close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

కామర్స్‌ను పక్కనబెట్టి ‘అకౌంటెంట్‌’ ఉద్యోగ పరీక్ష

* అకౌంటెంట్‌ ఉద్యోగాల భర్తీపై బీకాం విద్యార్థుల లబోదిబో
* ఒక పేపర్‌ వాణిజ్య శాస్త్రానికి కేటాయించాలంటున్న అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: బీకాం అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని చెబుతూ ఉద్యోగ పరీక్షలో కామర్స్‌కు సంబంధించి ప్రశ్నపత్రం లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. ఎక్సైజ్‌ శాఖలోని బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో మొత్తం 78 ఉద్యోగాల భర్తీకి ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. వాటిలో 13 అసిస్టెంట్‌ అకౌంటెంట్‌ అధికారులు(ఏఏఓ), 55 అసిస్టెంట్‌ స్టోర్‌ అధికారుల(ఏఎస్‌ఓ) ఉద్యోగాలున్నాయి. ప్రకటనను చూసి ఆనందపడ్డ కామర్స్‌ అభ్యర్థుల పోటీ పరీక్షలోని పేపర్లను చూసి కంగుతిన్నారు. పేపర్‌-1లో జనరల్‌ నాలెడ్జి, పేపర్‌-2లో సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ ఉంటుందని పేర్కొనడం వారిని నిరాశ పరిచింది. గత రెండు మూడు సంవత్సరాలుగా విద్యుత్తుశాఖలోని ఎస్‌పీడీసీఎల్‌, జెన్‌కోతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర సంస్థలు అకౌంటెంట్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటెంట్‌ అధికారుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. వీటి ఎంపికకు కామర్స్‌లో పరిజ్ఞానాన్ని పరీక్షించే పేపర్‌ ఒకటి ఉంటుంది. జలమండలిలో ఉద్యోగాలకూ అదే విధానం పాటించారు. కానీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగాల నిమాయక పరీక్షలో కామర్స్‌ పేపర్‌ లేకపోవడంపై టీఎస్‌పీఎస్‌సీ పునఃసమీక్షించాలని ఓయూ విద్యార్థులు విన్నవిస్తున్నారు. అభ్యర్థులు పలువురు జులై 25న‌ ఓయూలోని కామర్స్‌ ఆచార్యులను కలిసి తమ గోడును వెల్లబోసుకొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఓయూ కామర్స్‌ విభాగం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌ ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ సైతం అభ్యర్థుల కోరిక తార్కికమని, వారి అభ్యర్థనను సంబంధిత శాఖలు పరిగణనలోకి తీసుకోవచ్చని వినతిపత్రంపై రాశారు.




Posted on 26-07-2018