close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-2 నియామకాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతి

* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణాలో గ్రూప్‌-2 నియామకాల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబరు 14న హైకోర్టు అనుమతించింది. 1:3 నిష్పత్తితో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కి ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హులైన అభ్యర్థుల పేర్లు గ్రూప్‌-2 మెరిట్‌లిస్ట్‌లో ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సెప్టెంబరు 14న జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఇటీవల హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం అనర్హత సాధించిన అభ్యర్థులు మెరిట్‌ జాబితాలో ఉండటంతో మొత్తం నియామక ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ఎం.సురేందర్‌రావు వాదనలు వినిపించారు. ఓఎంఆర్‌ షీట్‌ నింపడానికి సంబంధించి టీఎస్‌పీఎస్సీ మార్గదర్శకాలు జారీ చేసిందని, దీని ప్రకారం రెండోసారి దిద్దడం, వైట్‌నర్‌ వాడటం వంటివి చేయరాదని, ఇలా చేసిన పత్రాల మూల్యాంకనం జరగదన్నారు. ఈ నిబంధనల ప్రకారం కొంతమంది అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. సూచనలు పాటించనివారి జవాబు పత్రాల మూల్యాంకనం చేయలేమంటూ టీఎస్‌పీఎస్సీ చెప్పినప్పటికీ వారి పేర్లు మెరిట్‌ జాబితాలో కనిపించాయంటే కమిషన్‌ సొంత మార్గదర్శకాలనే అమలు చేయలేదని తేలుతోందన్నారు. పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్‌ పద్ధతిని కూడా అనుసరించలేదని చెప్పారు. ఈ కారణాలతో మొత్తం నియామకాల ప్రక్రియను నిలిపివేయడం సరికాదని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ తదితరులు వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు జారీ చేసిన స్టే గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి పొడిగించడానికి న్యాయమూర్తి నిరాకరించారు. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేశారు.

Posted on 15-09-2017