close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఎస్‌పీఎస్సీకి కొత్త వసతి

* త్వరలో స్థలం కేటాయింపు
* అదనపు వసతి కోసం టీఎస్‌ఐఐసీ భవనం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)కి కొత్త భవన సముదాయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భవనం సరిపోకపోవడంతోపాటు ఇతర సమస్యల కారణంగా మరోచోట నిర్మాణాలు చేపట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మాసబ్‌ట్యాంకులోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) నిర్మించిన భవనాన్ని అదనంగా కేటాయించింది. ఇందులో ఐటీ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఒకే భవనంలో రెండు అంతస్థుల్లో టీఎస్‌పీఎస్సీ, మరో రెండు అంతస్థుల్లో ఏపీపీఎస్సీ కొనసాగుతున్నాయి. గదులు చాలా ఇరుగ్గా ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాల తనిఖీ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో జరుపుతున్నారు. టీఎస్‌పీఎస్సీలో కొత్త ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.6 కోట్లను ఇటీవలే మంజూరు చేసింది. కానీ, దీనికి అనువైన స్థలం లేదు. ప్రస్తుత భవనంలో పార్కింగు వసతి లేదు. పాలకమండలి సభ్యులు వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. సందర్శకుల వాహనాలు బయటే ఉంటున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నాంపల్లిలోని అత్యంత రద్దీ ప్రదేశంలో ఉంది. దీంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. తమకు కొత్తభవన సముదాయాన్ని నిర్మించాలని టీఎస్‌పీఎస్సీ పాలకమండలి ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. కమిషన్‌ ఛైర్మన్‌ చక్రపాణి, సభ్యుడు విఠల్‌ నవంబరు 22న సచివాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ వసతి గురించి చర్చించారు. ఏపీపీఎస్సీ ఇప్పట్లో ఏపీకి తరలివెళ్లే అవకాశాలు లేనందున తమకు కొత్త వసతి అనివార్యమని చక్రపాణి తెలిపారు. దీనిపై కేటీఆర్‌ సీఎం కార్యాలయ అధికారులతో చర్చించారు. ఐదు నుంచి పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో స్థలాన్ని ఎంపిక చేయాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. అదనపు వసతిగా మాసబ్‌ట్యాంక్‌లోని టీఎస్‌ఐఐసీ నిర్మించిన భవనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.

Posted on 23-11-2017