close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేష‌న్‌

సిలబస్‌ ఒకటే...సిద్ధమవుదామా?

* 5 ప్రకటనలు.. 293 పోస్టులు
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల 5 నియామక ప్రకటనలను వెలువరించింది. ఇంటర్‌, డిగ్రీ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉండటంతో పరీక్షార్థులు వీటిపై దృష్టి సారించవచ్చు! ఇప్పటికే వెలువడిన వివిధ పోటీపరీక్షలకు సన్నద్ధత ప్రారంభించినవారికి ఒకరకంగా ఇది కలిసొచ్చే అంశమే. సిలబస్‌ కూడా దాదాపు ఒకేలా ఉండటం విశేషం!
బెవరేజెస్‌ కార్పొరేషన్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌, పురపాలక శాఖ, డెయిరీ సమాఖ్యల్లో 293 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటికే ప్రకటనలు వెలువడిన పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, గ్రూప్‌-4, వీఆర్‌ఓ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. వీరికి మరో అవకాశం ప్రస్తుతం ప్రకటించిన పోస్టులని చెప్పవచ్చు. కొద్దిపాటి మార్పులతో కూడిన సన్నద్ధతతో వీటికీ పోటీ పడవచ్చు.
జీవశాస్త్ర విద్యార్థులకు మంచి అవకాశం
డెయిరీ సమాఖయలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పురపాలక శాఖలోని హెల్త్‌ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఇంటర్‌, డిగ్రీల్లో బయాలజీ చదివినవారు తమ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకోవాలి. వీటిలో ఎక్కువ మార్కులు సాధించుకుంటే ఉద్యోగ సాధనలో ముందంజలో ఉంటారు. జనరల్‌స్టడీస్‌ను ఇప్పటికే వివిధ పోటీపరీక్షలు రాసి అనుభవం ఉన్న అభ్యర్థులు చదివి ఉంటారు. కాబట్టి ఈ అభ్యర్థులు ప్రస్తుతం తమ నిర్దిష్ట సబ్జెక్టును చదివితే ఉపయోగకరం. దీనికోసం తెలుగు అకాడమీ ఇంటర్‌, డిగ్రీ వృక్ష, జంతుశాస్త్ర పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. గురుకుల పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు జీవశాస్త్రానికి సంబంధించిన సిలబస్‌ ఉన్న ఈ పోస్టుల ప్రిపరేషన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
గ్రూప్‌-4, వీఆర్‌ఓ పోస్టులకు సన్నద్ధమవుతున్నవారు
ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఉన్న దాదాపు అన్ని పోస్టుల సిలబస్‌, గ్రూప్‌-4, వీఆర్‌ఓ పోస్టుల సిలబస్‌ దాదాపుగా ఒకటే. కాబట్టి అభ్యర్థులు ఈ పోస్టులకు ప్రత్యేకంగా తయారవకుండానే నేరుగా పరీక్ష రాయవచ్చు. అయితే తాము ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో సరిచూసుకుంటూ వాటిని మళ్లీ చదువుతూ సిద్ధమవ్వాలి. ఎక్కువగా నమూనా పరీక్షలపై దృష్టిసారిస్తే మంచిది.
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు
కొద్దిపాటి తేడా మినహా పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకూ, ప్రస్తుత పోస్టులకూ సిలబస్‌ ఒకేరకంగా ఉంది. అభ్యర్థులు మొదట ఈ పోస్టులకు వేరుగా ఉన్న సిలబస్‌ను వేరు చేసి చదవాలి. ఈ అభ్యర్థులు కొన్ని అంశాలను చాలా విస్తృతంగా చదివేసి ఉంటారు. కాబట్టి జనరల్‌స్టడీస్‌, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
అన్నిటికీ జనరల్‌స్టడీస్‌ ఒకటే!
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి వెలువడిన అన్ని పోస్టులకూ జనరల్‌స్టడీస్‌ సిలబస్‌ ఒకేరకంగా ఉండటం పోటీ పరీక్షార్థులకు అనుకూలించే విషయం. జనరల్‌స్టడీస్‌లో పట్టు సాధించడం కోసం వార్తాపత్రికల్లోని జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలను చదువుతూ, నోట్్స రాసుకోవాలి. సైన్స్‌, జాగ్రఫీ, హిస్టరీ లాంటి వాటికి ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. తెలంగాణకు సంబంధించిన అంశాలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయుక్తం. జనరల్‌స్టడీస్‌ పరిధి విస్తృతంగా ఉంటుంది. కాబట్టి, వీటిలో ఎక్కువ మార్కులు సాధించడం కోసం మరింతగా కష్టపడాలి. సిలబస్‌లోని మొత్తం 11 విభాగాల్లో 20కి పైగా అంశాలున్నాయి. అభ్యర్థులు వీటిలో ఒక్కోదాన్ని వేరుచేసి జాగ్రత్తగా గమనిస్తూ చదవాలి.
జనరల్‌స్టడీస్‌లో
* వర్తమాన విషయాలు
* అంతర్జాతీయ సంబంధాలు-సంఘటనలు ‌
* నిత్యజీవితంలో జనరల్‌సైన్స్‌
* పర్యావరణ సమస్యలు-విపత్తు నిర్వహణ ‌
* భారతదేశం, తెలంగాణ రాష్ట్ర భౌగోళికాంశాలు-ఆర్థికవ్యవస్థ
* భారత రాజ్యాంగం ‌
* భారత రాజకీయవ్యవస్థ, ప్రభుత్వం ‌
* ఆధునిక భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం ‌
* తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ఉద్యమం ‌
* తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం ‌
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అధ్యయనం చేయాల్సివుంటుంది.
సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌లో
* మెంటల్‌ ఎబిలిటీ ‌
* లాజికల్‌ రీజనింగ్‌
* కాంప్రహెన్షన్‌
* రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌
* న్యూమరికల్‌ అండ్‌ అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీస్‌పై పట్టు సాధించాలి.
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రత్యేక సన్నద్ధత
మిగతా పోస్టులతో పోలిస్తే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రత్యేక సంసిద్ధత అవసరం. ఈ పోస్టుల్లో రెండు పేపర్‌లలో సిలబస్‌ విస్తారంగా ఉండటమే ఇందుకు కారణం. జనరల్‌స్టడీస్‌ పేపర్‌లో లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, బేసిక్‌ ఇంగ్లిష్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారతదేశ అభివృద్ధి అంశాలు అదనంగా ఉన్నాయి. ఈ పేపరు గ్రూప్‌-2 జనరల్‌స్టడీస్‌ పేపర్‌ను పోలి ఉంది. దీనికి కేటాయించిన మార్కులు కూడా ఎక్కువే. కాబట్టి ఈ అంశాలను లోతుగా చదవాలి.
ఈ పోస్టులకు పేపర్‌-2 సిలబస్‌ డిగ్రీ స్థాయిలో ఉంది. 150 మార్కులు ఉన్న ఈ పేపర్‌ సబ్జెక్టు ఆధారిత పేపర్‌ కాబట్టి, మరింత శ్రమ పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు అభ్యర్థులు తాము డిగ్రీలో చదివిన పాఠ్యాంశాలను, పుస్తకాలను మళ్లీ ఇప్పుడు చదివితే సబ్జెక్టును బాగా అర్థం చేసుకోవచ్చు.

Posted on 30-07-2018