close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

నాలుగేళ్లు.. 36,182 పోస్టులు

* రికార్డుస్థాయిలో ఉద్యోగార్థుల నమోదు
* ఇప్పటికే 16,050 మందికి ఉద్యోగాలు
* నెలాఖరులోగా ఎస్జీటీ, ఎఫ్‌బీవో, గ్రూప్‌-4 ఫలితాలు
ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. భారీసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలతో పాటు నియామక విధానంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన కమిషన్‌.. ఆన్‌లైన్‌ పరీక్షలు, అభ్యర్థి మార్కులు, ర్యాంకులను వెల్లడించడంతోపాటు బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఏర్పడకుండా మెరిట్‌ కలిగిన అర్హులైన వారికి ఉద్యోగాలు లభించేలా అవకాశాలు సృష్టించింది. ఆన్‌లైన్‌ పరీక్షల అమలుకు సహకారం అందించాలని ఇటీవల మారిషస్‌ పీఎస్సీ ప్రతినిధి బృందం సైతం టీఎస్‌పీఎస్సీని సందర్శించింది. టీఎస్‌పీఎస్సీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు వెలువరించిన ఉద్యోగాల ప్రకటనలకు రాత పరీక్షలన్నీ పూర్తయ్యాయి. గతంలో వెలువరించిన ప్రకటనలకు నియామక ప్రక్రియ పూర్తిచేయగా, గతేడాది కాలంలోనే దాదాపు 10వేల మందికి పోస్టింగులు దక్కడం గమనార్హం. కేవలం 40మంది సిబ్బందితో క్లిష్టమైన రహస్య ప్రక్రియను పూర్తిచేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు 101 ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. ప్రభుత్వ విభాగాలు ఆయా పోస్టులకు సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు సరిగా పేర్కొనకపోవడంతో ఫలితాలు వెల్లడించినా కోర్టు కేసులతో ఆలస్యమవుతోంది. గ్రూప్‌-2, పీఈటీ పోస్టుల తుది ప్రక్రియ న్యాయవివాదాలతో ఆగిపోయింది.
నెలాఖరులోగా వివిధ పోస్టుల ఫలితాలు
టీఎస్‌పీఎస్సీ ఇటీవల వీఆర్‌వో పోస్టుల ఫలితాలు వెల్లడించింది. త్వరలో గ్రూప్‌-4 ర్యాంకులను ప్రకటించనుంది. ఈ రెండు పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనుంది. నెలాఖరులోగా ఎస్జీటీ పోస్టుల ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు పూర్తిచేసింది. వీటితోపాటు అటవీ బీట్‌ అధికారుల పోస్టుల ఫలితాలను ప్రకటించనుంది.

జోన్ల విభజనతో నిలిచిన పోస్టులు
ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన పోస్టుల్లో ప్రస్తుతం 1877 పోస్టులకు మాత్రమే ప్రకటనలు వెలువరించాల్సి ఉంది. ఇటీవల జోన్ల పునర్విభజన జరిగిన నేపథ్యంలో 31 జిల్లాలు, కొత్త జోన్ల మేరకు పోస్టులను విభజించాల్సి ఉంది. ఈ కారణంతోనే గ్రూప్‌-1 ప్రకటన నిలిచిపోయింది. ఈ ప్రకటనకు మార్గం సుగమం చేసేందుకు సీఎస్‌ ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏఈఈ, సర్వేయర్‌ పోస్టులున్నా వాటిని నూతన జిల్లాలు, జోన్ల మేరకు విభజించాల్సి ఉంది. ఈ విభజన ప్రక్రియ పూర్తయితే 1877 పోస్టులకు ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
Posted on 17-12-2018