close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

దరఖాస్తులకు సాంకేతిక తిప్పలు

* వారమైనా తిరిగిరాని రద్దయిన చెల్లింపులు
* ఆందోళనలో గ్రూప్‌-4, వీఆర్వో అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెలువరించిన గ్రూప్‌-4, వీఆర్వో పోస్టులకు దరఖాస్తు సమయంలో సాంకేతిక ఇబ్బందులతో రద్దయిన లావాదేవీలపై సందిగ్ధం నెలకొంది. జూన్ 7 - 11వరకు రద్దయిన లావాదేవీల నగదును మూడు రోజుల్లో అభ్యర్థుల ఖాతాల్లో జమచేసేలా చర్యలు తీసుకుంటామని కమిషన్‌ హామీ ఇచ్చినా నేటికీ నెరవేరలేదు. మరోవైపు అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు వెళ్లినప్పటికీ, ఎస్‌బీఐ పేమెంట్‌ గేట్‌వే ఖాతాలో జమ కాలేదని ఆ సంస్థ చెబుతున్నట్లు తెలుస్తోంది. రద్దయిన లావాదేవీల తిరిగి చెల్లింపుల కనీస గడువు ముగిసినప్పటికీ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వెనక్కు రాకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో గ్రూప్‌-4 కింద 1521 పోస్టులు, రెవెన్యూశాఖలో కీలకమైన 700 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులున్నాయి. ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి భారీగా పోటీ ఉంది. దరఖాస్తు చేసేపుడు సాంకేతిక ఇబ్బందులతో ఫీజు చెల్లించే సమయంలో అభ్యర్థి ఖాతా నుంచి నగదు చెల్లించినట్లు వచ్చినా, అది రద్దయినట్లు ఎస్‌బీఐ పేమెంట్‌ గేట్‌వే ద్వారా సమాచారం వచ్చింది. తాత్కాలిక సాంకేతిక ఇబ్బందులని కొందరు మళ్లీ ప్రయత్నించడంతో ప్రతిసారి ఫీజు రూ.200తో పాటు సర్వీసుఛార్జీ కింద మరో రూ.4 వరకు ఖాతా నుంచి కట్‌ అయ్యాయి. దీనిపై అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని సంప్రదించారు. జూన్ 11వరకు సీజీజీ, ఎస్‌బీఐ పేమెంట్‌ గేట్‌వేకు మధ్య సాంకేతిక సమస్యలు వచ్చాయని గుర్తించిన కమిషన్‌ రద్దయిన లావాదేవీల నగదు మూడు రోజుల్లో సంబంధిత ఖాతాల్లో జమచేయాలని 13న బ్యాంకును ఆదేశించింది. సీజీజీ ద్వారా సమాచారం తీసుకుని విజయవంతం కాని లావాదేవీల వివరాలను ఎస్‌బీఐకు పంపించింది. వారం గడుస్తున్నా ఖాతాల్లో జమకాకపోవడంపై కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రద్దయిన లావాదేవీలతో పోలిస్తే అంతమేర నగదు ఎస్‌బీఐ గేట్‌వేకు రాలేదని బ్యాంకు అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో జూన్ 21న‌ ఎస్‌బీఐ, సీజీజీ అధికారులతో కమిషన్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.Posted on 21-06-2018