close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-2 నియామకాల్లో కీలక మలుపు

* 5 వేల మంది ప్రతిభావంతుల ఓఎంఆర్‌ షీట్ల పరిశీలన
* ఇందుకు ఐదుగురు న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు
* టీఎస్‌పీఎస్సీ నుంచి నివేదిక కోరిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చేపట్టిన గ్రూప్‌-2 ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక మలుపు! బబ్లింగ్‌, వైట్‌నర్‌ వాడకంపై ఆరోపణలొచ్చిన నేపథ్యంలో- రాత పరీక్షలో ప్రతిభచూపిన 5 వేలమంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను పరిశీలించాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ముగ్గురు సీనియర్‌ న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఓఎంఆర్‌ షీట్లతోపాటు సంబంధిత దస్త్రాలను ఈ కమిటీకి అందుబాటులో ఉంచాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. జస్టిస్‌ పి.నవీన్‌రావు ఫిబ్రవ‌రి 28న‌ ఈ ఉత్తర్వులిస్తూ, తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. గ్రూప్‌-2 పోస్టుల భర్తీ నిమిత్తం టీఎస్‌పీఎస్సీ 2015 డిసెంబరు 30న; 2016 సెప్టెంబరు 1న ప్రకటనలిచ్చి, పరీక్షలు నిర్వహించింది. అయితే- ‘‘ఓఎంఆర్‌ షీట్లలో బబ్లింగ్‌ చేసినవారినీ, వైట్‌నర్‌ వాడినవారినీ, వ్యక్తిగత వివరాలను తప్పుగా నమోదు చేసినవారిని, గోప్యత పాటించకుండా ఓఎంఆర్‌ షీట్లలో కిందివైపున పేర్లను రాసినవారిని అర్హులుగా ప్రకటించారు. దీంతో చాలామంది అవకాశాలు దెబ్బతిన్నాయి. టీఎస్‌పీఎస్సీ చేపట్టిన నియామకాలను నిలిపివేయాలి’’ అంటూ హైదరాబాద్‌కు చెందిన వి.రామచంద్రారెడ్డి సహా 15 మంది; పి.చరణ్‌దాస్‌ గోస్వామి మరో 20 మంది; ఇంకొందరు హైకోర్టును ఆశ్రయించారు. వైట్‌నర్‌ వాడినవారిని ఎంపిక చేశారన్న కారణంగా గ్రూప్‌-2 నియామకాలను నిలిపివేయవద్దనీ... ఇలాచేస్తే ఎక్కువమంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని మరికొందరు పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్‌ పి.నవీన్‌రావు ఫిబ్రవ‌రి 28న‌ మరోసారి విచారణ చేపట్టారు.
స్వీయ నిబంధనలను ఉల్లంఘించింది:
పిటిషనర్ల తరఫు న్యాయ‌వాదులు వాదనలు వినిపిస్తూ- ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులను గుర్తించడానికి టీఎస్‌పీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. వీటి ప్రకారం రెండోసారి దిద్దడం, వైట్‌నర్‌ వాడటం చేయకూడదన్నారు. వైట్‌నర్‌ను వాడితే మూల్యాంకనంలో కంప్యూటర్‌ పరిగణనలోకి తీసుకోదదన్నారు. తీరా.. అలాంటి చర్యలకు పాల్పడిన అభ్యర్థులనే టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసిందన్నారు. కమిషన్‌ తన స్వీయ మార్గదర్శకాలను ఉల్లంఘించిందన్నారు. ఇలాంటివారిని ఎంపిక చేయరాదని, వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ గత ఏప్రిల్‌లో ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పరీక్షల నిర్వహణలో గోప్యత పాటించాల్సి ఉండగా... కొంతమంది అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌లో పేరును రాశారన్నారు.
కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదు:
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే చూస్తున్నామన్నారు. ఓఎంఆర్‌ షీట్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటుపై తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం 1,032 పోస్టుల భర్తీ నిమిత్తం 1:3 పద్ధతిన 3,096 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి... సీనియర్‌ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్‌.రఘునందన్‌రావు, ఎస్‌.నిరంజన్‌రెడ్డిలతో కూడిన త్రిసభ్య పరిశీలన సంఘాన్ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. 5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను, రికార్డులను పరిశీలించాలని వారికి సూచించారు. శని, ఆదివారాల్లో ఈ కమిటీకి ఓఎంఆర్‌ షీట్లతోపాటు సంబంధిత దస్త్రాలను అందుబాటులో ఉంచాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని కమిటీని కోరారు. నివేదికను పరిశీలించిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.



Posted on 01-03-2018