close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఎస్‌పీఎస్సీకి విన్నవించుకోండి

* గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టుల పరీక్ష ‘ప్రశ్నల’పై పిటిషనర్‌కు హైకోర్టు వెసులుబాటు
ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలోని ‘ప్రశ్న’లపై అభ్యంతరాల్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు వినతి రూపంలో సమర్పించేందుకు పిటీషనర్‌కు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఆ వినతిని పరిశీలించి నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీ అధికారులకు స్పష్టంచేసింది. ఈమేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం జూన్ 26న‌ ఆదేశాలు జారీచేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి గతేడాది జూన్‌ 2న జారీచేసిన ప్రకటనను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరుకు చెందిన కె.బాలకృష్ణ ముదిరాజ్‌, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాల్లో ఇచ్చిన ప్రశ్నల తరహాలో యథాతథంగా మొదటి, రెండో పరీక్ష పేపర్లో మొత్తం 300 ప్రశ్నలకు 67 ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన టీఎస్‌పీఎస్సీ ఆ 67 ప్రశ్నలను తొలగిస్తున్నట్లు ప్రకటించిందని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. టీఎస్‌పీఎస్సీ వైఖరి తెలపాలని సూచించింది. జూన్ 26న‌ విచారణ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ప్రశ్నలు లీకేజీ కాలేదన్నారు. ఎగ్జామినర్‌ చేసిన పనివల్ల ప్రైవేటు కోచింగ్‌ కేంద్రంలోని 67 ప్రశ్నలు యథాతథంగా వచ్చాయని, అందుకే తొలగించామని తెలిపారు. పిటీషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ..67 ప్రశ్నలు మాత్రమే కాదని, సుమారు 200 ప్రశ్నలు యథాతథంగా వచ్చాయన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..టీఎస్‌పీఎస్సీకి వినతి సమర్పించేందుకు వెసులుబాటు కల్పించింది.


Posted on 27-06-2018