాలలు), స్టాఫ్‌నర్సు, పీఈటీ రాతపరీక్ష
ఆగస్టు 3: స్టాఫ్‌నర్సు, పీఈటీ రాత పరీక్ష.
Posted on 21-07-2017