closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

తెలంగాణ‌, ఆంధ్రాల్లో నక్సల్స్‌ ఉద్యమ ప్రభావం

* ఉద్యమ పరిణామక్రమం
* తెలంగాణ, ఆంధ్రల్లో సాగిన తీరు
 • తెలంగాణ ఉద్యమ చరిత్రలోని కీలకఘట్టాల్లో నక్సలిజం ఒకటి. ఎక్కడో పశ్చిమ్ బంగలో మొదలైన ఈ ఉద్యమం తెలుగు ప్రాంతాలకు ఎలా పాకింది? అందుకు కారణాలేంటి? ఇందుకు దోహదం చేసిన పరిస్థితులేమిటి? నడిపించిన వ్యక్తులెవరు? తెలంగాణలో నెలకొన్న పరిస్థితులేమిటి? తదితర అంశాలపై రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు నెల్లుట్ల వేణుగోపాల్ రావు విశ్లేషణ 'ఈనాడు-ప్రతిభ'కు ప్రత్యేకం.
 • భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభం కావడానికి చాలా కారణాలున్నాయి. జాతీయ, అంతర్జాతీయ, స్థానికాంశాలు కలసి 1967లో అనివార్యమైన పరిస్థితుల మధ్య నక్సల్‌బరి అనే ప్రాంతంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి కేవలం 1967ని చూస్తే సరిపోదు. కొంచెం ముందుకు వెళ్లాలి. 1940ల నుంచి మన దేశంలో సంభవించిన పరిణామాలను పరిశీలించాలి.
 • 1946-51 మధ్య సాగిన తెలంగాణ రైతుల సాయుధ పోరాటాన్ని 1951లో విరమించారు. అప్పుడే అది సమంజసమా కాదా అనే చర్చ జరిగింది. దీనిపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉంది. రష్యాలో కార్మికులు ఒక్కరోజు సమ్మెతో జార్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా విప్లవాలు అలాగే వస్తాయనే భావన ఉండేది. అయితే చైనాలో మావో - రష్యాలోలాగా ముందు పట్టణీకరణ తర్వాత పారిశ్రామీకరణ జరిగి, కార్మికవర్గం ఏర్పడిన చోట అలాంటి విప్లవం సాధ్యమేమోగానీ, రైతులు, వ్యవసాయం ఉన్న దేశాల్లో అది సాధ్యం కాదు - అని స్పష్టం చేశారు. వ్యవసాయ దేశాల్లో దీర్ఘకాలిక పోరాటం ద్వారా రైతుల్లో చైతన్యం తెచ్చే విప్లవం తీసుకురావాలన్నారు. రైతులు ప్రధాన శక్తిగా ఉండే ఉద్యమం జరగాలని సూత్రీకరించారు. తదనుగుణంగా 1936 తర్వాత చైనా వ్యాప్తంగా లాంగ్‌మార్చ్ చేసి మావో విజయం సాధించారు. అలా తాను ఆచరించి విజయం సాధించిన తర్వాతే కొత్త ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
 • స్టాలిన్ చెప్పాడని..!

 • ఆంధ్రా కమ్యూనిస్టులు 1948లో చైనా పరిస్థితులను గుర్తించారు. తెలంగాణలోని అనుభవాలు, పరిస్థితులకు రష్యా మార్గం కంటే చైనా బాట అనుకూలమని భావించారు. ఆవిధంగానే పత్రం ప్రవేశపెట్టారు. అప్పటి కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఇంతలో 1948లో హైదరాబాద్‌పై సైనికచర్య జరిగింది. ఈ నేపథ్యంలో భారత సమాఖ్య సైన్యంతో పోరాడాలా? వద్దా? అనేది కమ్యూనిస్టుల్లో తలెత్తిన మరో చర్చ. అప్పటికే ఊళ్లు వదిలి వెళ్లిపోయిన భూస్వాములు కాంగ్రెస్ పార్టీ, సైన్యం అండ చూసుకొని మళ్లీ వెనక్కి వచ్చేశారు. కాబట్టి కాంగ్రెస్‌కు, సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని కమ్యూనిస్టుల్లో ఒక వర్గం పేర్కొంది. 'మనది నిజాం వ్యతిరేక పోరాటమే తప్ప భారత వ్యతిరేక పోరాటం కాదు. అందుకే సాయుధ పోరాటాన్ని ఆపేయాల'ని మరో వర్గం వాదించింది. మొత్తానికి మరో మూడేళ్లపాటు పోరాటం కొనసాగింది. ఈ క్రమంలో విపరీతమైన నిర్బంధాన్ని చవిచూడాల్సి వచ్చింది. అప్పటిదాకా జమీందార్లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఊళ్లలోని పెద్దరైతులు కూడా కలసి వచ్చేవారు. కానీ 1948 తర్వాత వారికి కూడా కొంత మేలు జరగటంతో ఉద్యమం నుంచి విరమించుకున్నారు. చివరకు ఉద్యమంలో భూమిలేని పేదరైతు కూలీలు, చిన్నరైతులు మాత్రమే మిగిలారు.. మరోవైపు ఉద్యమ నాయకత్వంలో భిన్నాభిప్రాయాలు.. ఇంకోవైపు ప్రభుత్వం నుంచి విపరీతమైన నిర్బంధ పరిస్థితులు.. ఈ మూడు కారణాలతో పోరాటం చల్లారింది. అప్పటికే 10 లక్షల ఎకరాల భూమిని పంచారు. చాలాచోట్ల భూస్వాములను తరిమి గ్రామరాజ్యాలు స్థాపించుకున్నారు. ఈ విజయాలను కాపాడుకోవడానికి గెరిల్లా దళాలను నిర్వహించాలని పోరాట యోధులు అడవుల బాట పట్టారు. కానీ పోరాటాన్ని కొనసాగిస్తామనే నమ్మకం వారిలో పోయింది. ఫలితంగా సలహా కోసం రష్యా వైపు చూశారు. అప్పటికి చైనాతో అంతగా సంబంధాల్లేవు. ఇక్కడి నుంచి ఒక ప్రతినిధి బృందం రష్యా వెళ్లి స్టాలిన్‌తో మాట్లాడింది. వాళ్లు వచ్చి చెప్పిందొకటి.. 30 ఏళ్ల అనంతరం సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అక్కడి పత్రాల్లో బయటపడింది ఇంకొకటి.. 'మీరు పోరాటం కొనసాగించాలో లేదో మేం చెప్పలేం. మీకక్కడ వీలుంటే పోరాడండి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి' అని స్టాలిన్ చెప్పినట్లు సమాచారం. కానీ ప్రతినిధి బృందం ఇక్కడికొచ్చి 'స్టాలిన్ ఆపేయమన్నాడు.. కాబట్టి ఆపేస్తున్నాం' అంటూ సాయుధ పోరాటాన్ని నిలిపేశారు. దీనికి సంబంధించి పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డిల పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనపై తాము సంతకాలు చేయలేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేసి పెట్టారని దేవులపల్లి, భీంరెడ్డిలు తర్వాత అనడం తరువాతి పరిణామం. మొత్తానికి 1951 అక్టోబరు 20న తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆపేశారు. ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తేయకుండానే ఇదంతా జరిగింది. (1946 నవంబరులో నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని 1948 మేలో ఎత్తివేశారు. 1948 సెప్టెంబరులో మళ్లీ యూనియన్ ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేసింది.) పోరాటం ఆపేసినా కార్యకర్తల్లో అసంతృప్తి అలాగే ఉంది. 'పోరాటం కొనసాగించాల్సింది. లేదంటే మరోమార్గం చూడాల్సింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా లొంగిపోవాల్సింది కాద'నే భావన కార్యకర్తల్లో వ్యక్తమైంది. ఆ క్రమంలో కొంతమంది మౌనంగా ఉండిపోయారు. కొంతమంది విలువలు కాపాడుకుంటూనే క్రియాశీలతకు దూరమయ్యారు. మరికొందరు తమతమ జీవితాల్లోకి వెళ్లిపోయారు. ఇదీ 1951నాటి పరిస్థితి. 1960ల వరకు ఈ స్తబ్దత ఇలాగే కొనసాగింది. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా సాయుధ పోరాటాన్ని వీడి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలోనే పయనించాలని నిర్ణయించుకుంది. ఈ దేశంలో సాయుధ పోరాటం కంటే ఎన్నికల్లో పాల్గొని, అధికారంలోకి రావడం ద్వారానే ప్రజల్లో మార్పు తేవాలని 1952లోనే తీర్మానం చేసింది.
 • ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి వాతావరణమే నెలకొంది. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అజెండా నుంచి వర్గపోరాటాన్ని తొలగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ దీన్ని వ్యతిరేకించింది. 1956 నుంచి 1964 దాకా దీనిపై చర్చ జరిగింది. కమ్యూనిస్టు సాహిత్యంలో దీన్ని గ్రేట్ డిబేట్ (మహా చర్చ)గా పిలుస్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా ఇందులో భాగస్వాములుగా మారి కొన్నాళ్లు రష్యా వైపు, మరికొన్నాళ్లు చైనా వైపు మొగ్గు చూపారు.
 • మహా విభజన

 • అప్పటికే 'భారత్‌లో వర్గపోరాటం అవసరం లేదు.. ఎన్నికల ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చ'ని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. ఈ వాదనతో అసంతృప్తితో ఉన్నవారూ ఉన్నారు. వీరంతా మహాచర్చతో స్ఫూర్తి పొంది చీలిక దిశగా అడుగులు వేశారు. దీనికి 1962 చైనా-భారత్ యుద్ధం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోషలిస్టు దేశమైన చైనా, భారత్‌పై దాడిచేయడం తప్పని చాలామంది కమ్యూనిస్టులు వాదించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ సరిహద్దు వివాదం తెచ్చారు. ఆ సరిహద్దుల్ని తేల్చుకోకుండా అనవసరంగా ఇద్దరూ (భారత్, చైనా) యుద్ధానికి దిగారని కమ్యూనిస్టుల్లోనే కొంతమంది వాదించారు. అలా చైనా యుద్ధ సమయంలో ప్రభుత్వాన్ని సమర్థించని కమ్యూనిస్టులు - సుందరయ్య, నంబూద్రీపాద్, రణదివే తదితరులను అరెస్టు చేశారు. ఇది కమ్యూనిస్టుల్లో చీలికకు దారి తీసి.. 1964 మేలో సీపీఐ నుంచి చీలి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ఏర్పడింది.

 • బంగలో మొదలు..

 • 1960ల ప్రారంభం నాటికి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. 1967 ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లో మిశ్రమ మంత్రివర్గాలు.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో ఒకటి పశ్చిమ్ బంగలోని వామపక్ష ప్రభుత్వం. కాంగ్రెస్ నుంచి చీలిపోయి బంగ్లా కాంగ్రెస్ స్థాపించిన అజయ్ ముఖర్జీ తనకు ముఖ్యమంత్రి పదవినిస్తే కలసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అందుకు సీపీఐ, సీపీఎంలతో పాటు ఫ్వార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలు అంగీకరించాయి. వీరంతా కలసి అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. అందులో జ్యోతిబసు హోంమంత్రి, హరేకృష్ణ కోనార్ వ్యవసాయ శాఖ మంత్రి. ఈ హరేకృష్ణ కోనార్ అంతకుముందు ఎన్నికల సభల్లో తాము అధికారంలోకి వస్తే రైతు కూలీలంతా భూస్వాముల భూముల్ని (గరిష్ఠ భూపరిమితి చట్టం పరిధికి మించినవి) స్వాధీనం చేసుకోవచ్చని ప్రకటించారు. ఆయన ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అజయ్ ముఖర్జీ ప్రభుత్వం ఏర్పడగానే రైతులు ఆ పని చేయడం మొదలెట్టారు. పశ్చిమ్ బంగలోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి తాలూకాలోని నక్సల్‌బరి గ్రామంలోని రైతులు భూస్వాముల భూములను ఆక్రమించి, అందులోని పంటను కోసుకున్నారు. మార్చి నుంచి మే దాకా తీవ్ర సంఘర్షణ వాతావరణం నెలకొంది. ఫాంసిదేవా, నక్సల్‌బరి, ఖరీబరీ గ్రామాల్లో ఘర్షణ తీవ్రతరమైంది. మేలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు చనిపోయారు. దీంతో ప్రజలు కూడా ఆయుధాలతో ప్రతిఘటించడం ప్రారంభించారు. అదే సమయానికి సీపీఎం నేత చారుమజుందార్.. విప్లవానికి ఒక వేదిక కావాలంటూ సిద్ధాంతీకరిస్తున్నారు. అలా సిద్ధాంతానికి క్షేత్రం సిద్ధమైంది. దేశమంతటా నక్సల్‌బరి సంఘీభావ కమిటీలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు మెడికల్ కాలేజీ అందుకు వేదికైంది. సీపీఎం, సీపీఐలలో ఉన్న ప్రగతి శీల శక్తులు కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో 1967లో కోల్‌కతాలో ఆలిండియా కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రివల్యూషనరీస్ (ఏఐసీసీఆర్) ఏర్పాటు చేశాయి. తర్వాత వచ్చిన సీపీఐ (ఎంఎల్), పీపుల్స్‌వార్, మావోయిస్టులకు ఇదే మొదటి రూపం. ఈ ఏఐసీసీఆర్‌లో 14 రాష్ట్రాల వారు వచ్చి చేరారు. దీంతో మరింత సమన్వయం కోసం ఏఐసీసీసీఆర్ (ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రివల్యూషనరీస్)గా పేరును సవరించారు. చారుమజుందార్ దీనికి నేత. నక్సల్‌బరిలో ఉద్యమాన్ని నడిపిన కానూ సన్యాల్, జంగల్ సంతాల్ (ఆదివాసీ)లు ఆ సమయంలో ఇతర ప్రధాన నేతలు. అప్పటికి చారుమజుందార్ సీపీఎంలోనే ఉన్నారు. డార్జిలింగ్ జిల్లా కార్యదర్శి. ఆయన వర్గ పోరాటానికో పార్టీ .. విప్లవానికి కొత్త పార్టీ కావాలనే చర్చ మొదలు పెట్టారు.
 • అంతకుముందే ఉత్తరాంధ్రలో..

 • అప్పటికి 10-12 ఏళ్లుగా శ్రీకాకుళంలో ఉద్యమం నడుస్తోంది. 1958లోనే అక్కడ గిరిజన (రైతుకూలీ) సంఘం ఏర్పడింది. మేడిద రాములు అనే అధ్యాపకుడు దాన్ని ప్రారంభించారు. ఆయన ఎక్కువకాలం నడపలేకపోయారు. దీంతో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు ఉపాధ్యాయులు ఉద్యమాన్ని అందుకొని.. గిరిజనుల పక్షాన నిలిచారు. ఉప్పు, చింతపండులిచ్చి గిరిజనేతరులు, గిరిజనులను దోపిడీ చేయడాన్ని, భూములను ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ వారిలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీలను గుర్తించి, గిరిజన భూములు, సంపద అన్యాక్రాంతం కాకుండా కొన్ని రక్షణలు కల్పించారు. 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగిస్తూ చట్టం తెచ్చింది. అయినా గిరిజనులను దోచుకోవడం, వారి భూముల ఆక్రమణ మాత్రం ఆగలేదు. దీనిపై వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం గిరిజనులను సమీకరించి ఏటా సభలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ క్రమంలో 1967 అక్టోబరు 31న మొండెంఖల్ (పార్వతీపురం సమీపంలో) అనే గ్రామంలో సభ నిర్వహించారు. సభకు వెళుతున్న ఊరేగింపు మీద భూస్వాములు దాడి చేశారు. ఇద్దరు గిరిజనులు చనిపోయారు. దీంతో గిరిజనుల నుంచి ప్రతిఘటన మొదలైంది. అలా 1967 మేలో నక్సల్‌బరిలో జరిగినట్లే ఇక్కడా జరిగింది. రెంటికీ సంబంధం లేదు. కానీ నక్సల్‌బరి సంఘీభావ కమిటీ రెంటి మధ్య సారూపత్యను చూసింది. అప్పుడు నక్సల్‌బరి సంఘీభావ కమిటీకి చాగంటి భాస్కర్‌రావు సారథి (ఇప్పటి ప్రకాశం జిల్లా పరుచూరు గ్రామవాసి, గుంటూరు మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నారప్పుడు). ఆయనతో పాటు పంచాది కృష్ణమూర్తి (ఆంధ్రవర్సిటీ గోల్డ్‌మెడలిస్టు, ఆదివాసీ, శ్రీకాకుళం జిల్లావాసి) నక్సల్‌బరి సంఘీభావ కమిటీలో సాయుధ పోరాటానికి సమయం ఆసన్నమైందన్నారు. వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, వసంతాడ రామలింగాచారి, పైలా వాసుదేవరావు, మామిడి అప్పలసూరి లాంటివారు ఈ ఉద్యమ నాయకులు. కానీ శ్రీకాకుళం కమిటీ దీన్ని వ్యతిరేకించింది. ఇంకా సాయుధ పోరాటానికి సమయం రాలేదనీ.. విన్నపాలు చేద్దామని కమిటీ సూచించింది. రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. మరోవైపు 1951లో పార్టీ చెప్పినట్లు విని.. పార్లమెంటరీ పంథాలోకి వెళ్లినా అంతర్గతంగా అసంతృప్తితో రగులుతున్న చండ్ర పుల్లారెడ్డి, డీవీ, తరిమెళ్ల నాగిరెడ్డి, పోట్ల రామనర్సయ్యలు కూడా ఈ ఏఐసీసీసీఆర్‌లో చేరారు. 1968 నవంబరులో కొల్లా వెంకయ్య, నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు సహా ఆరుగురిని సీపీఎం బహిష్కరించింది. కానీ ఏఐసీసీసీఆర్‌లోనూ విప్లవపార్టీ స్థాపన, సాయుధ పోరాటంపై విభేదాలు వచ్చాయి. నాగిరెడ్డి, దేవులపల్లి తదితరులంతా ఇంకా సమయం రాలేదని.. మరింత సమన్వయం చేయాలంటే - విప్లవపార్టీ పెట్టడానికి సమయం వచ్చేసిందని వెంపటాపు సత్యం, చాగంటి భాస్కర్, పంచాది కృష్ణమూర్తిల సారథ్యంలోని శ్రీకాకుళం నాయకత్వం భావించింది. దీంతో చండ్ర పుల్లారెడ్డి, నాగిరెడ్డి, దేవులపల్లి తదితరులు బయటకు వచ్చేశారు.
 • విప్లవ అంకురార్పణ

 • 1969 ఫిబ్రవరిలో చారు మజుందార్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆంధ్రాకు వచ్చారు. ఆయన ఆస్తమాతో బాధపడుతూనే పర్యటించారు. గుంటూరు నల్గొండల మధ్య గుత్తికొండబిలంలో రహస్య సమావేశం నిర్వహించారు. పిడుగురాళ్ల నుంచి నాగార్జునసాగర్ వెళ్లే దారిలో ఉందీ గుత్తికొండబిలం. నిజానికిదో శివాలయం. పెళ్లి బృందం పేరుతో 30 మంది వెళ్లి రెండ్రోజుల పాటు సమావేశమయ్యారు. ఈ రహస్య భేటీకి తెలంగాణ నుంచి కొండపల్లి సీతారామయ్య కొడుకు చంద్రశేఖర్ (ఆర్ఈసీ విద్యార్థి), కేజీ సత్యమూర్తి (ఉపాధ్యాయుడు), చెక్కిళ్ళ ఐలయ్య (తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నవారు) హాజరయ్యారు. సీతారామయ్య అప్పటికి ఇంకా వరంగల్‌లో ఉపాధ్యాయుడిగా ఉన్నారు. 1964-65లో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే ఉద్యమం నడిచింది. వరంగల్, హైదరాబాద్‌లలోనూ ఉద్యమాలు జరిగాయి. అప్పటికింకా తెలంగాణ ఉద్యమం అంతగా లేదు కాబట్టి.. ఆంధ్రకు ఉక్కు కర్మాగారం కావాలనే డిమాండ్ ఇక్కడ కూడా బలంగానే వినిపించింది. ఈ విశాఖ ఉక్కు ఉద్యమం వరంగల్‌లో ఎక్కువగా జరిగింది. విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. వారందరి వెనకాల స్ఫూర్తి కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిలే! గుత్తికొండబిలం సమావేశంలో కొండపల్లి సీతారామయ్య పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన ఉండాల్సిందేనని అంతా తీర్మానించారు. అలా ఆయన గైర్హాజరీలోనే సీతారామయ్య పేరును రాష్ట్రకమిటీలో చేర్చారు. ఇదంతా చారుమజుందార్ సమక్షంలో జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా ప్రయత్నాలన్నీ జరిగాక, 1969 ఏప్రిల్ 22న (లెనిన్ పుట్టిన రోజు, ఆ సంవత్సరం లెనిన్ శతజయంతి కూడా) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఐ-ఎంఎల్) విప్లవ పార్టీ ఏర్పడింది. మే 1న కోల్‌కతా ఆజాద్‌మైదానంలో సభ ఏర్పాటు చేసి, కానూ సన్యాల్ పార్టీని ప్రకటించారు. అంతకుముందే ఆరంభమైనా పార్టీ రూపంలో నక్సలైట్ ఉద్యమానికి ఇలా ఒక అంకురార్పణ జరిగింది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీపీఐఎంఎల్ తొలి కమిటీ కార్యదర్శి పంచాది కృష్ణమూర్తి. కొండపల్లి సీతారామయ్య సభ్యుడు మాత్రమే. 1968 నాటికే సీతారామయ్య, కేజీ సత్యమూర్తి ఉద్యోగాలు వదిలేసి ఉద్యమంలోకి వచ్చేశారు.
 • మజుందార్ సూత్రీకరణలు

 • పార్టీకి కొన్ని అతివాద సూత్రీకరణలు చారుమజుందార్ నుంచే వచ్చాయి..'బహిరంగంగా ప్రజాసంఘాలుపెట్టి పనిచేయకూడదు. ప్రజలు ఏమాత్రం ఇష్టపడని వర్గశత్రువును లేకుండా చేయాలి. ఇదంతా సాయుధపోరాటం ద్వారానే సాగాలి'. 1967 నుంచే ఆయన ఇవి చెబుతున్నప్పటికీ 1970కల్లా ఈ పద్ధతి సరైంది కాదనే చర్చ పార్టీలో మొదలైంది.
 • మే 1న కోల్‌కతాలో పార్టీ ప్రకటన అనంతరం మే 27న తిరిగి వస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పంచాది కృష్ణమూర్తి సహా ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకత్వ ప్రతినిధులు మరణించారు. ఏపీలో అది తొలి ఎన్‌కౌంటర్. దాంతో ప్రతీకారేచ్ఛ మొదలైంది. అలా 1969-70 మధ్య పెద్దఎత్తున భూస్వాములు, వడ్డీవ్యాపారులపై దాడులు జరిగాయి. దాదాపు ఏడాదిన్నరపాటు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. వేలమందిని అరెస్టు చేసి నిర్బంధించారు. 1971 నాటికి ఉద్యమాన్ని అణిచివేశారు. దాదాపు నాయకత్వాన్ని లేకుండా చేశారు. 1972లో చారుమజుందార్ కోల్‌కతాలో దొరికారు. ఏడు రోజుల తర్వాత ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన ఎలా చనిపోయారన్నది తేలలేదు.
 • సీతారామయ్యే చుక్కాని....

 • మజుందార్ చనిపోవడానికి ఆరేడునెలల ముందు నుంచే ఆయన సూత్రీకరణలపై చర్చ మొదలైంది. అవి సరైనవి కావంటూ సత్యనారాయణ్‌సింగ్ (బిహార్) చీలిపోయారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలో నాయకత్వం పూర్తిగా లేకుండా పోయింది. ఏం చేద్దామని పునరాలోచిస్తున్న దశలో తెలంగాణ కనిపించింది. కొండపల్లి సీతారామయ్య సారథ్యం కనిపించింది. 1970 నాటికే కొండపల్లి సీతారామయ్య, చారుమజుందార్ అతివాద సూత్రాలకు ప్రత్యామ్నాయ పద్ధతులను చర్చకు పెట్టారు. ముఖ్యంగా ప్రజాసంఘాలనూ విప్లవపంథాలో నడిపిస్తామని, అందుకు ప్రయోగం చేసి చూస్తామని చారుమజుందార్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రైతు కూలీలు, కార్మిక సంఘాల్లో కాకుండా రచయితలు, బుద్ధిజీవుల్లో సంఘాలు పెట్టాలనే ఆలోచన చేశారు. 1970 జులై 3 అర్థరాత్రి 1.08 గంటలకు (జులై 4) విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. విరసం ఏర్పాటు నాటికే శ్రీకాకుళం ఉద్యమం దాదాపు పూర్తి కనుమరుగైనా.. వర్గశత్రు నిర్మూలన, సాయుధపోరాటం ఒక్కటే మార్గం కావని.. వివిధ మార్గాల్లో ప్రయత్నించాలని కొండపల్లి భావించారు. 1972లో జన నాట్యమండలి ఏర్పాటైంది. ఇలా తొలుత బుద్ధిజీవుల సంఘం, సాంస్కృతిక సంఘం వచ్చింది. ఇది మాత్రమే కాదు.. ఏ ప్రజా సమూహంలోనైనా ఆ ప్రజా సమూహానికి చెందిన సంఘం ఉండాలని కొండపల్లి భావించారు. తదనుగుణంగా ప్రజాసంఘాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థి సంఘం పెట్టాలని భావించారు. అప్పటికే నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి వంటివారు సాయుధ పోరాటం కాకుండా ఉద్యమం చేయాలని భావిస్తున్నారు. వారు 1974 నవంబరులో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (పీడీఎస్‌యూ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీని మేనిఫెస్టోలో దేశంలోని సాయుధ పోరాటాలను సమర్థించడం లాంటి కొన్ని సైద్ధాంతిక అంశాలపై విభేదాలు వచ్చి కొంతమంది విద్యార్థులు రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్‌యూ)గా ఏర్పడ్డారు. తెలంగాణలో 1975-85 మధ్య విప్లవోద్యమాన్ని చాలా బలోపేతం చేసి, ప్రజాసంఘాలతో ప్రాంతాలవారీగా, ప్రణాళిక బద్ధంగా కదిలారు సీతారామయ్య. ప్రజాసంఘాలు ప్రజలను సమీకరించడానికి, పోరాట చైతన్యాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయన్నది ఆయన ఆలోచన.
 • తెలంగాణకు మద్దతు..

 • 1952లో ప్రత్యేక తెలంగాణ అనే డిమాండ్ రాగానే దాన్ని కమ్యూనిస్టులు భూస్వామ్య డిమాండ్ అన్నారు. కారణం కొండా వెంకట రంగారెడ్డి తదితరులు ఆ డిమాండ్ చేయడమే. 1969 ఉద్యమం అంతిమంగా అణిచివేతకు గురైన తీరు, రాజకీయ నాయకత్వం మోసపూరిత ధోరణి చూసి యువతరం నిరాశానిస్పృహల్లో పడింది. అదే సమయంలో నక్సల్‌బరి ఉద్యమం వచ్చింది. 1969 ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య సంపూర్ణంగా సమర్థించారు. డీవీ, పుల్లారెడ్డి, నాగిరెడ్డిలతో దీనిపై వాదనకు కూడా దిగారు. 'ప్రత్యేక తెలంగాణ భూస్వామ్య డిమాండ్.. బూర్జువా డిమాండ్.. కాబట్టి మనం దూరంగా ఉండాల'న్న వారందరితో సీతారామయ్య విభేదించారు. 'ప్రత్యేక తెలంగాణ అనేది ప్రజల డిమాండ్.. సారథిగా ఎవరున్నా మనం డిమాండ్‌ను సమర్థించాలి. కావాలంటే ఆ నాయకత్వాన్ని మార్చి.. ప్రజలను మళ్లించాలి. అంతేతప్ప డిమాండ్‌కు దూరంగా ఉండి నాయకత్వాన్ని నిందించుకుంటూ ఉండకూడదు. నాయకత్వం ద్రోహం చేసే అవకాశం ఉందని ప్రజలను చైతన్యవంతం చేయడానికైనా మనం ఉద్యమంలో ఉండాల'ని కొండపల్లి తెలంగాణ డిమాండ్‌ను సమర్థించారు. ఆ సమయంలో ఉద్యమ నేతల ద్రోహంతో నిరాశలో ఉన్న యువతరాన్ని కొండపల్లి వాదన ఆకర్షించింది. నక్సలిజం దేశంలో భూమిప్రశ్నను లేవనెత్తింది. తెలంగాణలో ఇది అంటుకోవడానికి ప్రధాన కారణం ఈ భూమే! దున్నేవాడికి భూమి అవసరం. ఇక్కడేమో చాలా అనుపస్థిత భూమి ఉంది. కొంతమంది భూస్వాములకైతే ఏఊళ్లో ఎంత భూమి ఉందో కూడా తెలియని పరిస్థితి. అందుకే సాయుధ పోరాటంతో ముగిసిందనుకున్నా.. తెలంగాణలో అది ఆరకుండా మళ్లీ తెరపైకి వచ్చింది.
 • Posted on 05-12-2015