close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

డిసెంబరుకల్లా నియామకాలన్నీ పూర్తి

* టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన ఉద్యోగాలతో కలిపి 35వేల నుంచి 40వేల పోస్టులను డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. మూడేళ్ల కాలంలో 32వేల పోస్టులకు ప్రకటనలు ఇవ్వగా... 12వేలు భర్తీ చేశామన్నారు. మరో 15వేల ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. జోనల్‌ వ్యవస్థపై నిర్ణయం వెలువడిన తరువాత గ్రూప్‌-1 ప్రకటన జారీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న టీఎస్‌పీఎస్సీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2786 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేశారు. నిరుద్యోగులు ఎలాంటి వదంతులు, దుష్ప్రచారం నమ్మవద్దని, సాంకేతిక పొరపాట్లు చేయకుండా అర్హతలు కలిగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు ప్రశ్నపత్రం రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కొందరు మీడియా సంస్థలపేరిట నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. వారిపైనా న్యాయచర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన పోస్టుల్లో 3300 పోస్టులే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటికి రోస్టర్‌, విద్యార్హతలు లాంటి సాంకేతిక సమస్యలపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనతో కొత్త జోనల్‌ వ్యవస్థ తీసుకువచ్చేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణకు ప్రతిపాదనలు పంపించిందని, వాటిపై స్పష్టత వచ్చిన తరువాత 125 పోస్టులతో గ్రూప్‌-1 విడుదల చేస్తామన్నారు. పాఠశాలల్లో 8వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) జిల్లాల వారీగా మెరిట్‌ జాబితాలను వారంలోగా విడుదల చేస్తామని వివరించారు. గ్రూప్‌-2 వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయతీర్పు మేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
Posted on 03-06-2018