close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఎస్‌పీఎస్సీ జోక్యం లేదు

* గ్రూప్‌-2 వ్యవహారంలో న్యాయవాదుల కమిటీ నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ చేపట్టిన గ్రూప్‌-2 పరీక్షల ఓఎంఆర్‌ షీట్లలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దడం ద్వారా నియామక ప్రక్రియ ప్రభావితమయిందా, లేదా అనే అంశంపై నిర్ణయాన్ని న్యాయస్థానానికి వదిలేస్తున్నట్లు ఓఎంఆర్‌ షీట్లను పరిశీలించిన న్యాయవాదుల కమిటీ పేర్కొంది. ఓఎంఆర్‌ షీట్లలో టీఎస్‌పీఎస్సీ జోక్యం కనిపించలేదని నివేదించింది. కమిటీ పలు అంశాలపై స్పష్టతనిస్తూ న్యాయస్థానానికి నివేదిక అందజేసింది. ఓఎంఆర్‌ షీట్లలోని పార్ట్‌-ఏలో అభ్యర్థులు రోల్‌నంబరు, ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ నంబరు, టెస్ట్‌బుక్‌ సిరీస్‌ నంబర్లో.. తప్పుగా బబ్లింగ్‌ చేయడం, బబ్లింగ్‌ చేయకపోవడం, రెండుసార్లు బబ్లింగ్‌ చేయడం గుర్తించామంది. వీటికి సంబంధించిన దిద్దుబాట్లను మాత్రమే టీఎస్‌పీఎస్సీ సరిచేసిందని, ప్రశ్నలకు సమాధానాలుండే పార్టు-బిలో ఎలాంటి దిద్దుబాట్లు చేయలేదని పేర్కొంది. పార్ట్‌-ఏలో పొరపాట్లు చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల్సి వచ్చేదని కమిటీ తెలిపింది. కానీ వారి వివరాలు సరిదిద్ది టీఎస్‌పీఎస్సీ.. వారందరినీ మూల్యాంకన పరిధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. పొరపాట్లు పార్ట్‌-ఏ వరకే ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాజ్యంపై మార్చి 28న తదుపరి విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు పేర్కొన్నారు.
కమిటీ సభ్యుల నివేదికలోని వివరాలు
* ఓఎంఆర్‌ షీట్లలో పొరపాట్లు చేసిన 55 వేల మందిని గుర్తించి వారందరి వివరాలు సరిచేయాలని కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసిన 3,147 మందిలో కూడా కొందరు ఓఎంఆర్‌ షీట్లలో పొరపాట్లు చేశారని, వారివి కూడా దిద్దుబాటు చేసినట్లు న్యాయవాదుల కమిటీ గుర్తించింది.
* గ్రూప్‌-2లో 3,147 మందిని 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారని.. వీరిలో ఓఎంఆర్‌ పార్ట్‌-ఏలో పొరపాట్లు చేసిన 120 మంది కూడా ఉన్నట్లు న్యాయస్థానానికి వివరించింది.
* ఓఎంఆర్‌ షీట్లను మాన్యువల్‌గా పరిశీలించడం ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు ఉత్పన్నం కావడం లేదని టీఎస్‌పీఎస్సీ చెప్పినదాన్ని బట్టి తెలుస్తోందని వెల్లడించింది.
* ఇద్దరు అభ్యర్థులకు చెందిన ఓఎంఆర్‌ షీట్లు తారుమారవడం వల్ల పొరపాట్లు దొర్లాయా అన్న విషయాన్ని పరిశీలించగా అందుబాటులోని సమాచారం ఆధారంగా గుర్తించలేదని తెలిపింది. పొరపాట్లు కంగారులో చేసినట్లు ఉన్నాయని, సున్నాకు బదులుగా ఒకటిని బబుల్‌ చేయడం ఆ తరువాత తప్పును గుర్తించి సరిచేయడం లాంటివి జరిగినట్లు గుర్తించామని వివరించింది.



Posted on 24-03-2018