close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పది జిల్లాలుగానే పరిగణించాలి

* ఈ మేరకు సవరణ ప్రకటన జారీ చేయండి
* రాష్ట్రపతి ఉత్తర్వు సవరించకుండా 31 జిల్లాలకు ప్రకటన సరికాదు
* దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబరు 15 వరకు పొడిగించండి
* టీఆర్‌టీపై తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం
* పరీక్ష ప్రక్రియ యథావిధిగా కొనసాగించొచ్చని వెల్లడి
* ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరంలేదని స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన జిల్లాల్నీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర సర్కారు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ప్రకటన ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేయకుండా 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని తేల్చిచెప్పింది. పాత పది జిల్లాలనే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. జీవోలో పేర్కొన్న 31 జిల్లాల స్థానంలో పది జిల్లాలుగా మార్చాలని పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్‌ 15 వరకు పెంచాలని.. ఆ మేరకు సవరణ ప్రకటన జారీచేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా పాత పది జిల్లాల్లో ఏ జిల్లాకు చెందిన వారవుతారో వర్గీకరించాలని స్పష్టంచేసింది. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని చెబుతున్న సర్కారు.. స్థానిక రిజర్వేషన్‌ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించంకుండా 31 జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జీవోలో 31 జిల్లాలుగా పేర్కొన్న నిబంధనను రద్దు చేసింది. టీఆర్‌టీ నిర్వహణ ప్రక్రియను యథావిధిగా కొనసాగించొచ్చని సర్కారుకు స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం నవంబరు 24న ఈ మేరకు తీర్పిచ్చింది. పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 10న జారీచేసిన జీవో 25.. తదనుగుణంగా విడుదలైన టీఆర్‌టీ ప్రకటనను సవాల్‌ చేస్తూ ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్‌, టి.అనిల్‌కుమార్‌లతోపాటు మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గత విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. పది జిల్లాల్ని 31 జిల్లాలుగా విభజించడంతో ‘లోకల్‌ క్యాడర్‌’లో మార్పు చేసినట్లయిందని.. ఆ అధికారం సర్కారుకు లేదని పేర్కొన్నారు. కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాత జిల్లాల్లో స్థానికులుగా ఉన్న అభ్యర్థులు కొత్త వాటిలో స్థానికేతరులుగా మారిపోయారని వివరించారు. తెలంగాణ ఏజీ డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం స్థానిక అభ్యర్థుల ప్రయోజనాల్ని కాపాడటమేనని పేర్కొన్నారు. గతంలోని 10 జిల్లాలనే పరిగణనలోకి తీసుకోవాలని ‘ఒకవేళ కోర్టు భావిస్తే’ ఆ మేరకే సర్దుబాటు చేస్తామన్నారు. బుధవారం ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో.. నిర్ణయాన్ని వాయిదా వేసిన ధర్మాసనం.. శుక్రవారం తీర్పిచ్చింది. స్థానిక రిజర్వేషన్‌ విషయమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయని పేర్కొన్న ధర్మాసనం.. 27 నెలల్లో ఆ ఉత్తర్వులను సవరణ చేయమని అడిగే వెసులుబాటు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన 10 జిల్లాలకే రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆ ఉత్తర్వులను సవరించకుండా టీఆర్‌టీ విషయంలో 31 జిల్లాల్ని పరిగణించడం తగదని తేల్చిచెప్పింది.

Posted on 25-11-2017