closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

శాతవాహన రాజులు

 • క్షిణ భారతదేశ రాజకీయ చరిత్ర శాతవాహనులతోనే మొదలైందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. ఉత్తర భారతం విదేశీ దాడులతో సతమతమవుతున్న సమయంలో దక్షిణా పథంలో శాంతిని స్థాపించిన ఘనత శాతవాహనులదే. భారతదేశంలో సాంస్కృతిక ఏకత్వాన్ని సాధించడంలో చరిత్రాత్మక పాత్రను శాతవాహనులు పోషించారని సర్దార్ ఫణిక్కర్ అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంత సంస్కృతిని, దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా రాజకీయ పరిస్థితులను, పరిణామాలను అధ్యయనం చేయాలి.
 • శాతవాహన రాజులు

 • శాతవాహనులు క్రీ.పూ.230 నుంచి క్రీ.శ.223 వరకు పాలించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. మస్కీ, గాజుల బండ, కొండాపూర్, వరంగల్ సమీపంలో 'సాద్వహన అనే ప్రాచీన నాణేలు లభించాయి. ఈ సాద్వహనుడే శాతవాహన వంశ మూల పురుషుడు.
 • శ్రీముఖుడు:
   » ఈయన శాతవాహన రాజ్య స్థాపకుడు.
   » శ్రీముఖుడి పేరు శిశుక, సింధుక, సిప్రక, సుద్ర, చిముక అనే భిన్న రూపాల్లో కనిపిస్తుంది.
   » ఇతడు మౌర్య చక్రవర్తి అశోకుడి సామంత రాజు.
   » శ్రీముఖుడు తొలుత కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతాన్ని పాలించాడు. ఇతడి నాణేలు కోటిలింగాల ప్రాంతంలో లభించాయి.
   » జైన సారస్వతం ప్రకారం శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించాక రాజధానిలో చాలా స్తూపాలను నిర్మించాడు. తర్వాతి కాలంలో దేశంలో జరుగుతున్న బ్రాహ్మణ మతోద్ధరణ ఉద్యమాన్ని గుర్తించి కొత్తగా నిర్మించిన తన రాజ్య భద్రత కోసం క్రమంగా బ్రాహ్మణ మతాన్ని అనుసరించాడు.
   » అశోకుడి మరణానంతరం శ్రీముఖుడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
   » శ్రీముఖుడు మహారాష్ట్రను పాలిస్తున్న మహారథి త్రణయికరో కుమార్తె దేవీ నాగానికను తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు.
  కన్హ:
   » శ్రీముఖుడు మరణించేనాటికి అతడి కుమారుడు శాతకర్ణికి యుక్త వయసు రాకపోవడంతో, శ్రీముఖుడి సోదరుడు కన్హ శాతవాహన రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు.
   » కన్హుడి మహామాత్రుడు నాసిక్‌లో 'శ్రమణుల (బౌద్ధ సన్యాసులు) కోసం గుహలు తవ్వించాడు.
   » అశోకుడి శాసనాల్లో మహామాత్రులనే ఉద్యోగులున్నారు.
   » కన్హేరి శాసనంలో 'మహామాత్ర అనే పదం వల్ల శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారని తెలుస్తోంది.
  మొదటి శాతకర్ణి:
   » మొదటి శాతకర్ణి తన పిన తండ్రి కన్హ మరణానంతరం రాజయ్యాడు. ఇతడు తొలి శాతవాహనుల్లో గొప్పవాడు.
   » మొదటి శాతకర్ణి భార్య నాగానిక అతడి మరణానంతరం నానాఘాట్ శాసనాన్ని వేయించింది. అందులో అతడి విజయాలను పేర్కొంది.
   » నానాఘాట్ శాసనంలో నాగానిక మొదటి శాతకర్ణిని ఏకవీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపథపతి అని వర్ణించింది.
   » పుష్యమిత్రుడు మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో శుంగ వంశాన్ని స్థాపించడంతో మౌర్య సామ్రాజ్యంలో అలజడులు చెలరేగాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న శాతకర్ణి తూర్పు మాళవను ఆక్రమించాడు. శాతకర్ణికి చెందిన నాణేలపై ఉజ్జయినీ చిహ్నాలున్నాయి.
   » 'చుళ్ల కళింగ జాతకంలో కళింగాధీశుడి (కళింగ పాలకుడు ఖారవేలుడు)పై అశ్మకాధిపతి (మొదటి శాతకర్ణి) విజయం సాధించినట్లు ఉంది. దీంతో రాజ్యం తూర్పు దిశకు విస్తరించింది.
   » మొదటి శాతకర్ణి రెండు అశ్వమేథ యాగాలు, ఒక రాజసూయం చేశాడు. అశ్వమేథ యాగం చేసినప్పుడు అతడు ముద్రించిన నాణెం ఒకటి ఇటీవల పుణె సమీపంలో దొరికింది.
   » శాతకర్ణి వైదిక మతాభిమాని. ఇతడు అప్తోర్యామ, అనారంభనీయ, త్రిరాత్ర, దశరాత్ర, త్రయోదశీ రాత్రాది యజ్ఞాలు చేసి భూములను, గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు.
  పూర్ణోత్సంగుడు:
   » పుర్ణోత్సంగుడు మొదటి శాతకర్ణి కుమారుడు. ఇతడి నాణేలు నెవాసా ప్రాంతంలో లభించాయి.
   » పూర్ణోత్సంగుడి అసలు పేరు వేదసిరి.
   » కళింగ రాజైన ఖారవేలుడు ప్రతీకారంతో శాతవాహన రాజ్యంపై దండెత్తి పిథుండ (భట్టిప్రోలు లేదా ప్రతిపాలపురం) నగరాన్ని ధ్వంసం చేశాడు.
   » ఖారవేలుడిని 'మహిషకాధిపతిగా గుంటుపల్లి శాసనం తెలుపుతోంది.
   » ఖారవేలుడి దండయాత్ర వల్ల శాతవాహన రాజ్యానికి ఆర్థికంగా నష్టం వాటిల్లింది.
  రెండో శాతకర్ణి:
   » రెండో శాతకర్ణి రాజ్యాన్ని 56 సంవత్సరాల పాటు దీర్ఘకాలం పాలించాడు.
   » ఇతడి నాణేలు తెలంగాణ, మహారాష్ట్ర, మాళవల్లో లభించాయి.
   » ఇతడికి 'రాజన్య శ్రీ శాతకర్ణి బిరుదు ఉంది.
   » యుగ పురాణం ప్రకారం రెండో శాతకర్ణి శకులను ఓడించి మగధ, కళింగలను ఆక్రమించాడు.
   » ఇతడి ఆస్థానంలో వాసిష్ఠీపుత్ర ఆనందుడనే గొప్ప కళాకారుడు, శిల్పకారుడు ఉండేవాడు. ఈ కళాకారుడు సాంచీ స్తూప దక్షిణ ద్వారంపై ఒక శాసనాన్ని చెక్కాడు.
  అపీలక:
   » ఇతడి కాలంలో శకరాజు ఉజ్జయినీ పైకి దండెత్తగా విజయవంతంగా తిప్పికొట్టాడు. ఈ విజయానికి సూచికగా క్రీ.పూ.58లో విక్రమ శకాన్ని ఏర్పాటు చేసినట్లు కాలకాచార్య కథానిక అనే జైన గ్రంథం ద్వారా తెలుస్తోంది.
   » ఇతడి నాణెం ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో దొరికింది.
   కుంతల శాతకర్ణి:
   » వాత్సాయనుడి కామసూత్రాలు, సోమదేవసూరి కథాసరిత్సాగరం, రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాఢ్యుడి బృహత్కథల్లో కుంతల శాతకర్ణి ప్రస్తావన, ప్రశంస ఉన్నాయి.
   » ఇతడి ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అనే కవులుండేవారు.
   » గుణాఢ్యుడు - బృహత్కథ (పైశాచి భాష)
   » శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం (సంస్కృత వ్యాకరణ గ్రంథం)
   » గుణాఢ్యుడి బృహత్కథ ఆధారంగా విష్ణుశర్మ పంచతంత్రాన్ని రాశాడు.
   » కుంతల శాతకర్ణి తన భార్యతో సరస మాడుతూ మొరటుగా ప్రవర్తించాడని దాంతో ఆమె మరణించిందని వాత్సాయనుడు పేర్కొన్నాడు.
  మొదటి పులోమావి:
   » మొదటి పులోమావి శాతవాహనుల్లో 15వ రాజు. ఇతడు ఉత్తర భారతంలోని మగధ రాజ్యంపై దండెత్తి దాని పాలకుడైన సుశర్మను వధించి మగధను ఆక్రమించాడు.
   » ఇతడు పశ్చిమ క్షాత్రపులను ఓడించి పూర్వ శాతవాహన భూభాగాలైన అకర (తూర్పు మాళవ), అవంతి (పశ్చిమ మాళవ) లను ఆక్రమించాడు.
   » ఈ విధంగా శాతవాహన రాజ్యం పాటలీపుత్రను జయించి అఖిల భారత సామ్రాజ్యంగా రూపొందింది.
   » ఉత్తర హిందూ స్థానంలో పులోమావికి లభించిన ఈ విజయాన్ని గురించి కుమ్రాహర్ (ప్రాచీన పాటలీపుత్రం), భీతాల (అలహాబాద్ సమీప స్థలం) తవ్వకాల్లో లభించిన శాతవాహన నాణేలు సాక్ష్యంగా ఉన్నాయి.
  హలుడు:
   » హలుడు శాతవాహానుల్లో 17వ రాజు.
   » ఇతడు ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. హలుడు గొప్ప కవి. ఇతడికి 'కవివత్సలుడు అనే బిరుదుంది.
   » ఇతడు సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ప్రాకృత పద్య గాథలను సేకరించి 'గాథాసప్తశతి (సత్తసయి) గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథంలో ఏడు వందల శృంగార గాథలున్నాయి.
   » ఇతడు సింహళ రాజకుమారి లీలావతిని ప్రేమించినట్లు, వీరి వివాహాం సప్తగోదావరి ప్రాంతంలో ఉన్న ద్రాక్షారామంలో జరిగినట్లు లీలావతి ప్రాకృత కావ్యం తెలుపుతోంది.
   » హలుడు మొదటి ప్రజాకవిగా కీర్తి పొందాడు.
   » 'లీలావతి కావ్యాన్ని కుతూహలుడు రచించాడు.
   » అభిదాన చింతామణి, లీలావతి కావ్యం, దేశీనామమాలాది గ్రంథాలు హలుడి కీర్తి ప్రతిష్ఠలను తెలుపుతున్నాయి.

  మలిశాతవాహనులు

  గౌతమీపుత్ర శాతకర్ణి:
   » ఇతడు శాతవాహనుల్లో గొప్పవాడు. ఈ వంశంలో 23వ రాజు.
   » ఇతడి తల్లి బాలశ్రీ. ఈమె గౌతమీపుత్ర శాతకర్ణి మరణానంతరం నాసిక్ శాసనాన్ని వేయించింది.
   » నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి రాజకీయ విజయాలు, గుణగణాలను వివరిస్తుంది.
   » ఇతడు క్రీ.శ.78లో శాలివాహన శకాన్ని ఆరంభించాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
   » ఇతడు క్షహరాట వంశీయుడైన నహపాణుడిని ఓడించి చంపాడు.
   » జోగల్తంబి ప్రాంతంలో లభించిన నహపాణుడి నాణేలను గౌతమీపుత్ర శాతకర్ణి అతడిపై లభించిన విజయానికి సూచనగా తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు.
   » క్షహరాట వంశ నిర్మూలన చేసిన సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి 'క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదును పొందాడు.
   » జోగల్తంబి తమిళనాడులోని కడలూరు దగ్గర ఉంది. ఇక్కడ గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు లభించాయి.
   » ఇతడి కాలం నుంచే రాజులు తమ తల్లుల పేర్లను తమ పేర్లకు ముందు ధరించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.
   » ఈ విధంగా మాతృ సంజ్ఞలను వాడిన మొదటి శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి.
   » మూడు సముద్రాల పర్యంతం సామ్రాజ్యాన్ని విస్తరించిన ఇతడు 'త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదును ధరించాడు. ఇతడి రథాశ్వాలు మూడు సముద్రాల నీళ్లు తాగేవని ప్రతీతి.
   » ఇతడి శాసనాలు నాసిక్, కన్హేరి, చినగంజాముల్లో లభించాయి.
   » ఇతడు సాంచీ స్తూపానికి తోరణాలను చెక్కించాడు.
  గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు:
   » శాతవాహన కుల యశఃప్రతిష్ఠాపనకరుడు
   » క్షత్రీయ దర్పమానమర్దనుడు
   » శకయవన పహ్లవ నిఘాదనుడు
   » ఏక బ్రాహ్మణుడు
   » ఏక శూరుడు బీ ఏక ధనుర్ధరుడు
   » ఆగమ నిలయుడు
   » వర్ణ సాంకర్యం మాన్పాడని పై బిరుదులతో అతడి తల్లి స్తుతించింది. ఆమెకు రాజర్షి వధువు అనే బిరుదు ఉంది.
   » నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణిని 'బెణాకట స్వామి అనే బిరుదుతో వ్యవహరించింది.
   » ఇతడు 'రాజరణో (రాజరాజు) అనే సార్వభౌమ బిరుదు ధరించాడు.
   » నాగార్జున కొండలో ఇటీవల జరిగిన తవ్వకాల్లో గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలతోపాటు నాణేలు ముద్రించే దిమ్మలు కూడా దొరికాయి.
   » ఈ దిమ్మలు నాడు శ్రీపర్వతంలో శాతవాహన టంకశాల ఉండేదన్న విషయాన్ని సూచిస్తున్నాయి.
  వాశిష్టపుత్ర పులోమావి (రెండో పులోమావి):
   » ఇతడు గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు.
   » ఇతడి శాసనాలు నాసిక్, కార్లే, అమరావతిల్లో లభించాయి.
   » 'దక్షిణాపథేశ్వరుడ'నే బిరుదు ఇతడికి ఉండేదని నాసిక్ శాసనం ద్వారా తెలుస్తోంది.
   » హిప్పొకురన్ పాలకుడైన కర్దముక చష్టనుడు ఇతడికి సమకాలీకుడని టాలమీ తన గ్రంథంలో పేర్కొన్నాడు. ఇతడికి 'నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది.
   » ఇతడు ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ధాన్యకటకంలో అతడి శాసనం, నాణేలు లభించాయి.
  యజ్ఞశ్రీ శాతకర్ణి:
   » ఇతడు ప్రముఖ శాతవాహన రాజుల్లో చివరివాడు. శాసనాలు, నాణేలు ఇతడిని గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణిగా వ్యవహరిస్తున్నాయి.
   » నాసిక్, కన్హేరి, చినగంజాముల్లో ఇతడి కాలంనాటి శాసనాలు లభించాయి.
   » క్షహరాట వంశంలో జీవధామ, రుద్రసింహుల మధ్య జరిగిన అంతఃకలహాలను ఆసరాగా చేసుకుని, యజ్ఞశ్రీ కొంకణ సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించాడు.
   » మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన ఆచార్య నాగార్జునుడిని యజ్ఞశ్రీ ఆదరించాడు. ఇతడికి నాగార్జున కొండలో పారవత మహా విహారాన్ని నిర్మించి ఇచ్చి, బౌద్ధ మతాభిమానాన్ని ప్రకటించాడు.
   » యజ్ఞశ్రీ కాలంలోనే మత్స్యపురాణాన్ని రచించారని పర్గీటర్ తెలిపాడు.
   » బాణుడు తన హర్షచరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీని 'త్రిసముద్రాధీశ్వర' అని పేర్కొన్నాడు.
   » టిబెట్, చైనా చరిత్రకారులు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి చైత్యాలయం, మహా విహారాలను నిర్మించి ఇచ్చాడని, ధాన్యకటక మహాస్తూప శిలాప్రాకారాన్ని నాగార్జునాచార్యుడు నిర్మించిందేనని తెలిపారు.
   » ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ కోసం 'సుహృల్లేఖను రచించాడు.
   » కథా సరిత్సాగరంలోని కథను బట్టి నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించాడు. దాని పరిణామం వల్ల దేశంలో విప్లవం ఏర్పడి, సామంతుల తిరుగుబాటు సంభవించిందని, దీంతో శాతవాహన రాజ్యం క్షీణించిందని తెలుస్తోంది.
   » చినగంజాంలో దొరికిన శాసనాన్ని బట్టి ఇతడు ఒక యజ్ఞం చేసినట్లు తెలుస్తోంది.
   » రెండు తెరచాపలతో కూడిన నౌకాముద్ర ఉన్న ఇతడి నాణేలు ఆ కాలంలో జరిగిన విదేశీ నౌకా వ్యాపారాభివృద్ధిని తెలియజేస్తున్నాయి.
   » ఇతడి కాలంలో రోమ్ దేశంతో వర్తకం జరిగేది.
  విజయశ్రీ శాతకర్ణి:
   » ఇతడి శాసనం నాగార్జున కొండలో లభించింది.
   » ఇతడు విజయపురి పట్టణాన్ని శ్రీపర్వతం సమీపంలో నిర్మించాడు.
  మూడో పులోమావి:
   » మూడో పులోమావి చివరి శాతవాహన పాలకుడు. యుగ పురాణాన్ని అనుసరించి ఇక్ష్వాక నాయకుడైన శాంతమూలుడు మూడో పులోమావిని పారద్రోలి, ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించాడు.
   » మూడో పులోమావి కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చేరుకుని, కొంతకాలం రాజ్యం చేసి అక్కడే మరణించాడు.
   » ఇతడి శాసనం బళ్లారి జిల్లా మ్యాకదోనిలో లభించింది. ఈ శాసనం శాతవాహన రాజ్య పతనాన్ని తెలియజేస్తుంది.

  'తెలంగాణ' పద ఉత్పత్తి

   » క్రీ.శ. తొలి శతాబ్దాలకు చెందిన ప్రథమ సాహిత్య గ్రంథాలైన మార్కండేయ, వాయు పురాణాల్లో త్రిలింగ, తిలింగ అనే పదాలు కనిపిస్తున్నాయి.
   » తిలింగుల జనపథం మధ్య దేశంలోని జనపథాల్లో ఒకటిగా వాయు పురాణం పేర్కొంది. కాబట్టి దీన్నే తెలంగాణగా చెప్పవచ్చు. తెలుంగు, తెలంగ్, త్రిలింగ్ అనే శబ్దాన్ని అంగునీయం అనే తమిళ వ్యాకరణ గ్రంథంలో పేర్కొన్నారు.
   » నన్నయ ఆదిపర్వంలో తెలింగ ప్రాంతాన్ని పేర్కొన్నాడు.
   » దేవగిరిని పాలించిన యాదవ రాజుల మంత్రి అయిన హేమాద్రి తన 'వ్రతఖండం అనే గ్రంథంలో కాకతీయ రుద్రుడిని త్రిలింగ అధిపతిగా, ఆంధ్ర మహారాజ్ఞిగా వర్ణించాడు. దీన్నిబట్టి నాడు తెలుగు ప్రాంతాలకు త్రిలింగదేశం, ఆంధ్రదేశం అనే పేర్లు స్థిరపడ్డాయని చెప్పవచ్చు.
   » కాకతీయ ప్రతాప రుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యన ఉన్న ప్రాంతమే త్రిలింగదేశమన్నాడు. కానీ, అప్పటికే ఆ పేరు ప్రాచుర్యంలో ఉంది.
   » 12వ శతాబ్దపు కుర్గోడు శాసనంలో కూడా 'తెలుంగ అనే పదముంది.
   » 14వ శతాబ్దం నాటి శ్రీరంగ తామ్ర శాసనం త్రిలింగ దేశపు సరిహద్దులను పేర్కొంది. దీని ప్రకారం నేటి ఆంధ్రప్రదేశ్‌ను అంతా ఒకటిగా గుర్తించినట్లు తెలుస్తోంది.
   » కాకతీయుల పతనానంతరం ముస్లిం చరిత్రకారులు తమ రచనల్లో 'తెలంగాణ పేరును ఎక్కువగా ప్రస్తావించి ప్రాచుర్యం చేశారు. ఆ విధంగా కాలక్రమంలో తెలంగాణ పేరు స్థిరపడింది.
   » మహ్మద్‌బీన్ తుగ్లక్ సేనాని అనూర్‌వలి తెలంగాణ ఆక్రమణ తర్వాత కోస్తాంధ్ర పైకి దండెత్తాడు. ఈ సందర్భంలో ఆయన తాను జయించిన ప్రాంతాన్ని శాసనాల్లో తెలంగాణ అని రాయించాడు.
   » మొగల్ ఆస్థాన కవి అబుల్‌ఫజల్ తెలంగాణ అని ప్రస్తావించాడు.
   » ప్రోలయ నాయకుడి 'విలస శాసనం'లో తెలంగాణ ప్రస్తావన ఉంది.
   మెదక్ జిల్లా తెల్లాపూర్‌లో లభించిన 1417 నాటి శాసనంలో 'తెలుంగణ' పదాన్ని ప్రస్తావించారు.
   » శ్రీకృష్ణదేవరాయలదండయాత్రల్లో తెలంగాణ పదం, తెలంగాణలోని దుర్గాల గురించి ఉంది.
   » శ్రీకృష్ణదేవరాయల శాసనాలు చిన్నకంచి (1917), తిరుమల (1917) శాసనాల్లో తెలంగాణ ప్రస్తావన ఉంది.
   » కళింగను పాలించిన గజపతి వంశీయుడైన ప్రతాపరుద్ర గజపతి 'వెలిచర్ల శాసనంలో 'తెలుంగాణ పదాన్ని పేర్కొంది.
   » అసఫ్ జాహీల కాలంలో కోస్తా ప్రాంతం బ్రిటిష్‌వారి ఆధీనంలోకి రాగా దాన్ని ఆంధ్ర అని వ్యవహరించారు.
   » నిజాం పాలనలోని తెలుగు ప్రాంతాలకు తెలంగాణ అనే పేరు స్థిరపడింది.
  Posted on 15-09-2015

  ఎం. జితేందర్ రెడ్డి