closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

తెలంగాణ-ఆంధ్ర విలీనం

* క్లిష్ట పరిస్థితుల్లో ఆవిర్భావం
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టం నాటి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. నేడు రాష్ట్రం విడిపోవడానికెంత రాజకీయ కసరత్తు జరిగిందో నాడు విలీనానికి ముందూ అంతే కసరత్తు జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో.. ఏవిధంగా విలీనం జరిగింది? తెలంగాణలోనూ విలీనాన్ని కావాలనుకున్న వారెవరు? అత్యంత సంక్లిష్టమైన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులపై టీఎస్‌పీఎస్సీ సిలబస్ వర్కింగ్ గ్రూప్ కన్వీనర్, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం..
నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన అంశాలపై పూర్తి స్పష్టమైన సమాచారం లేదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే.. తెలంగాణ ప్రాంతం బలంగా వ్యతిరేకించినా, విశాలాంధ్రను వద్దన్నా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారనే విషయం అర్థమవుతుంది. ఇతర ప్రాంతాలతో కలసి ఉండటానికి ఇష్టపడినప్పటికీ ఇతర ప్రాంతీయుల పెత్తనాన్ని వ్యతిరేకించే నేపథ్యం తెలంగాణలో కనిపిస్తుంది. 1952లో ముల్కీ ఉద్యమం బలంగా సాగాక విశాలాంధ్రపట్ల వ్యతిరేకత పెరిగింది. కమ్యూనిస్టులతోపాటు కాంగ్రెస్‌లోని కొద్దిమంది నాయకులు విశాలాంధ్ర కావాలనుకున్నా మెజార్టీ కాంగ్రెస్ నేతలు, సామాన్య ప్రజలు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలనే కోరుకున్నారు. అయినా వారందరి ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
అదొక్కటే కారణం కాదు!
మద్రాసు నుంచి ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు ముందు నుంచీ ఆంధ్ర ప్రాంత నేతలు విశాలాంధ్రను కోరుతూ వచ్చారు. ఆ డిమాండ్ వెనక తెలుగు మాట్లాడే వారంతా కలసి ఉండాలనే కారణం ఒక్కటే లేదు. అనేక ఆర్థికాంశాలు కూడా ఈ డిమాండ్‌కు దోహద పడుతూ వచ్చాయి. ముఖ్యంగా నదీజలాలు, బొగ్గుగనుల్లాంటి వనరులపై అధికారం లభిస్తుందనీ, తెలంగాణకున్న మిగులు నిధుల్ని ఆంధ్ర ప్రాంతానికీ వాడుకోవచ్చనీ, అన్నింటికి మించి అప్పటికి ఆంధ్ర ప్రాంతానికున్న రాజధాని సమస్య పరిష్కారమవుతుందనే ఆలోచనతో విశాలాంధ్ర భావనను లేవనెత్తారు. ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఈ భావనను మరింత బలంగా వినిపించారు. అప్పటిదాకా తమతో ఉన్న బళ్లారి లాంటి అనేక తెలుగు ప్రాంతాల్ని వదులుకోవడానికి ఇష్టపడ్డవారు తెలంగాణను మాత్రం విలీనం చేసుకోవాలనుకోవడం గమనార్హం. తెలుగు భాష కంటే కూడా ఆంధ్ర ప్రాంత భౌతిక, ఆర్థిక, రాజకీయ అవసరాలే విశాలాంధ్ర నినాదానికి ప్రేరేపితాలయ్యాయి. అందుకే తెలంగాణపై ఆంధ్ర ప్రాంత నేతలు అంతగా పట్టుబట్టారు. మిగిలిన తెలుగు ప్రాంతాల విషయంలో ఆ పట్టు చూపించలేదు.
బలవంతంగా రుద్దవద్దన్న ఎస్సార్సీ
తెలంగాణలో ప్రజలు మాత్రం ఈ విలీనాన్ని ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం (ఎస్సార్సీ) కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రాంతానికి రక్షణలు కల్పించినా అవి అమలు కావేమోననే భయాన్ని కూడా కమిటీ వ్యక్తం చేయడం విశేషం. ఇందు కోసం అమలుకు నోచుకోని శ్రీబాగ్ ఒప్పందాన్ని, పనిచేయని ఇంగ్లాండ్-స్కాట్లాండ్‌ల ప్రత్యేకాధికారాల వ్యవస్థల్ని ఉదాహరణగా చూపించారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడాలంటే ఇరు ప్రాంతాల ప్రజల ఇష్టం, అంగీకారాలతోనే జరగాలి తప్ప బలవంతంగా రుద్దవద్దని, 1961 దాకా ఆగాలని ఫజల్అలీ కమిటీ (ఎస్సార్సీ) 1955 సెప్టెంబరు 30న సమర్పించిన నివేదికలో సూచించింది.
ఉన్నతస్థాయి సబ్‌కమిటీ
నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో చాలా వాదోపవాదాలు సాగాయి. అప్పటికే హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించడంపై పెద్దగా అభ్యంతరాల్లేవు. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రకు, కన్నడ మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకకు ఇవ్వాలనే విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. బీదర్ విషయంలో కూడా ఆ ప్రాంత వాసులు ఏం కోరుకుంటే అదే చేయాలని హైదరాబాద్ రాష్ట్ర వాసులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను మాత్రం ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలన్నారు. ఎస్సార్సీ నివేదిక అందాక 1955 అక్టోబరు 22, 23 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ముఖ్యమంత్రుల సమావేశం న్యూదిల్లీలో జరిగింది. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హైదరాబాద్ తప్ప అన్నింటిపై వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మూడింటిపై నిర్ణయానికి మాత్రం ఓ అత్యున్నతస్థాయి సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్‌కమిటీలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు యు.ఎన్.ధేబర్‌తోపాటు జవహర్‌లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్‌పంత్, అబుల్ కలామ్ ఆజాద్ సభ్యులు. ఇదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజామోదం లేకుండా నిర్ణయం తీసుకోవద్దనే ఎస్సార్సీ సూచననే వర్కింగ్ కమిటీ బలపరిచింది. అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయం ఉంటే తప్ప ఎస్సార్సీ సిఫార్సులతో విభేదించబోమని వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. అంటే బలవంతంగా విశాలాంధ్రను తెలంగాణపై రుద్దబోమని పరోక్షంగా తేల్చి చెప్పింది. ఆంధ్రప్రాంత నాయకులు పదేపదే విశాలాంధ్ర గురించి డిమాండ్ చేసినప్పుడు 'మీరు మాట్లాడాల్సింది మాతోకాదు.. తెలంగాణ ప్రజలతో! వారిని ముందు ఒప్పించండి' అని ప్రకటన కూడా చేసింది. ఏ నిర్ణయమైనా తెలంగాణ ప్రజల అభీష్టం మేరకేనని వర్కింగ్ కమిటీ చెప్పింది. అయితే అక్టోబరు 28న తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మాత్రం విశాలాంధ్రకు మొగ్గు చూపుతూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగాలంటే విశాలాంధ్రే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో హైదరాబాద్ రాష్ట్రంలో విపరీతమైన ఆందోళన చెలరేగింది. విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ, ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రాన్ని కోరుకుంటూ గ్రామాలు, మున్సిపాలిటీలు తీర్మానాలు చేశాయి. హైదరాబాద్, వరంగల్‌లలో నిషేధాజ్ఞలు విధించారు. అప్పటి ఆదిలాబాద్ ఎంపీ మాధవరెడ్డి (తర్వాత తెలుగుదేశం తరపున కూడా ఎంపీగా చేశారు) డిసెంబరు 23న పార్లమెంటులో మాట్లాడుతూ తెలంగాణలో ఆందోళనలు ఎలా జరుగుతున్నాయో, విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ తీర్మానాలెలా చేస్తున్నారో వివరించారు. ముఖ్యమంత్రితో పాటు ఒక మంత్రి తప్పిస్తే కాంగ్రెస్ మంత్రులు, నేతలు, పార్టీ అనుబంధ సంఘాలన్నీ తెలంగాణకు అనుకూలంగా, విశాలాంధ్రకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. బూర్గుల రామకృష్ణారావు దాదాపు ఏకాకిగా మారిన పరిస్థితి!
ఆంధ్ర కాంగ్రెస్ నేతల ఒత్తిడి
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సబ్‌కమిటీ తెలంగాణ నేతలను చర్చలకు పిలిచింది. నవంబరు 13న జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి బూర్గుల సహా అంతా కూడా విలీనానికి తెలంగాణ వ్యతిరేకమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని, ఇలాగే అనిశ్చితి కొనసాగితే కష్టమని, పరిస్థితులు దిగజారుతాయని కేంద్రాన్ని హెచ్చరించారు. నవంబరు, డిసెంబరుల్లో ఆందోళన తీవ్రమై.. కొనసాగుతున్న దశలో తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పించకుండా విలీనం సాధ్యం కాదని ఆంధ్ర ప్రాంత నేతలకు అర్థమైంది. తెలంగాణలో విశాలాంధ్రకు మద్దతిస్తున్నవారు కూడా ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించి, అభివృద్ధికి అవకాశం ఉండేలా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో ఆంధ్రనేతలు దిల్లీలో ఒత్తిడి మొదలు పెట్టారు. తొలుత జీబీపంత్‌ను మెత్తబరిచారు. ఆయన ద్వారా కమిటీలోని మిగిలిన సభ్యులపై ప్రభావం చూపించడంలో విజయవంతమయ్యారు. కేంద్ర నేతల్ని ప్రభావితం చేయగల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ రాష్ట్రం నుంచి లేకపోవడం కూడా తెలంగాణకు ఇబ్బందికరంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే సుదీర్ఘకాలంగా ఆంధ్ర నేతలు అఖిల భారత కాంగ్రెస్‌లో ఉన్నారు. పట్టాభిలాంటివారు కాంగ్రెస్ అధ్యక్షపీఠం అధిష్ఠించారు కూడా. కాబట్టి ఆంధ్ర నేతలకు కాంగ్రెస్ ఉన్నతస్థాయుల్లో సంబంధాలున్నాయి. దీంతో ఒత్తిడి తేవడం వారికి సాధ్యమైంది. తెలంగాణ కాంగ్రెస్ వాదులు అఖిల భారత స్థాయికి ఎదగలేదు. ఢిల్లీలో పెద్దగా పరిచయాల్లేవు. హైదరాబాద్ కాంగ్రెస్ విడిగా ఉండి, విడిగా పనిచేస్తూ వచ్చింది. దీంతో వారికి పరిమితులున్నాయి. నెహ్రూలాంటి నేత తీసుకున్న నిర్ణయాన్ని వద్దనే ధైర్యం అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లేకపోయింది. 'నెహ్రూకున్న స్థాయిని చూసి మేం గట్టిగా మాట్లాడలేకపోయాం. విలీనం కుదరదని అన్నామేగానీ ఆయనతో ఘర్షణ పడలేకపోయాం. ఒకవేళ ఘర్షణ పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో..' అని మర్రి చెన్నారెడ్డి ఒకచోట రాసుకున్నారు. అలా నిర్ణయాలు నేతల మధ్య జరిగాయి.
వేర్వేరు చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలు
ఆంధ్ర, తెలంగాణ భిన్నమైన చారిత్రక పరిస్థితుల్లో ఎదిగాయి. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన రాజకీయ వ్యవస్థల్లో ఎదిగాయి. అలాంటి వాటిని విశాలాంధ్ర పేరుతో ఒకచోటికి తెచ్చారు. 1956 నవంబరు కంటే చాలాముందే ఫిబ్రవరి 20 నాడే దిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. అయితే దాన్ని బహిర్గతం చేయలేదు. 6 నెలల తర్వాత ఆగస్టులో 'నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ టు తెలంగాణ' పేరుతో పార్లమెంటులో ఈ రక్షణల సంగతి సూచించారు. అంటే నవంబరుకు ముందే లోలోపల విలీనం ఏర్పాట్లు జరుగుతూ వచ్చాయి. మార్చి 7న నెహ్రూ తొలిసారిగా విలీనం విషయం చూచాయగా మాట్లాడారు. రక్షణలిస్తామని, ముల్కీ కొనసాగుతుందని, ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తామంటూ.. నెహ్రూ లీకులిస్తూ వచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో లభించే ఫలితాలనే ఉమ్మడి రాష్ట్రంలోనూ కల్పిస్తామని, అభివృద్ధికి అవకాశాలిస్తామని హామీలివ్వడంతో విశాలాంధ్రపై రాజకీయ నేతల్లో కాస్త ఉదారత్వం పెరిగింది. అంతిమంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నాయకుల మధ్య ఒప్పందాల ఫలితంగా.. లోపాయికారీ వ్యవహారాల ద్వారా.. దిల్లీలో ఆంతరంగికంగా.. ప్రభుత్వంలో జరిగిన పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంతేతప్ప ప్రజల అంగీకారంతో ఏర్పడలేదు. ఎస్సార్సీ నివేదిక, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటనలకు వ్యతిరేకంగా విలీనం జరిగింది. 1957లో మళ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 1956 అక్టోబరు, నవంబరులోగా రాష్ట్రాల ఏర్పాటును పూర్తి చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావించింది. దానికనుగుణంగా తొందరగా నిర్ణయం తీసుకోవాలనే వేగంలో, ఆంధ్రప్రాంత నేతల ఒత్తిడిలో విలీనం జరిగింది. నేతలు నిర్ణయం తీసుకొని ప్రజలపై రుద్దారు.
Posted on 01-10-2015