close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పదిరోజుల్లో 3 వేల పోస్టులకు ఫలితాలు

* గురుకుల టీజీటీ భాషలు, ఏఈవో ఉద్యోగాలు
ఈనాడు - హైదరాబాద్‌: ఫలితాల వెల్లడిలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వేగం పెంచింది. గత నెల రోజుల్లో దాదాపు 3వేల పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాలు ప్రకటించింది. రానున్న రెండు నెలల్లో దాదాపు 10వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. న్యాయవివాదాల్లో ఉన్నవాటిపై స్పష్టత తీసుకునేందకు సిద్ధమవుతోంది. పది రోజుల్లో 3 వేలకు పైగా పోస్టులకు ఫలితాలు వెల్లడించడంతో పాటు, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ‘కీ’లు వెల్లడించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, స్వల్ప సంఖ్యలో ఉన్నవారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించింది. గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లోని పోస్టులు మినహా మిగతా వాటికి రాతపరీక్షలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. సబ్జెక్టుల పోస్టులకు సంబంధించి పీజీటీ, టీజీటీ ఫలితాలు వెల్లడయ్యాయి. గత 15 రోజుల్లోనే టీజీటీ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ పోస్టుల ఫలితాలు వచ్చాయి. మిగతా భాషలకు సంబంధించిన 2వేల ఖాళీలకు వారం రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. వ్యవసాయ విస్తరణ అధికారుల ఉద్యోగాలకు సంబంధించి వివరాలన్నీ సిద్ధమయ్యాయి. వ్యవసాయశాఖ నుంచి విద్యార్హతల వారీగా వచ్చిన రోస్టర్‌ మేరకు కసరత్తు పూర్తయింది. వీటి ఫలితాలు రెండు మూడు రోజుల్లో వెల్లడికానున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సివిల్‌ ఇంజినీర్‌ పోస్టులపై న్యాయశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత వచ్చాక వాటితో పాటు డిప్యూటీ సర్వేయర్‌ ఫలితాలు వెల్లడించాలని కమిషన్‌ భావిస్తోంది. సివిల్‌ ఇంజినీరు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నుంచి డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులను వదిలేసుకుంటున్నట్లు హామీ తీసుకోనుంది. తద్వారా ఆయా ఖాళీల్లో తదుపరి మెరిట్‌కు అవకాశమివ్వనుంది. వెటర్నరీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు న్యాయవివాదాలు దూరం కాగానే ఫలితాలు ప్రకటించనుంది. అటవీశాఖలో ఖాళీలకు సంబంధించి ఫలితాల వెల్లడికి కసరత్తు పూర్తయింది. మాజీ సైనికోద్యోగుల పిటిషన్‌పై స్పష్టత వస్తే దాదాపు 2వేల పోస్టులకు సంబంధించి ఫలితాలు వెల్లడవుతాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు పోస్టుల భర్తీకి కఠిన నిబంధనలు పెడుతున్నాయి. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల అర్హతల్లో సంస్కరణలు అమలవుతున్నాయి. కానీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పాత నిబంధనలు పెట్టారు. దీంతో కొన్ని చోట్ల సరైన అభ్యర్థులు లేకపోవడంతో 340 ఖాళీలకు 5వేల మందికి వైద్య, పీఈటీ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది.



Posted on 19-04-2018