close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

త్వరలో గ్రూప్‌-1 ప్రకటన

* పరిశీలనలో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌
* 18న టీఎస్‌పీఎస్సీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం
* ఆ రోజు మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో తీపికబురు అందించనుంది. నాలుగేళ్లుగా ఊరిస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటన వెలువరించేందుకు పాలనాపరమైన సాంకేతిక అడ్డంకులను అధిగమించనుంది. దాదాపు 150 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి సాంకేతిక అనుమతుల విషయమై ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత కమిషన్‌ ప్రకటనలు వెలువరించే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విభాగాధిపతుల కార్యాలయాల్లో గ్రూప్‌-3 పోస్టులకు ప్రకటన పరిశీలనలో ఉంది. డిసెంబర్‌ 18న టీఎస్‌పీఎస్సీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు నిర్ణయాలు వెలువరించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్‌-1 ప్రకటన ఇంతకుముందే వెలువరించాలని భావించినా, నూతన జోన్ల విధానం కారణంగా నిలిచిపోయింది. ఆ పోస్టులను కొత్త జోన్లవారీగా విభజించే ప్రక్రియ నాలుగు నెలల క్రితమే ప్రారంభమైంది. ఇందులో డీఎస్పీలు 42, డిప్యూటీ కలెక్టర్లు 15, జిల్లా రిజిస్ట్రార్లు, రవాణా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తదితర పోస్టులున్నాయి. గ్రూప్‌-3లో దాదాపు 800 పైగా పోస్టులున్నట్లు సమాచారం. ఈ పోస్టులకు కొత్తజోన్ల ప్రకారం ఆమోదం లభించాల్సి ఉంది. ఈ రెండు ప్రకటనలకు అదనంగా సహాయ ఇంజినీర్లు, సర్వేయర్‌ పోస్టుల ప్రకటనలు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రూప్‌-4 ర్యాంకులను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన నియామక ప్రకటనల రాతపరీక్షలన్నీ దాదాపు పూర్తయ్యాయి. మరో రెండు ప్రకటనలకు సంబంధించి పరీక్షలు జరగాల్సిఉంది. దాదాపు 14 వేల పోస్టుల ఫలితాలు తుదిదశలో ఉన్నాయి.
* జాప్యం.. ప్రక్రియకు శాపం..
వైద్య, ఆరోగ్యశాఖ జాప్యంతో దాదాపు 7 వేల పోస్టుల ఫలితాలు, ఎంపిక ప్రక్రియ నిలిచిపోయాయి. అటవీశాఖలో 1,800 అటవీ బీట్‌ అధికారుల పోస్టులకు రాత పరీక్షలు, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. వీరికి వైద్య పరీక్షల నివేదికలు ఆలస్యం కావడంతో ఫలితాలు ఆగిపోయాయి. రోజూ పరిమిత సంఖ్యలో వైద్యపరీక్షలు నిర్వహించడం, బోర్డులోని వైద్యులు రోజువారీ విధుల్లో బిజీగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. ఎఫ్‌బీవో పోస్టుల వైద్య పరీక్షల నివేదికలు వస్తే ఈ పోస్టుల ఎంపికలు పూర్తవుతాయి. దాదాపు 4,500 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలోనూ ఆలస్యమవుతోంది. ప్రభుత్వ సర్వీసులోని నర్సులకు వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. నర్సుల ఇన్‌సర్వీసును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ధ్రువీకరించాల్సి ఉంది. వెయిటేజీ ధ్రువీకరణ ఆలస్యం కావడంతో ఈ ఫలితాలు ఆగిపోయాయి.
* ఎటూ తేల్చని డీఈవోలు
ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎస్జీటీ పోస్టుల ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్‌ అభ్యర్థులకు పూర్వజిల్లా కేంద్రాల ప్రాతిపదికన ధ్రువీకరణపత్రాల పరిశీలన జరిగింది. ఈ బాధ్యతను కమిషన్‌ జిల్లా విద్యాధికారులకు అప్పగించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసిన డీఈవోలు.. ఆ అభ్యర్థి పోస్టుకు అర్హుడా? కాదా? అనే విషయాన్ని తేల్చలేదు. దీంతో మరోసారి సమాచారాన్ని సరిచేసి పంపించాలని కమిషన్‌ తెలిపింది. కొందరు అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. వారికి టీఎస్‌పీఎస్సీ మరోసారి అవకాశమిచ్చింది.
Posted on 16-12-2018