close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

‘అది తప్పుల తడక జాబితా’

* టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ధర్నా
నాంపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల విడుదల చేసిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఫలితాల జాబితాలో తప్పిదాలు చోటుచేసుకుని గందరగోళం నెలకొందంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన చెందారు. జూన్ 11న‌ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మార్కులు, ర్యాంకులు, కులం, నివాసం, లింగం తదితర అంశాలు తప్పుల తడకగా ఉన్న ఫలితాల జాబితాను విడుదల చేశారని ఆరోపించారు. కమిషన్‌ నిర్లక్ష్య వైఖరి కారణంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఫలితాల జాబితాలో రాష్ట్ర 21వ ర్యాంకు అభ్యర్థి రామకృష్ణారెడ్డి (హాల్‌టికెట్‌ నం.1752705177) మాట్లాడుతూ తనకు వందకు 67.04 మార్కులతో 9వ ర్యాంకు రావాల్సి ఉండగా, ప్రకటించిన ఫలితాల్లో 65.57 మార్కులు, 21వర్యాంకు వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1వ, 2వ ర్యాంకుల అభ్యర్థులకు కూడా మార్కుల జాబితాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో పొరపాట్లు దొర్లాయన్నారు. టీఆర్‌టీ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫలితాలను పునఃసమీక్షించి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
Posted on 12-06-2018