close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

నిబంధనల ప్రకారమే నియామకాలు

* రిజర్వుడ్‌ అభ్యర్థులకు అన్యాయం జరగలేదు
* గురుకులాల్లోనివి జోనల్‌ పోస్టులు
* టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల పోస్టుల నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. రిజర్వేషన్లు పాటించలేదంటూ వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. జీవో నెం.124, 763, రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు (22ఏ) ప్రకారం ఎంపికలు జరిగాయని వెల్లడించారు. గురుకులాలవి జోనల్‌ ఉద్యోగాలని.. నిబంధనల ప్రకారం అభ్యర్థుల నుంచి ఆప్షన్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనూ పొందుపరిచారని చెప్పారు. అన్‌రిజర్వుడ్‌ పదాన్ని అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరీ పేరిట తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. ఈ కేటగిరీలో రెండు జోన్లకు సంబంధించి అభ్యర్థులు పోటీపడవచ్చని, ఇక్కడా రిజర్వేషన్‌ ప్రకారం కేటాయింపులు ఉంటాయని స్పష్టంచేశారు. అన్‌రిజర్వుడ్‌లో అభ్యర్థి ఆప్షన్‌ ప్రకారం పోస్టులు లేకుంటే అప్పుడు స్థానిక కేటగిరీలో రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారని వివరించారు. తొలుత ఓపెన్‌ జనరల్‌, ఓపెన్‌ మహిళ పోస్టులు భర్తీ చేసిన తరువాత రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక నిర్వహిస్తారు. స్థానిక కేటగిరీ ఓపెన్‌ జనరల్‌లో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా, పురుష అభ్యర్థులు పోటీపడవచ్చని, ఓపెన్‌ మహిళ కేటగిరీలో అన్నివర్గాల మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. గత 25 ఏళ్లుగా ఇదే పద్ధతిలో నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇంకా ఏమన్నారంటే..
* గురుకులాల్లోనివి జోనల్‌ పోస్టులు. ఇందులో 30 శాతం అన్‌రిజర్వుడ్‌ కాగా, మిగతా 70 శాతం స్థానిక పోస్టులు. అన్‌రిజర్వుడు కేటగిరీలోనూ ఓపెన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వుడ్‌, మహిళా పోస్టులు ఉంటాయి. స్థానిక కేటగిరీలోనూ ఈ విధానమే కొనసాగుతుంది.
* జోనల్‌ పోస్టులకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుని, ఆ మేరకు నియామకాలు చేపట్టాలని రాష్ట్రపతి ఉత్తర్వులు చెబుతున్నాయి. మెరిట్‌ ప్రకారం తొలుత అన్‌రిజర్వుడ్‌ పోస్టుల్లో ఓపెన్‌ జనరల్‌ పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తరువాత ఓపెన్‌ మహిళ పోస్టులకు ఎంపికలు ఉంటాయి. ఈ రెండు కేటగిరీల తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ జనరల్‌.. మహిళా అభ్యర్థుల పోస్టులు పరిగణనలోకి తీసుకుంటారు.



Posted on 12-05-2018