close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

సర్కారు వైద్యానికి కొత్త సైన్యం

* 109 స్పెషలిస్టు వైద్య పోస్టులకు అభ్యర్థుల ఎంపిక
* జాబితాను అందించిన టీఎస్‌పీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలోని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించడానికి కొత్తగా స్పెషలిస్టు వైద్యులు అందుబాటులోకి రానున్నారు. రెండేళ్ల కిందట మంజూరు చేసిన స్పెషలిస్టు పోస్టుల భర్తీకి తాజాగా మార్గం సుగమమైంది. 109 మంది స్పెషలిస్టు వైద్య పోస్టుల కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖకు పంపించింది. ఇందులో అనిస్థిషియా 28, పాథాలజీ 14, గైనకాలజీ 32, రేడియాలజీ 2, జనరల్‌ మెడిసిన్‌ 16, ఈఎన్‌టీ 10, జనరల్‌ సర్జరీ 4, ఆర్థోపెడిక్స్‌ 1, సైకియాట్రి 1, డెర్మటాలజీ 1 స్పెషలిస్టు వైద్యుల పోస్టులున్నాయి. ఈ స్పెషలిస్టు వైద్యులను భర్తీ చేసే ప్రక్రియను టీవీవీపీ నిర్వహించనుంది. ప్రస్తుతం ఖాళీలను గుర్తించే పనిలో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఖాళీలపై స్పష్టత వచ్చాక వారం రోజుల్లోపు నియామక ప్రక్రియను నిర్వహిస్తామని టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ శివప్రసాద్‌ తెలిపారు.





Posted on 29-09-2018