closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర భౌతిక, సామాజిక, ఆర్థిక భూగోళ శాస్త్రం, జనాభా

తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు

* సౌరశక్తి సద్వినియోగం
* జలవిద్యుత్‌కు వర్షాలే ఆధారం
 • కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అంశం అత్యంత కీలకమైంది. జీవనదులు లేని దక్షిణాది రాష్ట్రాల్లో జల విద్యుదుత్పత్తికి అనుకూలతలు తక్కువ. వర్షాలు పుష్కలంగా కురిసి నదులు నీటితో కళకళలాడితేనే జల విద్యుత్‌కు వీలవుతుంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడి ప్రభుత్వం బొగ్గు ఆధారిత థర్మల్,
  సౌర(సోలార్) లాంటి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి అన్నివిధాలుగా కృషి చేస్తోంది. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, సంబంధిత ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న కృషి.. తదితర అంశాలపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం..
 • మానవ మనుగడకు విద్యుత్ అత్యంత కీలకమైన అవస్థాపనా సౌకర్యంగా మారి పోయింది. విద్యుత్ లేకపోతే దినచర్య ముందుకు సాగనంతగా దీనిపై మానవాళి ఆధారపడుతోంది. ఉత్తర భారతదేశంలో నిత్యం ప్రవహించే జీవనదులు ఉండటంతో ఆయా రాష్ట్రాలు జలవిద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాయి. దీంతో వాటికి విద్యుత్ కొరత అంతగా లేదు. కానీ ద్వీపకల్ప(దక్షిణ) భారతదేశంలో నదులకు వర్షాలే ఆధారం కావడంతో వేసవిలో నీరు సరిగా లేక జల విద్యుదుత్పత్తి మరీ కష్టంగా మారుతోంది. అందువల్ల ద్వీపకల్ప రాష్ట్రాలు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తుపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఉంది. ఈ మేరకు తెలంగాణ విద్యుదుత్పత్తికి అవసరమయ్యే వనరులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
 • భారత రాజ్యాంగం ప్రకారం విద్యుత్ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. భారతదేశంలో విద్యుత్తు సరఫరా చట్టం 1948లో చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో 1938 నుంచే విద్యుత్ చట్టం అమల్లో ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ రామగుండం తెలంగాణలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం జల విద్యుత్ కంటే థర్మల్ విద్యుత్‌పైనే ఎక్కువ ఆధారపడి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1999లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ - ఏపీ జెన్‌కో (AP GENCO), విద్యుత్ సరఫరా సంస్థ - ఏపీ ట్రాన్స్‌కో(AP TRANSCO) అనే రెండు సంస్థలుగా విభజించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి టీఎస్ జెన్‌కో (TS GENCO), టీఎస్ ట్రాన్స్‌కో (TS TRANSCO)గా పనిచేస్తున్నాయి.
 • శక్తి వనరులు

 • ఉత్పత్తి, లభ్యత ఆధారంగా శక్తివనరులను రెండు రకాలుగా చెప్పవచ్చు.
  1. సంప్రదాయ శక్తివనరులు: ఒకసారి వినియోగించగా తిరిగి పొందలేని (అంటే పునరుత్పాదితం కాని) వనరులు ఇవి. ఉదా: బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, అణుఇంధన ఖనిజాలు.
  2. సంప్రదాయేతర శక్తి వనరులు: ఒకసారి వినియోగించినా ఇంకా లభిస్తూనే ఉండే (అంటే తరిగిపోని లేదా పునరుత్పాదితం అయ్యే) శక్తి వనరులు. ఉదా: జల విద్యుత్, సౌర విద్యుత్, పవన విద్యుత్, భూతాప విద్యుత్ (జియో థర్మల్ ఎనర్జీ), తరంగ శక్తి (టైడల్ ఎనర్జీ), బయోమాస్ ఎనర్జీ.
 • ఈ రెండు వనరుల ద్వారా కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
 • బొగ్గే ఆధారం

 • బొగ్గు, సహజ వాయువు, డీజిల్, నీటి ఆవిరి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ అంటారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, మంజీరా లాంటి గొప్ప నదులు ప్రవహిస్తున్నాయి. అయితే సంవత్సరంలో ఎక్కువ కాలం నదుల్లో నీరు తక్కువగా ప్రవహిస్తుండటంతో జల విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన జలాశయాలు నిర్మించడానికి తగిన భౌగోళిక పరిస్థితులు లేవు. దీంతో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అనుకూల పరిస్థితులు తక్కువగానే ఉన్నాయి. అందువల్ల దీనికి సమాంతరంగా థర్మల్ విద్యుత్‌ను వినియోగించాల్సి వస్తోంది.
 • మొదటి థర్మల్ కేంద్రం

 • హైదరాబాద్ రాష్ట్రంలో 1920లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హుస్సేన్‌సాగర్ ఒడ్డున మింట్ కాంపౌండ్ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించారు. ఇది తెలంగాణ ప్రాంతంలో మొదటి బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం. దీని సామర్థ్యం 22.5 మెగావాట్లు. నగరం మధ్యలో ఉన్నందున పర్యావరణ కారణాల వల్ల 1992లో దీన్ని మూసివేశారు. తర్వాత 1995లో పూర్తిగా ధ్వంసం చేసి ఆ స్థానంలో ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ ఐమాక్స్ నిర్మించారు.
 • ఎన్‌టీపీసీ - రామగుండం

 • కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ - నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌ను 1975లో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ. దేశం మొత్తం విద్యుదుత్పత్తిలో దీని వాటా 27 శాతం. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని రామగుండం ప్రాంతంలో బొగ్గు ద్వారా ఏర్పాటు చేసిన థర్మల్ ప్లాంట్ 7 యూనిట్లు, 2,600 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. (3 × 200 మెగావాట్లు, 4 × 500 మెగావాట్లు). ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటాగా 580 మెగావాట్లను రాష్ట్రం వినియోగించుకుంటోంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ సంస్థ. దీనికి అవసరమైన బొగ్గు సింగరేణి కాలరీస్‌కు చెందిన గోదావరి కోల్‌బెల్ట్ నుంచి సరఫరా అవుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా నీరు లభ్యమవుతోంది. ఉత్తమ నిర్వహణకు 1985లో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం 'జాతీయ ఉత్పాదక అవార్డు' ప్రకటించింది. ఈ ప్లాంట్ నుంచి లబ్ది పొందుతున్న రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా.
 • రామగుండం - థర్మల్ స్టేషన్

 • రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంతో నడిచే విద్యుత్ఉత్పత్తి సంస్థ టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో రామగుండంలో ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం. దీని సామర్థ్యం 62.5 మెగావాట్లు. 1971 నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
 • కొత్తగూడెం థర్మల్ - పాల్వంచ

 • తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్-టీఎస్ జెన్‌కోకు చెందిన బొగ్గు ఆధారిత కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం 1966లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఏర్పాటైంది. ఇది 11 యూనిట్లుగా స్థాపించి 1,720 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. మరో యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతోంది.
 • కాకతీయ థర్మల్ - చెల్పూరు

 • దీన్ని టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో 2006, జూన్ 5న వరంగల్ జిల్లా, ఘనపురం మండలం చెల్పూరు గ్రామంలో స్థాపించారు. ఇది 2010 నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. మొదటి దశలో 500 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమైంది. రెండో దశలో 600 మెగావాట్లతో మరో యూనిట్ నిర్మిస్తున్నారు.

 • రాబోయే సంస్థలు

 • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రానికి ఏర్పడిన అతి ముఖ్యమైన సవాల్ విద్యుత్ కొరత. 2017 కల్లా విద్యుత్ కొరతలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి అనే మూడు కొత్త థర్మల్ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది.
  యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం: నల్గొండ జిల్లాను తెలంగాణా విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కృష్ణా నదీ తీరంలో దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో, బీహెచ్ఈఎల్ (BHEL) తో కలిసి 7,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ని స్థాపించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, జూన్ 8న భూమిపూజ చేశారు. రూ.55 వేల కోట్ల వ్యయంతో 5,558 ఎకరాల్లో దశల వారీగా నిర్మిస్తారు.
  భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం: ఖమ్మం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామం వద్ద ఈ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, మార్చి 28న శంకుస్థాపన చేశారు. దీని సామర్థ్యం 1,080 మెగావాట్లు. బీహెచ్ఈఎల్(BHEL) దీన్ని నిర్మిస్తుంది.
  సింగరేణి థర్మల్ - జైపూర్: ఆదిలాబాద్ జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి వద్ద టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించాలని తలపెట్టారు. దీని సామర్థ్యం - రెండు యూనిట్ల (600 × 2 మెగావాట్ల సామర్థ్యం)తో మొదటి దశ, ఒక యూనిట్ (600 మెగావాట్లతో) రెండో దశలోనూ నిర్మించాలని నిర్ణయించారు. దీని మొత్తం సామర్థ్యం 1800 మెగా యూనిట్లు
 • తెలంగాణ సౌర విధానం

 • రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 2015, జూన్ 3న తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్ విధానం-2015ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు భూముల కొనుగోలుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లించడం, కాలవ్యవధిలో పూర్తిచేసిన ప్రాజెక్టులకు 10 ఏళ్ల పాటు రాయితీలు ఇవ్వడం లాంటి ప్రోత్సాహకాలను అందజేస్తారు. నివాస, వ్యాపార, పారిశ్రామిక భవనాలపై 'సోలార్ రూఫ్ టాప్‌'ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు ఇస్తారు.
 • జూరాల 'సోలార్' ప్లాంట్

 • ఇది తెలంగాణాలోని మొదటి సోలార్ విద్యుత్ కేంద్రం (జూరాల సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్లాంట్) అవుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రానికి సమీపంలోని రేవులపల్లి గ్రామంలో స్థాపించారు. ఇది 2011, డిసెంబరు 29న ఉత్పత్తి ప్రారంభించింది. దీని సామర్థ్యం 1 మెగా వాట్. దీన్ని జవహర్‌లాల్‌నెహ్రూ జాతీయ సోలార్ మిషన్‌లో భాగంగా నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 మెగావాట్ల సామర్ధ్యంతో కరీంనగర్‌లోని రామగుండంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. మహబూబ్‌నగర్‌లోని గట్టు అనే ప్రాంతంలో సోలార్ విద్యుత్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 • మాదిరి ప్రశ్నలు

  1. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
  ఎ) 2014, జూన్ 2 బి) 1999, జనవరి 2 సి) 2012, జూన్ 2 డి) 1998, ఆగస్టు 10
  జ: (ఎ)
  2. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది?
  ఎ) కృష్ణాపురం బి) పాల్వంచ సి) కొత్తగూడెం డి) మణుగూరు
  జ: (బి)
  3. తెలంగాణ ప్రాంతంలో మొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఏది?
  ఎ) రామగుండం బి) కొత్తగూడెం సి) హుస్సేన్‌సాగర్ డి) భద్రాద్రి
  జ: (సి)
  4. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
  ఎ) హైదరాబాద్ బి) వరంగల్ సి) రామగుండం డి) కొత్తగూడెం
  జ: (ఎ)
  5. తెలంగాణ ఉత్తర విద్యుత్ సరఫరా కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
  ఎ) హైదరాబాద్ బి) కరీంనగర్ సి) ఆదిలాబాద్ డి) వరంగల్
  జ: (డి)
  6. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు ఏది?
  ఎ) శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం
  బి) శ్రీరాంసాగర్ జల విద్యుత్ కేంద్రం
  సి) సింగూర్ పవర్‌హౌస్
  డి) నాగార్జునసాగర్ ఎడమ కాలువ పవర్‌హౌస్
  జ: (ఎ)
  7. కింది ఏ విద్యుత్ ప్రాజెక్టుకు పద్మభూషణ్ కనూర్ లక్ష్మణరావు ప్రాజెక్టు అని పేరు పెట్టారు?
  ఎ) పులిచింతల బి) జూరాల సి) పోచంపాడు డి) సింగూరు
  జ: (ఎ)
  8. తెలంగాణలో యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌ను ఎక్కడ నిర్మిస్తున్నారు?
  ఎ) నల్గొండ జిల్లా దామచర్ల బి) నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సి) నల్గొండ జిల్లా భువనగిరి డి) నల్గొండ జిల్లా సూర్యాపేట
  జ: (ఎ)
  9. వ్యవసాయ అవసరాలకు అత్యధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న తెలంగాణ జిల్లా ఏది?
  ఎ) ఖమ్మం బి) కరీంనగర్ సి) నల్గొండ డి) నిజామాబాద్
  జ: (సి)
  10. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు?
  ఎ) ఖమ్మం జిల్లా భద్రాచలం బి) ఖమ్మం జిల్లా మణుగూరు సి) ఖమ్మం జిల్లా పాల్వంచ డి) ఖమ్మం జిల్లా పాలేరు
  జ: (బి)
  11. పోచంపాడు జల విద్యుత్ కేంద్రం కింది ఏ జిల్లాలో ఉంది?
  ఎ) కరీంనగర్ బి) నిజామాబాద్ డి) ఖమ్మం డి) వరంగల్
  జ: (బి)
  12. సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎన్ని మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి?
  ఎ) 500 బి) 1000 సి) 2000 డి) 4000
  జ: (బి)
  13. ఆల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎన్ని మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి?
  ఎ) 4000 బి) 2000 సి) 5000 డి) 1000
  జ: (ఎ)
  14. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ?
  ఎ) ఎన్‌టీపీసీ రామగుండం బి) ఎన్‌టీపీసీ కొత్తగూడెం సి) టీఎస్‌జెన్‌కో కాకతీయ డి) టీఎస్‌జెన్‌కో సింగరేణి
  జ: (ఎ)
  15. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సోలార్ విద్యుత్ విధానం-2015 లక్ష్య సామర్థ్యం ఎన్ని వేల మెగావాట్లు?
  ఎ) 10 బి) 20 సి) 5 డి) 50
  జ: (ఎ)
  16. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి అధికంగా చేస్తున్న జిల్లా ఏది?
  ఎ) ఖమ్మం బి) వరంగల్ సి) ఆదిలాబాద్ డి) కరీంనగర్
  జ: (ఎ)
  Posted on 04-12-2015

  జ‌ల్లు స‌ద్గుణ‌రావు