closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

పెద్ద‌మ‌నుషుల ఒప్పందం

* విలీనానికి ముందే ఉల్లంఘనలు
* ఆది నుంచే ఐక్యతకు తూట్లు
* నిధుల తరలింపు నిజమే
 • ఆనాడు రెండు ప్రాంతాలు విలీనమై ఆంధప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందూ వెనుకా ఎన్నో కీలక పరిణామాలు.. పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యాంశాలేమిటి? ఒప్పుకుని ఎలా ఉల్లంఘించారు? ప్రజల ఐక్యతకు తూట్లు పొడిచిన క్రమం ఎలాంటిది? నాటి నుంచీ తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమంపై ఆచార్య కోదండరాం విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం
 • తెలంగాణ ప్రాంతానికి కొన్ని రక్షణలను కల్పించి, వాటికి హామీ ఇచ్చిన తర్వాత హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తప్ప భేషరతుగా ఏర్పడలేదు. షరతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఉమ్మడి రాష్ట్రం మనుగడ ఆ షరతులపైనే ఆధారపడింది. ఉమ్మడి రాష్ట్రం బతుకు ఈ రక్షణల్లో ఉంది. రక్షణలను అమలు చేస్తే ఉమ్మడి రాష్ట్రం కొనసాగుతుంది. లేదంటే ప్రమాదంలో పడుతుందనేది ఆనాటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా ఏర్పడలేదు. పంజాబ్, హరియాన విషయంలో కొన్ని షరతులు విధించినా తదనంతర కాలంలో పంజాబ్ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది. ఆంధ్ర ప్రాంతంతో విలీనమైన తెలంగాణకు 14 రకాల రక్షణలను కల్పిస్తామని ఆంధ్ర ప్రాంత నాయకులు హామీ ఇచ్చారు. అయితే వీటిపై ఒప్పందం కుదుర్చుకుంటేనే ఉమ్మడి రాష్ట్రానికి అంగీకరిస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో - తెలంగాణకు రక్షణలిస్తామని ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. దీంతో కేంద్రం ఒత్తిడి తీసుకురావడంతో తెలంగాణ నేతలు కూడా అనివార్యంగా తలొగ్గాల్సి వచ్చింది. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు ప్రాంతాల నేతలు కూర్చొని ఒప్పందానికి తుదిరూపునిచ్చారు. అయితే ఈ ఒప్పందానికి, రక్షణలకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ నేతలు పట్టుబట్టారు. చట్టబద్ధత ఉన్నప్పుడే ఈ రక్షణలకు విలువ ఉంటుందని.. అప్పటిదాకా విలీనాన్ని వ్యతిరేకించిన నేతలు కూడా వాదించారు. 1956 ఫిబ్రవరి 20న దిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. దీనికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం కూడా సాగింది. వీటిని 'నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్' పేరిట పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంటే షరతుల ఆధారంగా విలీనం జరుగుతోందని పార్లమెంటుకు నివేదించారు. తద్వారా కేంద్రం వీటిని గుర్తించి, వాటి అమలు బాధ్యతను కొంతమేరకైనా తీసుకున్నట్లయింది.
 • పెద్దమనుషులెవరు?

 • 1. బెజవాడ గోపాలరెడ్డి, 2. నీలం సంజీవరెడ్డి, 3. సత్యనారాయణ రాజు, 4. గౌతు లచ్చన్న, 5. బూర్గుల రామకృష్ణారావు, 6. కె.వి.రంగారెడ్డి, 7. ఎం.చెన్నారెడ్డి, 8. జేవీ నర్సింగరావు
 • కుదరని ఒప్పందాలు

 • రెండు అంశాలపై పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదరలేదు. అవి.. 1. కొత్త రాష్ట్రానికి పేరును ఆంధ్ర-తెలంగాణగా పెట్టాలని తెలంగాణ ప్రాంత నేతలు ప్రతిపాదించగా, ఆంధ్రప్రదేశ్‌గా నామకరణం చేయాలని ఆంధ్రనేతలు వాదించారు.
 • 2. గుంటూరులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు అనగా ఆంధ్రనేతలు వ్యతిరేకించారు. హైకోర్టు ఒక్క హైదరాబాద్‌లోనే ఉంటే సరిపోతుందన్నారు.
 • ఉర్దూలో కేసులు కొనసాగించడానికి ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేస్తామనే హామీపై హైకోర్టుల విలీనానికి అంగీకరించారు. హైదరాబాద్, ఆంధ్ర హైకోర్టులను విలీనం చేసినప్పుడు ఆంధ్ర హైకోర్టు జడ్జీలు యథాతథంగా కొనసాగగా, హైదరాబాద్ హైకోర్టు జడ్జీలు మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. తద్వారా తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులు కొత్తవారిగా మారగా, ఆంధ్ర ప్రాంత జడ్జీలు సీనియర్లయ్యారు. తెలంగాణ జడ్జీల సీనియారిటీ తగ్గింది. తద్వారా సుప్రీంకోర్టు దాకా పదోన్నతులపై వెళ్లే అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ప్రత్యేక బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.
 • ప్రాంతీయ మండలి ఏర్పాటు

 • మొత్తానికి పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ మండలి కోసం రాజ్యాంగంలోని 371వ అధికారణాన్ని 1956లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు. దీని ప్రకారం తెలంగాణ కోసం ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి దఖలు పరిచారు. చివరకు 1958 ఫిబ్రవరిలో ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు రెండేళ్లకు ప్రాంతీయ మండలి ఏర్పాటైంది. అదే విధంగా ఆర్టికల్ 16(3)ని సవరించి పార్లమెంటుకు - ఉద్యోగాల భర్తీలో నివాసార్హత విధించే అధికారాన్ని కల్పించారు. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టాన్ని 1957లో తయారు చేసి దానిద్వారా తెలంగాణ ముల్కీ నిబంధనలకు చట్టబద్ధత తీసుకొచ్చారు.
 • ఆవిర్భావానికి ముందే..

 • ఏర్పాట్లైతే జరిగాయి గానీ షరతులు, రక్షణల అమలు విషయంలో తొలిరోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. పెద్ద మనుషులంతా కూర్చొని ఒప్పందం చేసుకున్నా దీనిపై కొంతమందే సంతకాలు చేశారు. మరికొంతమంది తర్వాత కొన్నాళ్లకు చేశారు. కొంతమంది సంతకం చేశారో లేదో తెలియని అయోమయ పరిస్థితి. తెలంగాణకు రక్షణ కల్పిస్తామని ఆంధ్రా అసెంబ్లీ తీర్మానం చేసి, పెద్దమనుషుల ఒప్పందం కుదిరాక వాటి అమలుకు చిత్తశుద్ధి చూపించాల్సిన ఆంధ్ర ప్రాంత నాయకత్వం ఆ పని చేయలేదు. విలీనానికి షరతులు, రక్షణల ప్రతిపాదన అవసరమై చేశారే తప్ప వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నించలేదు. అసలు రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఒప్పందాల ఉల్లంఘన మొదలైంది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు ప్రాంతీయ మండలి ఏర్పాటు కావాలి. దీనికి విస్తృతమైన అధికారాలున్నాయి. పెద్దమనుషుల ఒప్పందంలోని విషయాల అమలును పర్యవేక్షించడంతోపాటు స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికకు లోబడి తెలంగాణకు ప్రణాళికను రూపొందించే అధికారం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మండలి అనేది తెలంగాణకు ఓ మినీ ప్రభుత్వంలా వ్యవహించే అవకాశముంది. అలాంటి మినీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే తెలంగాణలో రాజకీయ వ్యక్తీకరణకు అవకాశం ఏర్పడి ఉండేది. రాజకీయ నాయకత్వం ఎదగటానికి, బలపడటానికి కూడా అవకాశం ఉండేది. కానీ పార్లమెంటులో 'సేఫ్‌గార్డ్‌'ను ప్రవేశపెట్టే సమయానికే తెలంగాణ ప్రాంతీయ మండలి స్థానంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ప్రతిపాదించారు. ఈ ప్రాంతీయ కమిటీకున్న అధికారాలను కుదించారు. చివరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడ్డ ప్రాంతీయ కమిటీకి - పెద్దమనుషుల ఒప్పందంలో పేర్కొన్న ప్రాంతీయ మండలికున్న అధికారాలు లేవు. అధికారాలను, పరిధిని చాలా కుదించారు. ఈ ప్రాంతీయ కమిటీ అనేది శాసనసభకు సంబంధించిన ఓ ఉపసంఘం లాంటిది మాత్రమే. ఈ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్లు విధానాలను రూపొందించే అధికారాలు లేవు. ముల్కీ నిబంధనల అమలు పర్యవేక్షణ అధికారం కూడా లేకుండా చేశారు. విత్తపరమైన భారంలేని సూచనలు మాత్రమే చేయాలన్నారు. అంటే డబ్బులతో ముడిపడి లేనటువంటి సూచనలు మాత్రమే చేయొచ్చు. ఉన్నత విద్యను పర్యవేక్షించే అధికారం తీసేశారు. అంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ కేవలం సలహాలకే పరిమితమైంది. అలా పెద్దమనుషుల ఒప్పందంలో ప్రతిపాదించిన ప్రాంతీయ మండలిని బలహీనం చేసి ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తొలి ఉల్లంఘన జరిగింది.
 • మరో ఒప్పంద ఉల్లంఘన

 • పెద్దమనుషుల ఒప్పందంపై తడి సిరా ఆరకముందే జరిగిన మరో ఉల్లంఘన - ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో జరిగింది. ఇది ఆరోవేలులా పనికిరానిదంటూ అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వ్యాఖ్యానించి ఉల్లంఘించారు. దీంతోపాటు 1962 దాకా కొనసాగిస్తామన్న హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని కూడా రద్దుచేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేశారు. దీంతో ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని తెలంగాణ నేతలు కోల్పోయారు. ఆ అధికారం కూడా ఆంధ్ర నేతల చేజిక్కింది. దీంతో పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బలహీనమయ్యారు.
 • రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం - తెలంగాణ ప్రాంత ఉద్యోగులకున్న ప్రత్యేక హోదా, ప్రతిపత్తి, జీతభత్యాలను విలీనం సమయంలో తగ్గించకూడదు. కానీ విలీనం జరిగేనాటికి ఆంధ్రప్రాంత జీతభత్యాల కంటే తెలంగాణ ఉద్యోగుల వేతన స్కేళ్లు ఎక్కువ. అలాగే ఉంచితే తెలంగాణ ఉద్యోగులు సీనియర్లవుతారనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల జీతభత్యాలను యధాతథంగా ఉంచి, తెలంగాణ ఉద్యోగుల పేస్కేళ్లను తగ్గించి ఆంధ్ర ఉద్యోగులతో జోడించారు. తద్వారా సీనియార్టీ కోల్పోయి జూనియర్లుగా మారారు. దీంతో పాలనా యంత్రాంగంపై తెలంగాణ అధికారులకు పట్టు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీపైగానీ, అధికారుల రూపంలో పాలనపైగానీ తెలంగాణకు బలమైన నియంత్రణ లభించి ఉంటే ఈ ప్రాంత నేతలు ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించే అవకాశం ఉండేది. కానీ ఇవేవీ జరగకపోవడం తెలంగాణకు జరిగిన అన్యాయం.
 • నిధులనూ మళ్లించారు

 • వీటికి తోడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు తెలంగాణ వికాసానికే కేటాయించాల్సి ఉండగా అలా చేయలేదు. తెలంగాణ నిధులను ఆంధ్రాకు తరలించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంతీయ కమిటీ పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ముల్కీ నిబంధనల అమలు కోసం పాల్వంచలో ఉద్యమం ఆరంభం కాగానే తెలంగాణ ప్రాంత రక్షణల కోసం ఉద్యమం బలపడుతున్న సమయాన.. మిగులు నిధుల చర్చ మళ్లీ తలెత్తింది. మిగులు నిధుల్ని తెలంగాణకు కేటాయించకపోవడమే గాకుండా, ప్రణాళిక కేటాయింపుల్లో కూడా ఆంధ్రకు కేటాయించాల్సిన దానికంటే ఎక్కువ కేటాయిస్తున్నారని తెలంగాణ ప్రాంతీయ కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1969 జనవరిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ మిగులు నిధులను తెలంగాణకే కేటాయిస్తామని ప్రభుత్వం అఖిలపక్షంలో హామీ ఇచ్చింది. మిగులు నిధులను గుర్తించేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అధికారి కుమార్ లలిత్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం బడ్జెట్‌ను, ఇరు ప్రాంతాల నిధుల కేటాయింపులను పరిశీలించిన తర్వాత కుమార్ లలిత్ కూడా తెలంగాణ నిధుల్ని ఆంధ్రకు తరలించినట్లు తేల్చారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా 8 సూత్రాల పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా మిగులు నిధుల లెక్కలు తేల్చేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ట్ భార్గవ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా తెలంగాణ నిధులను ఆంధ్రకు తరలించారని అంగీకరించింది. అంటే తెలంగాణకు దక్కాల్సిన నిధుల్ని ఆంధ్రకు కేటాయించారనేది స్పష్టమవడంతోపాటు ప్రణాళిక కేటాయింపుల్లోనూ జనాభా దామాషా ప్రకారం తెలంగాణకు న్యాయసమ్మతంగా దక్కాల్సిన వాటా దక్కలేదు. వీటితోపాటు నిజాం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్, నిజాం బ్యాంకులో పెట్టిన ప్రత్యేక రిజర్వ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు తదితరాలు కూడా తెలంగాణకు దక్కాలని తెలంగాణ నేతలు పట్టుబట్టారు. కమిటీలు కూడా దీనికి అంగీకరించాయి.
 • ఆయన లేఖతో....

 • 1969లో ఉద్యమం బలపడటంతో మిగులు నిధుల సమస్య, ప్రాంతీయ కమిటీలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ జాగ్రత్త ముందు నుంచే ఉండి ఉంటే 1969 ఉద్యమానికి ఆస్కారం ఉండేది కాదు. ప్రణాళికల రూపకల్పన జరిగినప్పుడు కూడా, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టప్రకారం అప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సింది. కానీ తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టును కూడా ప్రభుత్వంలోని ఆంధ్రనేతలు పట్టించుకోలేదు. గోదావరి బహుళార్థసాధక ప్రాజెక్టు, దేవునూరు ప్రాజెక్టు, ఇచ్చంపల్లి, కడెం, లోయర్ మానేర్ డ్యాం, నందికొండ (కృష్ణా నదిపై), తుంగభద్ర ఎగువ కాల్వ, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టులు పూర్తికావాల్సింది. వీటివల్ల దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు తెలంగాణకు దక్కేవి. కానీ అవి దక్కకుండా పోయాయి. మొత్తం ప్రాజెక్టుల్లో గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద తలపెట్టిన పోచంపాడు ప్రాజెక్టునైనా ఇవ్వాలని తెలంగాణ ప్రాంత నేతలు, ప్రాంతీయ కమిటీ దిల్లీపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మాత్రం వచ్చింది. దానికీ సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో నత్తనడకన సాగింది. మిగిలిన ప్రాజెక్టులు రద్దయ్యాయి.
 • విలీనాన్ని బలంగా కోరుకున్న పాగ పుల్లారెడ్డి (గద్వాల ఎమ్మెల్యే) దిల్లీలో ప్రాజెక్టుల గురించి బలంగా డిమాండ్ చేశారు. బచావత్ ట్రైబ్యునల్‌లో తెలంగాణకు కేటాయింపుల ప్రస్తావన ఎందుకులేదని ప్రశ్నించారు. కృష్ణానదిలో తెలంగాణ వాటాపై బచావత్ ట్రైబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. చర్చకు కూడా రాలేదు. పాగ పుల్లారెడ్డి కేంద్రానికి రాయడంతో వారి సూచన మేరకు - బచావత్ ట్రైబ్యునల్ మహబూబ్‌నగర్ జిల్లాకు దయతో(ఇదే మాట వాడారు) జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు కింద 18 టీఎంసీల నీటిని మంజూరు చేశారు. తుంగభద్ర ఎడమకాల్వ, అప్పర్ కృష్ణ, భీమా పూర్తిగా రద్దయి ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా ఎడారిగా మారడానికి కారణమయ్యాయి. వీటన్నింటినీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వ్యవసాయం, విద్యుదీకరణ, ఎరువుల కేటాయింపు, నీటిపారుదల తదితర రంగాల్లోనూ తెలంగాణ పట్ల వివక్షను ప్రాంతీయ కమిటీ లెక్కలతో సహా వివరిస్తూ వచ్చింది.
 • ప్రజా ఉద్యమం

 • వీటన్నింటి కారణంగా తమకు జరగాల్సిన న్యాయం జరగలేదని ప్రజలు ఉద్యమానికి దిగారు. 1969లో ఉద్యమానికి ఇవే మూల కారణాలు. రెండు, మూడు ప్రణాళికల కాలంలో ప్రాంతీయ కమిటీ చేసిన సమీక్ష నివేదికలను పట్టించుకుని ఉంటే ఇబ్బందులు వచ్చేవి కావు. వాటిని పట్టించుకోకపోవడం వల్ల అసమానతలు యథాతథంగా కొనసాగుతూ వచ్చాయి. 1969 ఉద్యమం తలెత్తడంతో నాటి విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకుండాలనే ప్రశ్న తలెత్తింది. వాస్తవానికి రక్షణల కోసం మొదలైన ఉద్యమం వీటన్నింటినీ చూశాక ప్రత్యేక రాష్ట్రం వైపు మళ్లింది.
 • మరోవైపు నియామకాల విషయంలో విలీనం జరిగినప్పుడే అవకతవకలయ్యాయి. వీటికి తోడు ఉన్న ముల్కీ నిబంధనలను కూడా సక్రమంగా అమలు చేయలేదు. ప్రాంతీయ కమిటీకి ముల్కీ నిబంధనల అమలుపై పర్యవేక్షణాధికారం లేకపోయినా సూచనలు చేసే వెసులుబాటును సృష్టించుకుంది. ప్రభుత్వం కూడా సూచనలు చేసే అవకాశముందని అంగీకరించింది. ప్రాంతీయ కమిటీ ఇచ్చిన సూచనలతో ముల్కీ నిబంధనలు బయటపడ్డాయి. స్థానికులు అందుబాటులో లేరనే సాకు, భార్యాభర్తల్లో ఒకరిక్కడ ఉన్నారనే కారణంతో ఇక్కడికి రావడం; తాత్కాలిక పద్ధతిలో నియామకమై తర్వాత శాశ్వతమవడం; దొంగ ముల్కీ పత్రాలతో చేరిపోవడం.. లాంటివి చోటు చేసుకున్నాయి. నాన్‌ముల్కీలు ఎక్కువై.. వారందరినీ వెనక్కి పంపాలనే డిమాండ్ ఊపందుకుంది. మొట్టమొదట పాల్వంచ విద్యుత్తు కేంద్రంలో నాన్‌ముల్కీలను తీసేసి ముల్కీలకు ఉద్యోగమివ్వాలనే డిమాండ్‌తోనే ఉద్యమం ఆరంభమైంది. 1968లో దీన్ని ఉద్యోగులు సాధించుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ 1969 జనవరిలో పాల్వంచ విద్యుత్తు సంస్థలోని ఆంధ్ర ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. పాల్వంచ విద్యుత్తు కేంద్రానికి ముల్కీ నిబంధనలు వర్తించవంటూ కోర్టు తీర్పిచ్చింది.
 • అనంతర కాలంలో.. రక్షణలు కాదు, మన రాష్ట్రం మనకు కావాల్సిందేననే భావన పెరిగింది. ఇదే సమయంలో ఉద్యమం ఉద్ధృతిని గమనించిన ప్రభుత్వం నాన్‌ముల్కీలను వెనక్కి పంపడానికి అంగీకరించి, 36 జీవో జారీ చేసింది. దాని ప్రకారం 22వేల మంది స్థానికేతరులు తెలంగాణలో పనిచేస్తున్నారని ప్రభుత్వం అంగీకరించింది. వారందరినీ వెనక్కి పంపుతున్నట్లు పేర్కొంది. ఒకవైపు జీవో జారీ చేస్తూనే మరోవైపు ఆ ఉద్యోగుల్ని న్యాయస్థానానికి వెళ్లేలా ప్రభుత్వమే ప్రోత్సహించింది. సింగిల్ జడ్జి జీవో 36ను కొట్టేశారు. డివిజన్ బెంచి మాత్రం స్థానిక రిజర్వేషన్లను సమర్థించింది. దీంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. 1972లో సుప్రీంకోర్టు కూడా ముల్కీ నిబంధనల్ని సమర్థించింది. అలా పార్లమెంటు అంగీకరించి, సుప్రీంకోర్టు సమర్థించిన ముల్కీ నిబంధనల్ని సక్రమంగా అమలు చేయించుకోవడం కూడా కష్టసాధ్యమైంది. వాటి అమలును ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజలు పట్టుబట్టి వాటి అమలుకు ఒత్తిడి చేస్తే ప్రజాందోళనలు, మరికొన్ని ఇతర మార్గాల అమలుకు ఆటంకాలు సృష్టించారు. 1972లో జైఆంధ్రా ఉద్యమం ద్వారా తెలంగాణ రక్షణలన్నింటికీ ఎసరు పెట్టారు.
 • ముల్కీ నిబంధనల్ని ఉల్లంఘించారనే విషయం ప్రభుత్వం జారీ చేసిన 36 జీవో ద్వారా తేటతెల్లమైంది. తెలంగాణకు దక్కాల్సిన 22 వేల ఉద్యోగాలు దక్కకుండా పోయాయి. అంటే వీటిని కేవలం 22 వేలుగా లెక్కించలేం. ఆ కాలంలో 22వేల మంది తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగాలు వచ్చి ఉంటే అన్ని కుటుంబాలు, సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉండేది. తర్వాతి కాలంలో ఆ కుటుంబాలు, వారిపై ఆధారపడ్డవారు అవకాశాలను కోల్పోయారు. ఇది తెలంగాణ ప్రాంత యువతలో నిరాశ నిస్పృహలను కల్గించడానికి ప్రధాన కారణమైంది.
 • వ్యవసాయ భూముల అమ్మకాలను ప్రాంతీయ మండలి నియంత్రించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నారు. 1965 దాకా సంబంధిత చట్టమే తయారు కాలేదు. ఈలోగా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద కాల్వల ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతీయులు పెద్దఎత్తున భూముల్ని కొనుగోలు చేశారు. ఆరోజే గనక చట్టాన్ని పటిష్ఠంగా తయారుచేసి అమలు చేసి ఉంటే ఈ ఉల్లంఘనలు జరిగేవి కావు. ఆంధ్ర ప్రాంతీయులకు పాలన యంత్రాంగంపై పట్టు ఉండటంతో.. ఏ సర్వే నెంబర్లలో కాల్వలు వస్తున్నాయో ముందే కనుక్కొని వాటిదగ్గర భూములు కొనుక్కోవడానికి వారికి అవకాశం దక్కింది. ఈ రకంగా పెద్ద మనుషుల ఒప్పందం అమలు పట్ల చిత్తశుద్ధి చూపలేదు.
 • ప్రాంతీయ కమిటీ అఖిలపక్ష సమావేశంలో వీటన్నింటినీ లేవెనెత్తింది. అడిగిన సమాచారం కూడా ఇవ్వడం లేదని కమిటీ ఆక్షేపించింది. దీంతో ప్రాంతీయ కమిటీని పటిష్ఠపరచడానికి ప్రభుత్వం అంగీకరించింది. 1970లో ప్రాంతీయ కమిటీ ఆర్డర్‌ను సవరించి అధికారాలను విస్తృతపర్చారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రాంతీయ మండలికున్న అధికారాలను దాదాపుగా కమిటీకి దఖలు పరిచినా.. ఇవి ఎక్కువ కాలం మిగలలేదు. 1973లో జారీ అయిన 6 సూత్రాల పథకం ద్వారా ఇవన్నీ రద్దయ్యాయి. 1969 ఉద్యమం ద్వారా పెద్దమనుషుల ఒప్పందం అమలును పటిష్ఠ పరచడానికి అంగీకారం కుదిరితే.. 1972 జై ఆంధ్ర ఉద్యమం ద్వారా వీటికి మొత్తంగా తూట్లు పొడిచారు. తెలంగాణకు రక్షణలను రద్దు చేయాలి లేదంటే ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కారణంగా తెలంగాణకు దక్కిన రక్షణలన్నీ రద్దయ్యాయి. దీంతో తెలంగాణకు రక్షణ కల్పించే కవచంలాంటి వ్యవస్థ కూడా పోయింది. ఆకాంక్షల వ్యక్తీకరణకు వేదిక కూడా లేకుండా పోయింది. తెలంగాణ ప్రజలు అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వెసులుబాటు కూడా లేకుండా పోయింది.
 • ఐక్యత సాధించే యత్నాలేవీ?

 • విలీనం కోసం తపించారే తప్ప ప్రజల మధ్య ఐక్యత సాధించడానికి మాత్రం ఆంధ్రప్రాంత నేతలు ప్రయత్నించలేదు. రెండు ప్రాంతాల మధ్య మానసిక ఐక్యత సాధించాలని వారేనాడూ ప్రయత్నించలేదు. ఎలాగైనా విలీనం చేసుకోవాలని చూశారే తప్ప శాశ్వత ప్రాతిపదికన రెండు ప్రాంతాల మధ్య ఐక్యత తీసుకురావడం కోసం ప్రయత్నించలేదు. అందుకే పెద్దమనుషుల ఒప్పందాన్ని గానీ, దాని అమలునుగానీ, ప్రాంతీయ కమిటీని గానీ వారెన్నడూ గౌరవించలేదు. 1969 ఉద్యమంతో పెద్దమనుషుల ఒప్పందం అమలు పట్ల కాస్త దృష్టి సారించినా జై ఆంధ్రా ఉద్యమంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఐక్యతకున్న ప్రాతిపాదికలు, అవకాశాలను ఆరు సూత్రాల పథకం ద్వారా పూర్తిగా నీరుగార్చేశారు.
 • ఆ ఎనిమిదే కీలకం

 • పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలున్నా వాటిలో 8 కీలకమైనవి. అవి..
  1 జనాభా దామాషా ప్రకారం ఉమ్మడి పాలన వ్యయం పోను తెలంగాణ ఆదాయంలో మిగులును తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చేయాలి.
  2 తెలంగాణలోని విద్యావకాశాలను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలి. సదుపాయాలను మరింత మెరుగుపరచాలి.
  3 భవిష్యత్తు ఉద్యోగ నియామకాలను ఇరు ప్రాంతాల నుంచి జనాభా దామాషా ప్రాతిపదికన జరపాలి.
  4 తెలంగాణకు దక్కే నియామకాల్లో ముల్కీ నిబంధనలను పాటించాలి.
  5 తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకాన్ని నియంత్రించే అధికారం తెలంగాణ ప్రాంతీయ మండలికి ఉంటుంది.
  6 తెలంగాణ అవసరాలు, అవకాశాల దృష్ట్యా ఇక్కడి సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రాంత మండలి ఏర్పాటు. ఈ ప్రాంతీయ మండలిలో మొత్తం 20 మంది సభ్యులుంటారు. తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున 9 మంది.. అసెంబ్లీ లేదా పార్లమెంటు నుంచి ఆరుగురు.. అసెంబ్లీ బయటివారు ఐదుగురు - వీరందరినీ తెలంగాణ అసెంబ్లీ సభ్యులే ఎంచుకుంటారు. తెలంగాణ ప్రాంత మంత్రులంతా ఇందులో సభ్యులే.
  7 జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో ఇరు ప్రాంతాలకు వాటా దక్కాలి. హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖల్లో ఏవేని రెండు శాఖలు తెలంగాణకు విధిగా కేటాయించాలి. ఒకవేళ ముఖ్యమంత్రి ఆంధ్రవారైతే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. తెలంగాణవారు ముఖ్యమంత్రి అయితే ఉపముఖ్యమంత్రి పదవి ఆంధ్రకు ఇవ్వాలి.
  8 హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని 1962 వరకు కొనసాగించాలి.
 • 5 సూత్రాల పథకం

  * తెలంగాణ మిగులు గుర్తించడానికి ప్రత్యేక కమిటీ
  * తెలంగాణ అభివృద్ధి విధానాల రూపకల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ
  * ప్రణాళికల పర్యవేక్షణకు ప్రణాళిక సంఘ సభ్యులతో కమిటీ
  * తెలంగాణ రక్షణల అమలు కోసం జ్యూరిస్టులతో కూడిన కమిటీ
  * ఉద్యోగుల సర్వీసుల సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ
 • తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తొలుత అచ్యుత్‌రెడ్డి.. తర్వాత చెన్నారెడ్డి, హయగ్రీవాచారి, చొక్కారావు అధ్యక్షత వహించారు.
 • Posted on 09-10-2015