close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పోటీ పడేది లక్ష మంది లోపే?

* టీజీటీ పోస్టులకు టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత తప్పనిసరి
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో టీజీటీల నియామకానికి టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనకు లక్ష మంది లోపే దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పేపర్‌-2లో ఉత్తీర్ణులైన వారే ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో అభ్యర్థుల సంఖ్య పరిమితంగానే ఉండనుందని భావిస్తున్నారు.
తాజాగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌-2కి 2,51,906 మంది హాజరయ్యారు. వారిలో 63,079 మంది (25.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకసారి ఉత్తీర్ణులైతే ఆ మార్కులను ఏడేళ్లపాటు పరిగణనలోకి తీసుకుంటారు. అయినా సరే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నందున మార్కులను పెంచుకునేందుకు అభ్యర్థులు మళ్లీ మళ్లీ రాస్తున్నారు. ఒకవేళ గతంలో రాసి ఉత్తీర్ణులైన వారు మే నెలలో పరీక్షకు హాజరు కాలేదనుకున్నా ఎట్టిపరిస్థితుల్లోనూ మరో 40 వేల మందికి మించి ఉండరని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
మహిళలకు భలే అవకాశం..: మొత్తం 4,362 టీజీటీ పోస్టుల్లో గరిష్ఠంగా మహిళలకు కేటాయించారు. గత మే నెలలో జరిగిన టెట్‌ పేపర్‌-2లో అర్హులైన మహిళలు కేవలం 27,864 మందే. అంతకుముందు నాలుగు టెట్లలో ఉత్తీర్ణులైన వారితో కలుపుకున్నా ఆ సంఖ్య 40 వేలకు మించదని అంచనా. ప్రాథమిక పరీక్ష నుంచి ఒక్కో పోస్టుకు 15 మందిని మెయిన్‌కు ఎంపిక చేస్తారు. దాంతో మహిళా పోస్టులకు పోటీపడే వారు తక్కువే ఉండొచ్చని అంచనా.
గత మే నెలలో జరిగిన టెట్‌లో ఉత్తీర్ణులై కూడా ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉన్నవారు దాదాపు 3,800 మంది ఉన్నారు. ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ కోడ్‌ తప్పుగా రాయడం వారికి శాపమైంది. ఆ విషయాన్ని ఇన్విజిలేటర్‌ కూడా పరిశీలించకపోవడంతో వారందరూ నరకం అనుభవిస్తున్నారు. వారిలో పేపర్‌-2 అభ్యర్థులు 1000 మంది వరకు ఉంటారని అంచనా. అధికారులను ఎన్నిసార్లు కలిసి విన్నవించుకున్నా.. నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
Posted on 08-02-2017