closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

శాత‌వాహ‌నుల కాలం నాటి సాంఘిక‌, మ‌త‌, సాంస్కృతిక ప‌రిస్థితులు

* శాతవాహనుల కాలంలో ఉపకులాలు
* పండిత గోష్ఠుల్లో స్త్రీలు
తెలంగాణ చరిత్ర, సంస్కృతిలో భాగంగా శాతవాహనుల కాలం నాటి పరిస్థితులను సమగ్రంగా తెలుసుకోవడం ద్వారా టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించవచ్చు. ఈమేరకు ఆనాటి సాంఘిక జీవనం, ఆచార వ్యవహారాలు, నిర్మాణాలు, రచనలు తదితర అంశాలపై మెరుగైన అవగాహన సాధించాలి.
నాణేల వాడకం
* శాతవాహనులు సీసం, పొటిన్, రాగి, వెండి నాణేలు ముద్రించేవారు.
* కార్షాపణం, కుశనం, సువర్ణం, పదక లేదా ప్రతీక అనే నాణేలు శాతవాహనుల కాలంలో వాడుకలో ఉండేవి. ఆకారంలో గుండ్రంగా, చతురస్రంగా, అండాకృతిలో ఉండేవి. వాటిపై రాజుల పేర్లు, ఏనుగు, గుర్రం, వృషభం, త్రిరత్న, స్వస్తిక్, నందిపాద, సూర్యబింబం, శంఖం, కమలం, నాగ చిహ్నాలు ఉండేవి.
* గౌతమీపుత్ర, యజ్ఞశ్రీ శాతకర్ణిల వెండి నాణేలు కొల్హాపూర్, జోగల్తంబిల్లో లభించాయి.
* సీసపు నాణేలు ప్రాచీనమైనవి.
* వెండి నాణేలను కార్షాపణాలు, బంగారు నాణేలను సువర్ణాలు అని పిలిచేవారు. ఒక బంగారు నాణెం విలువ 35 వెండి నాణేలకు సమానం.
* గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నుంచి శాతవాహనుల వెండి నాణేలపై ప్రాకృతం, దేశీ అనే రెండు భాషలుండేవి.
వర్ణ వ్యవస్థ
* శాతవాహనుల కాలం నాటికి వర్ణవ్యవస్థ స్థిరపడలేదు.
* బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుండేవి. వృత్తులను బట్టి ఉపకులాలు ఏర్పడ్డాయి. కులవ్యవస్థ దృఢంగా లేదు. వృత్తి మార్పిడి ఉండేది.
* గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణసంకరాన్ని నిరోధించాడని నాసిక్ శాసనం ద్వారా తెలుస్తోంది.
* హాలిక (వ్యవసాయం), గోలిక (గోవులు కాసేవారు), కోలిక (నేత పని) తదితర ఉపకులాలుండేవి.
* విదేశీయులు దేశంలో స్థిరపడి, హిందూమతాన్ని పాటించారు.
* పితృస్వామ్య వ్యవస్థ ఉండేది.. సమష్టి కుటుంబాలుండేవి.
* కుటుంబ సభ్యులంతా కలిసి దానాలు చేయడం అమరావతి శాసనంలో కనిపిస్తుంది. ధిమిక అనే చర్మకారుడు కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్తూపానికి పూర్ణకుంభాన్ని బహూకరించి శాసనం వేయించాడు.
* బ్రాహ్మణులు ప్రత్యేక సౌకర్యాలను అనుభవించేవారు. క్షత్రియులు పన్నులు వసూలు చేసేవారు. వైశ్యులు భూయజమానులుగా, శూద్రులు వీరందరికీ సేవలు చేసేవారుగా ఉండేవారు.
* శాతవాహనుల కాలంలో బానిసలు కూడా ఉండేవారు.
* సతీ సహగమనం ఉండేదని 'గాథాసప్తశతి' ద్వారా.. సతీసహగమనాన్ని చూసిన గ్రీకులు దిగ్భ్రాంతికి గురయ్యారని 'స్ట్రాబో' ద్వారా తెలుస్తోంది. నాగార్జునకొండ శిల్పంలో సతీసహగమన దృశ్యం ఉంది.
గౌరవప్రదమైన మహిళా జీవనం
* స్త్రీలకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం ఉండేది.
* స్త్రీలు తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించేవారు.
* సమకాలీన స్మృతి గ్రంథాల్లో ఆరు విధాలైన స్త్రీ ధనం గురించి ఉంది.
* పురుషులతో పాటు స్త్రీలు మత కార్యక్రమాల్లో, పండిత గోష్ఠుల్లో పాల్గొనేవారు.
* స్త్రీ కవుల గురించి గాథాసప్తశతిలో ఉంది.
* అప్పటి స్త్రీలు బౌద్ధ విహారాలకు భూరి దానాలు చేసేవారు.
* స్త్రీ, పురుషులకు ఆభరణాలంటే ఇష్టం.. వారు కనీస వస్త్రధారణే చేసేవారని అమరావతి శిల్పాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
* స్త్రీలకు ఎర్రని వస్త్రాల మీద మక్కువ ఎక్కువ.
* నృత్యకారిణులు 'ఆరదళం' అనే పైపూతను వాడేవారు.
* నృత్య సంగీతాలు కాలక్షేపాలుగా ఉండేవి.
* వీణ, వేణువు, మృదంగం, శంఖం వంటి వాయిద్యాలుండేవి.
* వాత్సాయన కామ సూత్రాల్లో హాలక, ఉద్యానగమన, ఘాటా నిబంధన, మదనోత్సవాల వంటి పండుగల ప్రస్తావన ఉంది.
వైదిక మతం
* శాతవాహన రాజులు వైదిక మతాన్ని అనుసరించి, ఆ మతోద్ధరణ చేశారు.
* మొదటి శాతకర్ణి అనేక యజ్ఞ యాగాలు చేసి బ్రాహ్మణులకు దానాలు చేశాడు.
* గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించి, 'ఏక బ్రాహ్మణ', 'ఆగమనిలయ' అనే బిరుదులను ధరించాడు.
* వేదిశ్రీ, యజ్ఞశ్రీ వంటి పేర్లు శాతవాహనుల వైదిక మతాభిమానాన్ని సూచిస్తాయి.
* నానాఘాట్ శాసనం ప్రకారం.. ఇంద్ర, సంకర్షణ, వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ అనేవారు దేవతలు.
* హిందూమతం స్థానంలో పౌరాణిక హిందూమతం ప్రవేశపెట్టారు.
* శైవ వైష్ణవాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. శివ కేశవులను పూజించడం ప్రారంభించారు.
* పశుపతి, రుద్ర, గణపతి, గౌరి, పార్వతి తదితర శైవ దేవతల గురించి గాథాసప్తశతి పేర్కొంది.
* లీలావతి కావ్యం ప్రకారం.. 'సప్త గోదావరి(ద్రాక్షారామం)' భీమేశ్వర స్వామికి చెందిన శైవతీర్థం. స్వామికి అక్కడ కనక దేవాలయం ఉన్నట్లు, అక్కడే పాశుపత మఠం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
* వాసుదేవుడు(కృష్ణుడు) ప్రధాన దైవంగా ఉన్న వైష్ణవ మతం శాతవాహనుల కాలంలోనే ఉత్తరదేశం నుంచి దక్షిణానికి ముఖ్యంగా శాతవాహన రాజ్యానికి వచ్చింది.
* కృష్ణుడిని మధు మథనుడని, దామోదరుడని.. మధుర భక్తికి ప్రతీకగా నిలిచిన రాధను భారతీయ వాఞ్మయంలో మొదటగా గాథాసప్తశతే పేర్కొంది.
జైన మతం
* ఆశోకుడి మనవడు సంప్రతి అమరావతి దగ్గర వడ్డెమాను కొండపై జైన విహారాన్ని నిర్మించాడు. ఇతడిని 'జైన ఆశోకుడి'గా అభివర్ణించారు.
* అక్కడే ఖారవేలుడు కూడా మహామేఘవాహన విహారాన్ని నిర్మించినట్లు ఇటీవల దొరికిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడు మొదట జైనమతాన్ని అనుసరించి తన రాజ్య సంక్షేమం దృష్ట్యా బ్రాహ్మణ మతంలోకి మారాడు. అతడి నాణేలు కరీంగనర్ జిల్లా మునులగుట్ట వద్ద లభ్యమయ్యాయి.
* గుంటుపల్లి గుహలు జైనులవని అక్కడ దొరికిన ఖారవేలుడి శాసనం ద్వారా తెలుస్తోంది.
* క్రీ.శ. మొదటి శతాబ్దంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు గుంతకల్లుకు దగ్గరగా ఉన్న కొనకొండ్ల సమీపంలోని కొండపై నివసించేవాడని అక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది. అతని అసలు పేరు పద్మనంది భట్టారకుడు. సరస్వతి గుచ్చను స్థాపించిన అతను 'సమయసారం' అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇది శ్వేతాంబరులు, దిగంబురులకు అనుసరణీయమైందిగా చెబుతారు.
* జైనులు వెంకటతాటిపురి అనే ప్రదేశంలో జైన సమావేశాన్ని జరిపారని జైనసాహిత్యం ద్వారా తెలుస్తోంది.
బౌద్ధ మతం
* శాతవాహన చక్రవర్తులు బౌద్ధాన్ని ఆదరించకపోయినా.. బౌద్ధం ఒక ప్రజా ఉద్యమంగా విస్తరించింది.
* నాటి శాసనాల ప్రకారం.. వర్తకులు, స్త్రీలు, సామాన్య ప్రజానీకం బౌద్ధాన్ని పోషించి, స్తూప, చైత్య విహారాలు నిర్మించారు. ఈ ప్రజాభిమానం చూసిన చక్రవర్తులు బౌద్ధం పట్ల సహనం పాటించారు.
* గౌతమీపుత్ర శాతకర్ణి, అతడి కుమారుడు పులోమావి బౌద్ధులకు దానధర్మాలు చేశారు.
* ధాన్యకటకం మహా సాంఘిక కేంద్రంగా రూపు దాల్చింది.
* అమరావతి శాసనంలో చైత్యకుల ప్రస్తావన ఉంది.
* చైత్యకవాద శాఖ స్థాపకుడు మహాదేవ బిక్షువు (ఆంధ్రలో ప్రథమ బౌద్ధాచార్యుడు).
* బుద్ధుడికి మొదటిసారిగా చైత్యకులు లోకోత్తర గుణాలను (దేవుడి లక్షణాలను) ఆపాదించారు.
* చైత్యకులు బుద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు.
* మహా సాంఘిక చైత్యక సిద్ధాంతాలే కాలక్రమంలో మహాయానానికి దారితీశాయి.
* ఆచార్య నాగార్జునుడు రచించిన 'ప్రజ్ఞాపారమిత శాస్త్రం' మహాయానానికి ప్రామాణిక గ్రంథం.
భాష - సాహిత్యం
* శాతవాహనుల కాలంలో విద్య, భాషా రంగాల అభివృద్ధికి విశేషమైన కృషి జరిగింది.
* శాతవాహన రాజులు శబ్ద, అర్ధ, రూప, గణక, లేఖక, విధి, వ్యవహారం, గాంధర్వ విద్యల్లో ప్రవీణులు.
* రాజులు గురుకులాలను స్థాపించారు. వాటిలో అర్ధ, తర్కం వ్యాకరణ, సంగీత, వేదాంతం, జ్యోతిష, రాజనీతి శాస్త్రాలను బోధించేవారు.
* నాగార్జున కొండ, ధాన్యకటకాల్లో గొప్ప విశ్వవిద్యాలయాలుండేవి. ప్రపంచం నలు మూలల నుంచి విద్యార్థులు వచ్చేవారు.
* ధాన్యకటక విశ్వవిద్యాలయ నమూనా ఆధారంగానే లాసాలోని విశ్వవిద్యాలయాన్ని నిర్మించారని టిబెట్‌లో ప్రచారంలో ఉంది.
* శాతవాహనుల రాజభాషగా ప్రాకృతాన్ని కొనసాగించారు. వీరి శాసనాలన్నీ ప్రాకృత భాష, బ్రాహ్మిలిపిల్లో ఉన్నాయి.
* శాతవాహన రాజుల్లో 17వ వాడైన హలుడు స్వయంగా కవి. అతనికి 'కవివత్సలుడు' అనే బిరుదు ఉంది. ప్రాకృత భాషలో 700 శృంగార గాథలను 'గాథాసప్తశతి' అనే గ్రంథంలో పొందుపరిచాడు.
* గాథాసప్తశతి ద్వారా చుల్లువా, అమరరాజ, కుమారె, మకరంద సేన, శ్రీరాజ, రేవ, మాధవి, ఆంధ్రలక్ష్మి తదితర ప్రాకృత కవుల, కవయిత్రుల పేర్లు తెలుస్తున్నాయి. ఈ గ్రంథంలో ప్రకృతి శోభ, గ్రామీణ వాతావరణం శివపార్వతులు, లక్ష్మీనారాయణుల గురించి వర్ణించారు.
* గుణాఢ్యుడు బృహత్కథను పైశాచీ భాషలో రచించాడు.
* ఈ గ్రంథంలో ఒక్క లంబకం (అధ్యాయం) మాత్రమే ఉంది. దీని ఆధారంగా సోమదేవసూరి 'కథాసరిత్సాగరం', క్షేమేంద్రుడు 'బృహత్కథామంజరి', కీ.శ. 9వ శతాబ్దంలో బుధస్వామి 'బృహత్కథాశ్లోక సంగ్రహం'లను సంస్కృత భాషలో రచించారు.
* ఈ కాలానికే చెందిన శర్వవర్మ 'కాతంత్ర వ్యాకరణం' అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.
* భారతదేశంలో మొదటి పూర్తి సంస్కృత శాసనం శకరుద్రదాముడిది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన సిద్ధాంత గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి.
* ఈ కాలంలో ప్రాకృత భాష ప్రాధాన్యాన్ని కోల్పోయి, సంస్కృత భాష వెలుగులోకి వచ్చింది. దీంతో బౌద్ధులు రచనలను సంస్కృత భాషలో చేయడం ప్రారంభించారు.
* ఈ కాలంలో 'దేశీ' అనే మరో భాష ఉన్నట్లు 'బృహత్కథ' ద్వారా తెలుస్తోంది. ఇది సామాన్య ప్రజల భాష. శాతవాహన రాజుల్లోని 'పులోమావి' పేరు దేశీ పదమే.
* గాథాసప్తశతిలో అత్త, పొట్ట, వాలుగ, పిల్ల, పంది, అద్దం, తీరదు, కుసమ, వేంట(పత్తి), తుప్ప(నేయి) వంటి తెలుగు (దేశీ) పదాలున్నాయి.
* హాలుడి కాలం నుంచి 'గాథ' అనేది తెలుగు ఛందో రూపంగా వృద్ధి చెందింది.
వాస్తు శిల్పాలు
* హాలుడి గాథాసప్తశతిలో గౌరి, గణపతి, ఇంద్ర వంటి దేవతలకు ఆలయాలు నిర్మించినట్లు ఉంది. ఈ కాలంలో నిర్మాణాలకు మతమే ప్రధాన ప్రేరకం.
* ఇటీవల బయట పడిన.. క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదిగా చెబుతున్నగుడిమల్లం (చిత్తూరు జిల్లా) లోని ప్రఖ్యాత శివలింగం శాతవాహనుల కాలానికి చెందిందే.
* ఈ కాలంలో బౌద్ధ శిల్పకళ ఉన్నత స్థాయికి చేరింది.
చైత్యగృహం
ఇది బుద్ధుడి దేవాలయం. ఇక్కడ నిత్యం పూజలు జరిగేవి. దీన్నే చైత్యాలయం లేక చైత్యగృహం అనేవారు. శాతవాహనుల కాలం నాటి తొలి చైత్యగృహం గుంటుపల్లిలో ఉంది. ఖేడ్స, నాసిక్, కన్హేరి, కార్లేల్లో చైత్యగృహాలు ఉన్నాయి. శాలిహుండం, గుంటుపల్లి, నాగార్జున కొండ, రామతీర్థం తదితర ప్రాంతాల్లో ఇటుకలతో నిర్మించిన చైత్యాలయాలుండేవి. చైత్యాలయాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి.
విహార సంఘారామాలు
బౌద్ధ బిక్షువులు ఉండటానికి ఉద్దేశించినవి విహారాలు. గుంటుపల్లిలో గుహ విహారాలున్నాయి. ఇవి చతురస్రాకారంలో ఉంటాయి. ఒకే ఆవరణలో స్తూపం, చైత్యం, విహారం, విద్యా కేంద్రం ఉంటే దాన్ని సంఘారామం అనేవారు. రామతీర్థ ం, నాగార్జున కొండ, శాలిహుండం తదితర ప్రాంతాల్లో ఇటుకలతో నిర్మించిన వి హారాలుండేవి. హుయాన్‌త్సాంగ్ ఆంధ్రదేశంలో 40 సంఘారామాలున్నట్లు పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంపై ఏడంతస్తుల విహారాన్ని నిర్మించినట్లు, అందులో 1500 గదులున్నట్లు పాహియాన్ రచనల ద్వారా తెలుస్తోంది.
అమరావతి స్తూపం
అమరావతి స్తూపాన్ని ఆశోకుడి కంటే ముందే ఒక నాగరాజు నిర్మించాడు. శాతవాహనుల కాలంలో దీన్ని అభివృద్ధి చేశారు. క్రీ.శ. 150లో పునరుద్ధరించారు. పునాదుల దగ్గర ఈ స్తూపం వ్యాసం 162 అడుగులు. దానిపైన అండం వ్యాసం 142 అడుగులు. స్తూపం చుట్టూ వేదికలుండేవి. ప్రతి వేదికపై ఆయక స్తంభాలుగా పిలిచే నిలువు స్తంభాలుండేవి. వీటిపై బుద్ధిడి జీవితంలోని 5 ముఖ్య ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలు ఉండేవి. అవి 1) బుద్ధుడి జననం - పద్మం. 2) మహాభినిష్క్రమణ - గుర్రం. 3) జ్ఞానోదయం - బోధివృక్షం. 4) ధర్మచక్ర ప్రవర్తనం - ధర్మచక్రం. 5) నిర్యాణం (మరణం) - స్తూపం. అమరావతి స్తూపాన్ని కల్నల్ మెకంజీ 1797లో కనుక్కున్నాడు. ఈ శిథిలాల్లో 'నాగబు' అనే తెలుగు పదం ఉన్న రాతి ఫలక దొరికింది.
చిత్ర లేఖనం
అజంతాలోని 9, 10 గుహల వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటివే. పదో గుహలోని 'శ్వేతగజ జాతక' చిత్రం ఈ కాలానిదే.

బౌద్ధ నిర్మాణాలు
బౌద్ధ నిర్మాణాల్లో ముఖ్యమైనవి స్తూప, చైత్య, విహారాలు. బుద్ధుడు లేదా ప్రముఖ బౌద్ధ మతాచార్యుల శరీర అవశేషాలపై నిర్మించినవే స్తూపాలు లేక చైత్యాలు. ఇవి 3 రకాలు.
దాతుగర్భాలు: ఇవి బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించినస్తూపాలు. భట్టిప్రోలు, అమరావతి, ఘంటశాల, శాలిహుండం, జగ్గయ్యపేట, ఇంద్రపురి.. ఇవన్నీ దాతుగర్భ స్తూపాలు.
పారిభోజకాలు: గొప్ప బౌద్ధ మత గురువులు వాడిన వస్తువులపై నిర్మించినవి.
ఉద్దేశిక స్తూపాలు: వ్యక్తుల జ్ఞాపకార్థం నిర్మించినవి.
రెండో బుద్ధుడు నాగార్జునుడు
ఆచార్య నాగార్జునుడి జన్మస్థలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. 'లంకావతార సూత్ర'ను అనుసరించి దక్షిణాపథంలోని వేదలి అతడి జన్మస్థలం. అతను మాధ్యమికవాదం, మహాయానం, శూన్యవాద సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంలో మహాచైత్య, మహా విహారాలను నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రాకారాన్ని నిర్మించినట్లు టిబెటన్ ఐతిహ్యాల ద్వారా తెలుస్తోంది. శంకరుడి మాయావాద సిద్ధాంతానికి నాగార్జునుడు మార్గదర్శి. అతను 'సుహృల్లేఖ' గ్రంథం రచించి యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు. దీన్ని విద్యార్థులు కంఠస్థం చేసేవారని ఇత్సింగ్ తన రచనల్లో పేర్కొన్నాడు. రెండో బుద్ధుడు, ఇండియన్ ఐన్‌స్టీన్ అనేవి ఆచార్య నాగార్జునుడికి ఉన్న బిరుదులు. అతను శ్రీ పర్వతంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు విదేశీ యాత్రికుడు పాహియాన్ రచనల ద్వారా తెలుస్తోంది. నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం గురించి 'రత్నావళి రాజ పరికథ' గ్రంథంలో పేర్కొన్నాడు. కథాసరిత్సాగరం ప్రకారం నాగార్జునుడిని, అనంతరం గురుపీఠాన్ని అధీష్టించిన ఆర్యదేవుడిని బ్రాహ్మణులే హత్య చేయించారంటారు.
ముఖ్యాంశాలు
* దక్షిణ దేశ రాజకీయ చరిత్ర శాతవాహనులతో ప్రారంభమైంది.
* శాతవాహనులు ఆంధ్రుల భృత్యలు - అని వి.ఎస్.సుక్తంకర్, శ్రీనివాస శాస్త్రి పేర్కొన్నారు.
* శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు.
* మొదటి శాతకర్ణి భార్య నాగానిక. అతడి మరణాంతరం 'నానాఘాట్' శాసనాన్ని వేయించింది. ఈ శాసనంలో మొదటి శాతకర్ణిని 'దక్షిణాపదపతి'గా పేర్కొన్నారు.
* ఒకటో పులోమావి మగధ రాజ్యాన్ని ఆక్రమించి శాతవాహన రాజ్యాన్ని అఖిల భారత రాజ్యంగా రూపొందించాడు.
* శాతవాహనుల్లో గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి.
* గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి బాలశ్రీ. అతడి మరణానంతరం 'నాసిక్ శాసనం' వేయించింది. ఇందులో అతడి విజయాల గురించి పేర్కొన్నారు.
* తమ పేర్లకు ముందు తల్లుల నామాలను (మాతృసంజ్ఞలు) ధరించే సంప్రదాయం గౌతమీపుత్ర శాతకర్ణితో ప్రారంభమైంది.
* గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు - త్రిసముద్రతోయ పీతవాహనుడు, బెణాకటస్వామి.
* యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి పారావత మహా విహారాన్ని నిర్మించాడు.
* నౌకాముద్ర ఉన్న నాణేలు విదేశీ వాణిజ్యాన్ని తెలుపుతున్నాయి.
* మూడో పులోమావి చివరి శాతవాహన పాలకుడు.
* మూడో పులోమావి శాసనం మ్యాకదోని (బళ్లారి జిల్లా, కర్ణాటక)లో దొరికింది. ఇందు లో 'గుల్మిక' అనే పదాన్ని ప్రస్తావించారు.
* అనేక గ్రామాలను కలిపి 'గుల్మి' అని, వాటి అధిపతులను 'గుల్మికులు' అని పిలిచేవారు.
* దక్షిణ దేశంలో మొదటిసారిగా భూమిని దానం చేసినవారు శాతవాహనులు.
* పితృస్వామ్య వ్యవస్థ ఉండేది.
* ధిమిక అనే చర్మకారుడు అమరావతి స్తూపానికి పూర్ణకుంభాన్ని బహూకరించాడు.
* శాతవాహనులు బ్రాహ్మణ మతాన్ని అనుసరించారు.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమిత శాస్త్రం మహాయానానికి ప్రామాణిక గ్రంథం.
* గుడిమల్లంలోని శివలింగం శాతవాహనుల కాలం నాటిదే.
మాదిరి ప్రశ్నలు
1. శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీముఖుడి కాలానికి చెందిన నాణేలు లభించిన కోటిలింగాల తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?
జ: కరీంనగర్
2. క్రీ.పూ.6వ శతాబ్దం నాటి 16 జనపదాల్లో ఒకటైన అస్మకరాజ్యం తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది?
జ: నిజామాబాద్
3. ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించిన నాణేలపై విస్తృత పరిశోధన చేసిన పరిశోధకుడు ఎవరు?
జ: రాజారెడ్డి
4. ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి చారిత్రక అవశేషాలు బయల్పడ్డ గాజుల బండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది?
జ: నల్గొండ
5. కోటిలింగాల ఏ నదీ తీరంలో ఉంది?
జ: గోదావరి
6. శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని పేర్కొన్నది ఎవరు?
జ: వి.వి.మిరాషీ
7. శాతవాహనుడి నాణేలు ఎక్కడ దొరికాయి?
జ: కొండాపూర్
8. 'నేచురల్ హిస్టరీ' గ్రంథాన్ని రచించిందెవరు?
జ: ప్లినీ
9. పురాణాలు పేర్కొన్న శాతవాహన రాజుల సంఖ్య?
జ: 30
10. శాతవాహన రాజ్య స్థాపకుడెవరు?
జ: శ్రీముఖుడు
11. కోటిలింగాలలో ఏ శాతవాహన పాలకుడి నాణేలు లభించాయి?
జ: శ్రీముఖుడు
12. మొదట జైన మతాన్ని అనసరించి తర్వాత బ్రాహ్మణ మతంలోకి మారిన శాతవాహన పాలకుడెవరు?
జ: శ్రీముఖుడు
13. నాగానిక నానాఘాట్ శాసనాన్ని ఎప్పుడు వేయించింది?
జ: మొదటి శాతకర్ణి మరణానంతరం
14. కళింగాధీశుడైన ఖారవేలుడిని మొదటి శాతకర్ణి ఓడించినట్లు తెలిపే ఆధారం ఏది?
జ: చుళ్ల కళింగ జాతకం
15. ఏ శాతవాహన రాజుకు చెందిన అశ్వమేథ నాణెం పుణె సమీపంలో లభించింది?
జ: కన్హ
16. కళింగ రాజైన ఖారవేలుడు శాతవాహన రాజ్యంలోని పింథుండ నగరాన్ని ధ్వంసం చేసిన సమయంలో శాతవాహన పాలకుడెవరు?
జ: పూర్ణోత్సంగుడు
17. గుంటుపల్లి శాసనం పేర్కొన్న మహీషకాధిపతి ఎవరు?
జ: ఖారవేలుడు
18. దీర్ఘకాలం పాలించిన శాతవాహన రాజు ఎవరు?
జ: రెండో శాతకర్ణి
19. క్రీ.శ.58లో విక్రమ శకాన్ని ప్రారంభించిందెవరు?
జ: అపీలకుడు
20. కాతంత్ర వ్యాకరణాన్ని రచించిందెవరు?
జ: శర్వవర్మ
21. విష్ణుశర్మ దేని ఆధారంగా పంచతంత్రాన్ని రచించాడు?
జ: బృహత్కథ
22. బృహత్కథ గ్రంథ రచయిత ఎవరు?
జ: గుణాఢ్యుడు
23. మగధ రాజ్యాన్ని ఆక్రమించి శాతవాహన అధికారాన్ని ఉత్తర భారతదేశానికి విస్తరించిన పాలకుడెవరు?
జ: మొదటి పులోమావి
24. కవి వత్సలుడు అని ఎవరికి బిరుదు?
జ: హాలుడు
25. లీలావతి కావ్యం ఎవరి రచన?
జ: కుతూహలుడు
26. గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
జ: హాలుడు
27. మాతృ సంజ్ఞలను వాడిన మొదటి శాతవాహన పాలకుడెవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
28. గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఎప్పుడు వేయించింది?
జ: వాశిష్టీపుత్ర పులోమావి కాలంలో
29. గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు లభించిన జోగల్‌తంబి ఎక్కడ ఉంది?
జ: తమిళనాడు
30. నాసిక్ శాసనంలో పేర్కొన్న 'బెణాకటస్వామి' ఎవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
31. ఇటీవల తవ్వకాల్లో గౌతమీపుత్ర శాతకర్ణికి చెందిన నాణేలను ముద్రించే దిమ్మలు ఎక్కడ దొరికాయి?
జ: నాగార్జునకొండ
32. 'దక్షిణా పథేశ్వరుడ'నే బిరుదు ఎవరిది?
జ: వాశిష్టీపుత్ర పులోమావి
33. యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరికి పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడు?
జ: ఆచార్య నాగార్జునుడు
34. యజ్ఞశ్రీని 'త్రిసముద్రాధీశ్వర' అని పేర్కొన్నదెవరు?
జ: బాణుడు
35. మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిందెవరు?
జ: ఆచార్య నాగార్జునుడు
36. తెరచాపలతో కూడిన నౌకా ముద్ర ఉన్న నాణేలు ఎవరివి?
జ: యజ్ఞశ్రీ
37. శాతవాహనుల్లో చివరి పాలకుడెవరు?
జ: మూడో పులోమావి
38. గుమిక అంటే
జ: గ్రామాధికారి
39. శాతవాహన రాజుల్లో హాలుడు ఎన్నోవాడు?
జ: 17
40. పంటలో రాజు భాగాన్ని ఏమని వ్యవహరిస్తారు?
జ: దేయమేయ
41. కిందివాటిలో శాతవాహనుల కాలం నాటి వృత్తులకు సంబంధించి సరికానిదేది?
ఎ) హాలికులు - వ్యవసాయదారులు బి) కొలికులు - శిల్పులు సి) వధకులు - వడ్రంగులు డి) కులారులు - కుమ్మరులు
జ: బి(కొలికులు - శిల్పులు)
42. నిగమ సభల ప్రస్తావన ఏ శాసనంలో ఉంది?
జ: భట్టిప్రోలు శాసనం
43. నిగమ సభలలోని సభ్యులను ఏమని పిలుస్తారు?
జ: గుహపతులు
44. రాజకంఖేట అంటే
జ: రాజు సొంత భూమి
45. కరుకర అంటే
జ: వృత్తి పన్ను
46. కటకం అంటే
జ: సైన్యాగారం
47. శాతవాహనుల కాలం నాటి వడ్డీశాతం ఎంత?
జ: 12%
48. సార్దవాహులు అని ఎవరిని పిలిచేవారు?
జ: విదేశీ వర్తకం చేసేవారు
49. రోమ్ నాణేలు తెలంగాణలోని ఏ పట్టణంలో దొరికాయి?
జ: సూర్యాపేట
50. శాతవాహనుల కాలంనాటి ప్రధాన ఎగుమతి ఏది?
జ: సుగంధ ద్రవ్యాలు
51. సువర్ణం అంటే
జ: బంగారు నాణెం
52. శాతవాహనులు అనుసరించిన మతం ఏది?
జ: బ్రాహ్మణ మతం
53. అమరావతి స్థూపానికి పూర్ణకుంభాన్ని దానం చేసిందెవరు?
జ: ధిమిక
54. సతీసహగమనాన్ని తెలిపే సాక్ష్యం ఏది?
జ: గాథాసప్తశతి
55. శాసనాల ప్రకారం గుంటుపల్లి గుహలు ఏ మతానికి చెందినవి?
జ: జైన మతం
56. సరస్వతి గచ్చను స్థాపించిందెవరు?
జ: కొండకుందాచార్యుడు
57. శ్వేతాంబరులకు, దింగంబరులకు అనుసరణీయమైన 'సమయసారం' గ్రంథ రచయిత ఎవరు?
జ: కొండకుందాచార్యుడు
58. మహాయానానికి ప్రముఖ కేంద్రం ఏది?
జ: ధాన్యకటకం
59. అపరశైల చైత్యక శాఖకు ప్రధాన కేంద్రం ఏది?
జ: నాగార్జున కొండ
60. మహాయానానికి ప్రామాణిక గ్రంథంగా దేన్ని పేర్కొంటారు?
జ: ప్రజ్ఞాపారమిత శాస్త్రం
61. భారతదేశపు ఐన్‌స్టీన్, రెండో బుద్ధుడు అని ఎవరినంటారు?
జ: ఆచార్య నాగార్జునుడు
62. శాతవాహనుల కాలంనాటి రాజభాష ఏది?
జ: ప్రాకృతం
63. కిందివాటిలో అమరావతి స్థూపం మీద ఉన్న తెలుగు పదాన్ని గుర్తించండి.
ఎ) నాగరాజు బి) నాగబు సి) నాగలీల డి) గౌతమ బుద్ధుడు
జ: బి(నాగబు)
64. శాతవాహనుల కాలంనాటి పండగలైన హలక, ఘటా నిబంధన, మదనోత్సవాల గురించి తెలిపే గ్రంథం ఏది?
జ: వాత్సాయన కామసూత్రాలు
65. శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎక్కడ బయటపడింది?
జ: గుడిమల్లం
66. కిందివాటిలో దాతుగర్భ స్తూపం ఏది?
ఎ) కార్లే బి) శాలిహుండం సి) కన్హేరి డి) గుమ్మడి దుర్రు
జ: బి(శాలిహుండం)
67. ఆంధ్రప్రదేశ్‌లో 40 సంఘారామాలున్నాయని పేర్కొన్నదెవరు?
జ: హుయాన్‌త్సాంగ్
68. శాతవాహనుల కాలం నాటి శిల్ప శైలి ఏది?
జ: అమరావతి రీతి
69. చేయి పైకెత్తిన మాందాత చక్రవర్తి విగ్రహం ఎక్కడ లభించింది?
జ: జగ్గయ్యపేట
70. శాతవాహనులకు చెందిన వర్ణచిత్రాలు అజంతాలో ఏయే గుహల్లో ఉన్నాయి?
జ: 9, 10
71. 'అమరావతి శిల్పం భారతీయ శిల్పానికే తలమానికం' అని పేర్కొన్నదెవరు?
జ: ఫెర్గూసన్
72. శాతవాహనుల కాలంనాటి అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది?
జ: భట్టిప్రోలు
73. శాతవాహనులకు చెందిన శ్వేతగజ జాతక చిత్రం అజంతాలోని ఏ గుహలో ఉంది?
జ: 10వ గుహ
74. గౌతమీపుత్ర శాతకర్ణి ఏ స్థూపానికి తోరణాలు చెక్కించాడు?
జ: సాంచీ
75. హాలుడి వివాహం గురించి తెలిపే గ్రంథం ఏది?
జ: లీలావతి

Posted on 21-09-2015

డాక్ట‌ర్ ఎం. జితేంద‌ర్‌రెడ్డి