close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఆర్టీ వాయిదా పడదు

* త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌
* టీఎస్పీఎస్సీ చైర్మన్‌ చక్రపాణి

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పారదర్శకంగా నియామక ప్రక్రియల్ని నిర్వహిస్తున్నామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి చెప్పారు. జ‌న‌వ‌రి 30న‌ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల్లో టీఆర్టీ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని తెలిపారు. టీఆర్టీ వాయిదా పడుతుందనే వదంతుల్ని నమ్మొద్దని సూచించారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3వ తేదీలోగా ఈ పరీక్షల్ని నిర్వహించనున్నామని తెలిపారు. మొత్తం 16 సెషన్లలో నిర్వహించే పరీక్షల్లో భాగంగా 13 పరీక్షల్ని ఆన్‌లైన్లో నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో గ్రూప్‌-4 ద్వారా 800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నామని తెలిపారు. రెవెన్యూశాఖలో వీఆర్‌ఏ, పంచాయతీ విభాగంలో పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురుకులాల్లో టీజీటీ నియామకాల్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. తరువాత మిగతా గురుకులాల భర్తీ చేస్తామన్నారు. మార్చినాటికల్లా మొత్తంగా 20వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్సీపీఎస్సీ ద్వారా పూర్తి చేస్తామని చెప్పారు. ఇన్నాళ్ల నియామక ప్రక్రియను పరిశీలిస్తే ఎక్కడా జాప్యం జరగడం లేదన్నారు. నియామకాల్లో ఎక్కడైనా అక్రమాలకు తావిచ్చినట్లు, అవినీతికి ఆస్కారమున్నట్లు తేలితే ఎవరైనా నిరభ్యంతరంగా ఠాణాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. పూర్తి పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 100 నోటిఫికేషన్లు వేసి 86 పరీక్షల్ని పూర్తి చేశామన్నారు. గెజిటెడ్‌ పోస్టులకు మాత్రమే ముఖాముఖిలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఉచితంగా అందిస్తున్న టీఆర్టీ శిక్షణతీరుని ఆయన పరిశీలించారు.



Posted on 31-01-2018