close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గురుకుల పోస్టుల పరీక్షలు వాయిదా

* కొత్త తేదీలు త్వరలో వెల్లడిస్తామన్న టీఎస్‌పీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో జూనియర్‌, డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్‌, ప్రిన్సిపల్‌, పీడీ పోస్టులకు ఫిబ్రవ‌రి 19 నుంచి 23 వరకు జరగాల్సిన ప్రధాన పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది. సీజీజీ నుంచి తీసుకున్న బయోడేటాలో కొన్ని పొరపాట్లు దొర్లాయని, వాటిని సరిదిద్దిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధాన పరీక్షలకు ఎంపిక చేసిన జాబితాను మరోసారి క్షుణ్నంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గురుకులాల్లో ఆయా పోస్టులకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఇందులో 1 : 15 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రధాన పరీక్షలకు ఎంపిక చేసింది. ఫిబ్రవ‌రి 19 నుంచి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొందరు అభ్యర్థులు ప్రాథమిక ‘కీ’ ప్రకారం అత్యధిక మార్కులు సాధించినా ఎంపిక కాకపోవడంపై టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించారు. ఆయా విద్యార్థుల వ్యక్తిగత వివరాలు తనిఖీ చేసేందుకు వివరాలు పంపించాలని టీఎస్‌పీఎస్సీ సీజీజీని కోరింది. కానీ అక్కడి నుంచి వివరాలు అందుబాటులోకి రాలేదు. వచ్చిన సమాచారం అసంపూర్ణంగా ఉంది. దీంతో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, ఇచ్చిన ఆప్షన్లను ప్రత్యేకంగా పరిశీలించాలని నిర్ణయించింది. సీజీజీ నుంచి పూర్తివివరాలు అందిన తరువాత వీటిని పరిశీలిస్తుంది. నూతన పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ వెల్లడించింది.
14 నుంచి దివ్యాంగులకు వైద్యపరీక్షలు
ప్రభుత్వ విభాగాల్లో ఏఈఈ పోస్టుల భర్తీ (నోటిఫికేషన్‌ నెం. 31/2017)లో భాగంగా దివ్యాంగ అభ్యర్థులకు ఫిబ్రవ‌రి 14 నుంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. వినికిడి లోపం కలిగిన వారికి 14న కోఠీలోని ప్రభుత్వ ఈఎన్‌టీలో, శారీరక వైకల్యం కలిగిన వారికి 15న ఉస్మానియా ఆసుపత్రిలో, అంధత్వం ఉన్న వారికి 16న సరోజినీదేవి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలోని పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వివరాలు, షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కమిషన్‌ తెలిపింది.
Website
ఏఈఈ పోస్టులకు ఎంపికైన‌ అభ్య‌ర్థుల‌ వివరాలు



Posted on 13-02-2018