closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

కుతుబ్‌షాహీల సాంస్కృతిక సేవ

 • తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణాలు.. ప్రసిద్ధి చెందిన రచనలు.. కళాత్మక అద్భుతాలు.. ఇవన్నీ కుతుబ్‌షాహీల పాలనా కాలంలోని ప్రత్యేకతలు. తెలుగు, ఉర్దూ సాహిత్యాల అభివృద్ధికి వీరు విశేషంగా కృషి చేశారు. కవులకు కుతుబ్‌షాహీలిచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఎన్నో గ్రంథాలు, మరెన్నో రచనలు రూపుదాల్చాయి. వారి కాలంనాటి సాహిత్య, సాంస్కృతిక, కళాత్మక విషయ విశేషాలు తెలుసుకుందామా!
 • కుతుబ్‌షాహీల పాలనా కాలంలో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ విశేషంగా అభివృద్ధి చెందింది. వీరు ముస్లిం పాలకులైనప్పటికీ తెలుగు భాష, సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. కుతుబ్‌షాహీలు నిర్మించిన ఎన్నో కట్టడాలు ఇప్పటికీ తెలంగాణలో సజీవసాక్ష్యాలుగా నిలిచాయి. కుతుబ్‌షాహీల రాజభాష పర్షియన్. వీరి కాలంలో తెలుగుతోపాటు ఉర్దూ, పర్షియన్ భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది. కుతుబ్‌షాహీల పాలనలోని మరిన్ని విశేషాలు...
 • ఇబ్రహీం కుతుబ్‌షా

 • ఇబ్రహీం కుతుబ్‌షా తెలుగు, ఉర్దూ, పర్షియన్ భాషా కవులను పోషించారు. అతని ఆస్థానంలో ఉండే తెలుగు కవులు ఇబ్రహీం 'మల్కీభరాముడి'గా కీర్తించారు. ప్రముఖ తెలుగు కవులు కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధర కవి, పొన్నెగంటి తెలగనార్యుడు అతని ఆస్థానంలోనివారే.
 • కందుకూరి రుద్రకవి: 'సుగ్రీవ విజయం' అనే గ్రంథాన్ని రచించాడు. ఇది తెలుగులో మొదటి యక్షగానం. 'నిరంకుశోపాఖ్యానం' అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా ఇతడికి రెంటచింతల గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
  అద్దంకి గంగాధర కవి: 'తపతీసంవరణోపాఖ్యానం' అనే గ్రంథాన్ని రచించి ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు.
  పొన్నెగంటి తెలగనార్యుడు: 'యయాతి చరిత్ర' అనే కావ్యాన్ని రచించాడు. ఇది తెలుగుభాషలో మొదటి అచ్చ తెలుగు కావ్యం.
  ఉర్దూ కవులు: ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో దక్కనీ ఉర్దూ అనే మాండలిక ఉర్దూ భాష ప్రారంభమైంది. అలీపుర్సి కవి 'నసబ్‌నామా కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని, ఫెరోజ్ అనే మరో కవి 'తెసల్‌నామా' గ్రంథాన్ని రచించారు.
  పారశీక సాహిత్యం: పర్షియన్ భాషలో ఖర్హా అనే కవి 'తారిఖ్ ఎల్చి నిజాంషా' అనే చారిత్రక గ్రంథాన్ని ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు.

  మహమ్మద్ కులీ కుతుబ్‌షా

 • మహమ్మద్ కులీ కుతుబ్‌షా గొప్ప ఉర్దూ కవి. ఉర్దూ, పారశీక భాషల్లో కావ్యాలు రాశాడు. స్వయంగా కొన్ని వందల పద్యాలు రచించాడు. వర్ణనాత్మక కవిత్వం, గజల్ రచనల్లోనూ అతడు నిష్ణాతుడు. అతని కలం పేరు 'మానీ'. కవిత్వాల పుస్తకం 'కులి యత్ కులీ'.
  తెలుగు కవులు: మహమ్మద్ కులీ తెలుగు కవులను పోషించాడు. అతని ఆస్థానంలో సారంగ తమ్మయ అనే కవి 'వైజయంతీ విలాసం' రచించాడు. సారంగ తమ్మయ గోల్కొండ రెవెన్యూ అధికారిగా (కరణం) పని చేశాడు. ఎల్లారెడ్డి అనే కవి కిరాతార్జునీయం, బాలభారత కావ్యాలను రచించాడు. మహమ్మద్ కులీ ఆస్థానంలో గణేష్ పండితుడు అనే కవి ఉండేవాడు.
  ఉర్దూ కవులు: గులాం అలీ 'పద్మావతి' అనే గ్రంథాన్ని తెలుగు నుంచి ఉర్దూలోకి అనువదించాడు. వజిహీ అనే కవి 'లైలా మజ్నూ' కావ్యాన్ని రచించాడు.
 • అబ్దుల్లా కుతుబ్‌షా

 • అబ్దుల్లా కుతుబ్‌షా అనేక ద్విపదలను ఉర్దూ భాషలో రచించాడు. ఇతడి కాలంలోని ఉర్దూ, తెలుగు కవులు..
  కుష్-షియారా గవాసి: వెనకటి కావ్యాలకు స్వేచ్ఛానువాదాలు చేసిన మొదటి ప్రసిద్ధ కవి. క్రీ.శ.1625లో 'సైపుల్ ముల్క్ నాబదియుల్ జమాల్' అనే కావ్యాన్ని రచించాడు.
  ఇబన్-ఎ-నిషాతీ: పూల్‌బన్ అనే కావ్యాన్ని రచించాడు.
  క్షేత్రయ్య: కుతుబ్‌షాహీల కాలానికి చెందినవాడు. అతను గొప్ప తెలుగు 'పదకవిత' కర్త. అబ్దుల్లా కుతుబ్‌షా ఆస్థానాన్ని దర్శించి ఆయనపై 1500 పదాల(పద్యాలు)ను పాడాడు. అతని స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ గ్రామం.
 • అబుల్ హసన్ (తానీషా)

 • భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న తానీషా కాలానికి చెందినవాడు. గోపన్న పాల్వంచ తహసీల్దారుగా పనిచేశాడు. ప్రభుత్వ సొమ్ముతో రామాలయాన్ని నిర్మించాడని గోపన్నను సుల్తాన్ గోల్కొండ కోటలోని చెరసాలలో బంధించాడు. శ్రీరాముడిని ఉద్దేశించి గోపన్న పాడిన సంకీర్తనలు ప్రజల అభిమానాన్ని పొందాయి. గోపన్న భక్తరామదాసుగా ప్రసిద్ధి చెందాడు. అతను రచించిన 'దాశరథి శతకం' తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తిని పొందింది. యోగి వేమన కూడా ఈ కాలానికి చెందినవాడే. నాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ 4000 పద్యాలు రచించాడు.
 • ఆనాటి కాలంలోనే ఉపనిషత్తులను ఉర్దూ, పర్షియన్ భాషల్లోకి అనువదించారు. చివరి ఇద్దరు సుల్తాన్‌లు తమ ఫర్మానాలను తెలుగు, పర్షియన్ భాషల్లో రాయించారు.
 • నృత్యం - సంగీతం

 • కుతుబ్‌షాహీలు సంగీత, నృత్యాలను బాగా ఆదరించారు. దర్బార్‌లో, సామంతుల ఆస్థానాల్లో నృత్య ప్రదర్శనలు జరిగేవి. సాంఘిక, మత ఉత్సవాల సందర్భంగా నృత్య, సంగీత ప్రదర్శనలుండేవి. కూచిపూడి భాగవతులకు అబుల్‌హసన్ కూచిపూడి గ్రామాన్ని మిరాశీ (వంశపారం పర్యం)గా ఇచ్చాడు. వీరు నృత్యనాటకాలను ప్రదర్శించేవారు. వీటిలో ముఖ్యంగా భామాకలాపం, ఉషాపరిణయం, గొల్లకలాపం నాటకాలు ప్రజాదరణ పొందాయి.
 • ఈ కాలంలో త్రిపుట, ఏక, జంపె అనే తాళాలుండేవి (నృత్య తాళం). హిందోళ, దేవగాంధారి, భైరవి, మాళవి, కన్నడ తదితర రాగాలు; వీణ, పిల్లన గ్రోవి, కిన్నెర, మృదంగం అనే వాయిద్యాలు ఉండేవి.
 • చిత్ర లేఖనం

 • కుతుబ్‌షాహీల కాలంలో చిత్రలేఖనంలో హిందూ పారశీక పద్ధతుల సమ్మేళనంతోపాటు పాశ్చాత్య సంప్రదాయ ప్రభావం ఉండేది. నాటి చిత్రకళను దక్కనీ వర్ణ చిత్రకళ అంటారు. ఈ కాలంలో దక్కన్‌లోని గ్రంథాలను సూక్ష్మ చిత్రాలతో అలంకరించే పద్ధతి ఉంది. దక్షిణదేశంలో వాడకానికి తయారైన కలంకారీ అద్దకాల్లో గోల్కొండ వర్ణచిత్రాల ప్రభావం కనిపిస్తుంది. 17వ శతాబ్దంలో మచిలీపట్నం కలంకారీ అద్దకాలు దక్కనీ చిత్రరూపాలుగా ఉన్నాయి.
 • వాస్తు శిల్పాలు

 • కుతుబ్‌షాహీల కాలంలో నిర్మాణాలు పారశీక, పఠాన్, హిందూ సంప్రదాయాల సమ్మేళనమై 'మిశ్రమ శైలి'లో ఉన్నాయి. ఈ నిర్మాణ పద్ధతిని మహమ్మద్ కులీ కుతుబ్‌షా ప్రారంభించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా అనేక నిర్మాణాలు చేపట్టాడు. అవి..
 • పురానాపూల్

 • ఇబ్రహీం కుతుబ్‌షా క్రీ.శ. 1578లో నిర్మించాడు. ఇది మూసీనదిపై నిర్మించిన మొదటి వంతెన. దీని నిర్మాణంలో 22 ఆర్చ్‌లు ఉన్నాయి. ఈ వంతెన ఎత్తు 54 అడుగులు, పొడవు 600 అడుగులు. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ దీన్ని పారిస్‌లోని పొంట్‌న్యుప్‌తో పోల్చాడు.
 • హుస్సేన్ సాగర్

 • హుస్సేన్ సాగర్‌ను ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మూసీ ఉపనదిపై నిర్మించారు. దీనికి నీరు బలక్‌పూర్ నదీ శాఖల నుంచి చేరేది. ఇబ్రహీం కుతుబ్‌షా మేనల్లుడైన హుస్సేన్ షావలీ గొప్ప సూఫీ మత సాధువు. హుస్సేన్ సాగర్ జలాశయ నిర్మాణం అతని పర్యవేక్షణలోనే సాగింది. ఇది హైదరాబాద్ - సికింద్రాబాద్ నగరాలను కలిపే వంతెనగా మారింది. దీని పొడవు 1 1/2 మైళ్లు. హుస్సేన్ షావలీ పర్యవేక్షణలో నిర్మాణ మైంది కాబట్టి దీనికి హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది.
 • ఇబ్రహీంపట్నం చెరువు

 • ఇబ్రహీం కుతుబ్‌షా ఇబ్రహీంపట్నం గ్రామంలో దీన్ని నిర్మించాడు. అతను గోల్కొండ దుర్గ ప్రాకారాన్ని కూడా కట్టించాడు.
 • మహ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మాణాలు

  హైదరాబాద్ నగరం: గోల్కొండ నగరంలో జనాభా పెరిగి రద్దీగా మారడంతో మహ్మద్ కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. దీని నిర్మాణంలో మీర్-మొమీన్-మహమ్మద్-అస్ట్రాబాదీ కీలక పాత్ర పోషించాడు. అతను క్రీ.శ.1581లో ఇరాన్ నుంచి దక్కన్‌కు వలస వచ్చి కుతుబ్‌షాహీ ఆస్థానంలో చేరాడు. త్వరితగతిన సుల్తాన్ విశ్వాసాన్ని పొంది క్రీ.శ.1585లో గోల్కొండ రాజ్యానికి పీష్వా (ప్రధానమంత్రి)గా నియమితుడయ్యాడు. అతను హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను తన గత అనుభవాన్ని ఉపయోగించి రూపొందించాడు. మూసీనదికి దక్షిణంగా హైదరాబాద్ నగర నిర్మాణాన్ని క్రీ.శ.1590-91లో ప్రారంభించారు. అస్ట్రాబాదీ నగర ప్రణాళికను త్రిభుజాకారంలో రూపొందించాడు. ఈ నగర నిర్మాణానికి ఇరాన్‌లోని ఇస్పాహాన్ నగరాన్ని నమూనాగా తీసుకున్నాడు.

  చార్మినార్

 • చార్మినార్ నిర్మాణం కోసం నాలుగు మార్గాలు కలిసే కూడలిని రూపొందించారు. చార్మినార్ నిర్మాణానికి ముందే చార్ కమాన్ (నాలుగు ఆర్చ్‌లు)ను నిర్మించారు. వాటి సరసన చార్ సుకా హౌజ్(నాలుగు దిశల చెరువు)ను నిర్మించారు. సఫాయిద్ నగరం (ఇరాన్)లోని మైదాన్-ఇ-నక్షజహాన్ మాదిరిగా చార్మినార్ ప్రధాన కూడలిని రూపొందించారు. దీని నిర్మాణాన్ని క్రీ.శ.1591-92లో పూర్తి చేశారు.
 • గోల్కొండ కోట

 • క్రీ.శ.1512 నుంచి 1687 వరకు గోల్కొండ కోట కుతుబ్‌షాహీల ఆధీనంలో ఉండేది. కోట అవతలి ప్రహరీలో మొత్తం 8 దర్వాజాలున్నాయి. వీటిలో ప్రధానమైంది ఫతేదర్వాజ. దీని ఎత్తు 25 అడుగులు, వెడల్పు 13 అడుగులు ఉండి శత్రుదుర్భేద్యంగా ఉండేది. కోటలోపల బాల హిస్సార్, దివాన్-ప్యాలెస్, జామియా మసీదు, నగీనాబాగ్, సిల్హాఖానా ఉన్నాయి.
 • మక్కా మసీదు

 • చార్మినార్‌కు సమీపంలోని మక్కా మసీదు ఒక అద్భుత కట్టడం. దీన్ని మక్కాలోని ప్రసిద్ధ మసీదు నమూనా ఆధారంగా నిర్మించారు. దీని నిర్మాణాన్ని మహమ్మద్ కుతుబ్‌షా క్రీ.శ.1617లో ప్రాంభించాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత దీన్ని క్రీ.శ.1694లో పూర్తి చేశాడు. పవిత్ర మక్కా నుంచి కొన్ని ఇటుకలు ఈ మసీదు నిర్మాణంలో వాడటంతో దీనికి మక్కా మసీదు అనే పేరు వచ్చింది. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త తల వెంట్రుకలు, ఇతర పవిత్ర వస్తువులు భద్రపరిచారని టావెర్నియర్ పేర్కొన్నాడు.
  దారుల్ షిఫా: దీన్ని మహ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మించాడు. ఇది రెండంతస్తుల ప్రజా ఆస్పత్రి. యునాని వైద్యులు ఇక్కడ రోగులకు చికిత్స చేసేవారు.
 • కుతుబ్‌షాహీల సమాధులు

 • గోల్కొండకు సమీపంలో బంజారా దర్వాజా వద్ద ఏడు సమాధులను కుతుబ్‌షాహీ వంశస్థులు నిర్మించారు. ఇవి కుతుబ్‌షాహీ పాలకులవి. వీటిలో సుల్తాన్ కులీ కుతుబ్‌షా సమాధి 30.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చతురస్రాకార ప్లాట్‌ఫాంపై ఉంది. ఇబ్రహీం కుతుబ్‌షా సమాధి రెండంతస్తుల భవంతి. ఇది చతురస్రాకారంలో ఉంది. ఇందులో అయిదు ఆర్చ్‌లు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదగా నిలిచాయి.
 • హయత్‌నగర్

 • మహమ్మద్ కుతుబ్‌షా భార్య హయత్‌బక్ష్‌బేగం క్రీ.శ.1626లో హైదరాబాద్‌కు సమీపంలో హయత్‌నగర్‌ను నిర్మించింది.
 • మాదిరి ప్రశ్నలు

  1. కుతుబ్‌షాహీల కాలం నాటి రాజభాష ఏది?
  ఎ) హిందీ బి) ఉర్దూ సి) పర్షియన్ డి) తెలుగు
  జ: (సి)
  2. తెలుగులో మొదటి యక్షగానం ఏది?
  ఎ) సుగ్రీవ విజయం బి) యయాతి చరిత్ర సి) విక్రమార్జున విజయం డి) రసరంగాలహరి
  జ: (ఎ)
  3. తపతీసంవరణోపాఖ్యానాన్ని ఎవరు రచించారు?
  ఎ) కందుకూరి రుద్రకవి బి) పొన్నెగంటి తెలగనార్యుడు సి) సారంగ తమ్మయ డి) అద్దంకి గంగాధర కవి
  జ: (డి)
  4. మొదటి అచ్చతెలుగు కావ్యం ఏది?
  ఎ) వైజయంతీ విలాసం బి) యయాతి చరిత్ర సి) సుగ్రీవ విజయం డి) తపతీసంవరణోపాఖ్యానం
  జ: (బి)
  5. 'నసబ్‌నామా కుతుబ్‌షాహీ' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
  ఎ) ఖర్హా బి) అలీపుర్సి సి) ఫెరోజ్ డి) నిషాతి
  జ: (బి)
  6. మహమ్మద్ కులీ కలం పేరు?
  ఎ) మానీ బి) గానీ సి) నిషాన్ డి) కులియత్
  జ: (ఎ)
  7. కిందివారిలో భక్తరామాదాసుగా ప్రసిద్ధి చెందింది ఎవరు?
  ఎ) వెంకన్న బి) కంచెర్ల గోపన్న సి) పొదిలి లింగన్న డి) రుస్తుంరావు
  జ: (బి)
  8. మక్కామసీదు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది?
  ఎ) క్రీ.శ. 1610 బి) క్రీ.శ. 1614 సి) క్రీ.శ. 1617 డి) క్రీ.శ. 1615
  జ: (సి)
  9. ఏ నగర నమూనా ఆధారంగా హైదరాబాద్‌ను నిర్మించారు?
  ఎ) బాగ్దాద్ బి) మక్కా సి) పారిస్ డి) ఇస్పాహాన్
  జ: (డి)
  10. పురానాపూల్‌ను ఎప్పుడు నిర్మించారు?
  ఎ) క్రీ.శ. 1552 బి) క్రీ.శ. 1570 సి) క్రీ.శ. 1574 డి) క్రీ.శ. 1578
  జ: (డి)
  Posted on 01-12-2015

  డాక్ట‌ర్ ఎం. జితేంద‌ర్‌రెడ్డి