close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

67 ప్రశ్నలను తొలగిస్తే ఎంపిక ప్రక్రియ ఎలా?

* గురుకులాల్లో ‘ప్రిన్సిపల్‌’ పోస్టుల భర్తీపై టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో 304 ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకీ నిర్వహించిన పరీక్ష పేపర్లలో 67 ప్రశ్నలను తొలగించాక ఎంపిక ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను(టీఎస్‌పీఎస్సీ) హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులను ఆదేశించింది. ఈమేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.గురుకుల విద్యాసంస్థల్లో ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి గతేడాది జూన్‌ 2న జారీచేసిన ప్రకటనను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా గూడూరుకు చెందిన కె.బాలకృష్ణ ముదిరాజ్‌, మరొకరు వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ..ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాల్లో ఇచ్చిన ప్రశ్నలే యథాతథంగా మొదటి, రెండో పరీక్ష పేపర్లో మొత్తం 300 ప్రశ్నలకు 67 ప్రశ్నలు వచ్చాయన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి టీఎస్‌పీఎస్సీ ఆ 67 ప్రశ్నలను తొలగిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..67 ప్రశ్నలను తొలగించాక ఎంపిక ప్రక్రియలో ఎలా ముందుకెళతారని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వివరాలు సమర్పించడం కోసం వారం గడువు కోరడంతో అందుకు అంగీకరించింది.




Posted on 13-06-2018