closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

610.. అటకెక్కింది!

* 20 ఏళ్లు కాలగర్భంలోనే..
* దుమ్ము దులిపిన 'గిర్‌గ్లానీ'
* ప్రభుత్వాల నిర్లక్ష్యం
 • తాళం వేసితిమి.. గొళ్లెం మరిచితిమి.. అన్న చందంగా ఉల్లంఘనలు సరిచేస్తున్నామంటూ జీవో ఇచ్చారు గానీ అమలు చేయలేదు. అదే తెలంగాణ ఉద్యమంలో పదేపదే మారుమోగిన 610 జీవో. పదేళ్లపాటు అమలుకు నోచుకోకుండా అటకెక్కింది. నీరుగారి నిద్రాణస్థితిలోకి వెళ్లిన తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ తట్టిలేపిన అత్యంత కీలకమైన ఈ జీవో పూర్వాపరాలు.. అమలుపై ఏర్పాటైన గిర్‌గ్లానీ కమిషన్ నివేదిక.. తదితర అంశాలపై తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ కోర్‌గ్రూప్ కన్వీనర్ ఆచార్య కోదండరాం విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.
 • తెలంగాణకు సంబంధించి స్థానిక రిజర్వేషన్లలో భాగంగా చర్చలో బాగా నలిగిన అంశం 610 జీవో. అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం 1985 డిసెంబరు 30న ఈ జీవోను జారీ చేసింది. దీని వెనక కొంత చరిత్ర ఉంది. పెద్దమనుషుల ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ, ముల్కీ నిబంధనల్లాంటివన్నీ రద్దయి.. ఆరు సూత్రాల పథకం ఆధారంగా 1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా స్థానిక రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక అస్థిత్వాన్ని పూర్తిగా తొలగించిన ఉత్తర్వులివి. విశేషమేమంటే.. చివరకు ఆ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి ఉద్యోగాల్లో తెలంగాణకు మిగిలిన వెసులుబాటును కూడా దెబ్బతీయడం ఆరంభమైంది. దీన్ని తెలంగాణ ఎన్జీవోలు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా చాలామంది స్థానికేతరులు తెలంగాణ ప్రాంతంలో నియమితులయ్యారనీ; రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో కూడా స్థానిక రిజర్వేషన్లు వర్తింపజేయాలని టీఎన్జీవోలు కోరారు. టీఎన్జీవోలు వ్యక్తం చేసిన అంశాల్లోన్ని నిజానిజాలను పరిశీలించడానికి ఐఏఎస్ అధికారి జయభారత్ రెడ్డి సారథ్యంలో కమిటీని నియమించారు. ఇందులో ఉమాపతి, కమలనాథన్ (ప్రస్తుతం ఉద్యోగ విభజన కమిటీ సారథి) మిగిలిన సభ్యులు. 59వేల మంది స్థానికేతరులు తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా నియమితులయ్యారని ఈ కమిటీ తేల్చిచెప్పింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 610 జీవో జారీ చేసింది.
  మరుగున పడిన జీవో
 • అత్యంత కీలకమైన 610 జీవో అమలు అటకెక్కింది. రాయలసీమ ప్రాంతంలో కూడా (తెలుగుగంగ లాంటి ప్రాజెక్టుల్లో స్థానికేతరులు పనిచేస్తున్నారనే ఆరోపణలు) ఇలాంటి స్థానికేతర సమస్యే వస్తే వారికీ ఇలాంటి జీవో ఒకటి జారీ చేశారు. అక్కడ మాత్రం స్థానికేతరులను పంపించి వేస్తూ ఆ జీవోను అమలు చేశారు. తెలంగాణకొచ్చేసరికి మాత్రం 610 జీవోను అమలు చేయలేదు. చాలాకాలం పాటు దీని ఉనికి కూడా మరచిపోయారు. 1989 తర్వాత తెలంగాణకు సంబంధించిన చర్చ మొదలై.. 1996లో ఊపందుకున్న తర్వాత మళ్లీ 610 తెరపైకి వచ్చింది. ఉద్యమానికి ఇది ఊపిరిపోసింది. 610 గురించి మాట్లాడటం పెరిగి, అమలు చేయాలనే డిమాండ్ విస్తృతమైంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చర్చించడం; కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకోవడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఈ దశలో ప్రభుత్వం అనివార్యమైన పరిస్థితుల్లో 610 జీవో అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి, దాన్ని అమలు చేయడంలో జరిగిన అన్యాయాలను గుర్తించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి జేఎం గిర్‌గ్లానీ సారథ్యంలో ఏడాది గడువుతో ఏకసభ్య కమిషన్‌ను 2001, జూన్ 25న ఏర్పాటు చేసింది.
  610పై ఆచార్య జయశంకర్ పుస్తకం
 • ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్ నియమించిన కొద్ది రోజుల తర్వాత ఆచార్య జయశంకర్ 610 జీవోపై 2001 నవంబరులో ఓ పుస్తకం ప్రచురించారు. ప్రజాసంఘాల సారథ్యంలోని అప్పటి తెలంగాణ ఐక్యవేదిక దీన్ని అచ్చువేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ సభకు దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. దీని ప్రభావం ఉద్యమంపై చాలా పడింది. 610 జీవోపై మరుసటిరోజు అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 610 అమలుపై 2002 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఓ సభాసంఘాన్ని నియమించింది. అంటే అటు గిర్‌గ్లానీ కమిషన్, ఇటు సభాసంఘం.. రెండూ 610 జీవో అమలుపైనే ఏకకాలంలో పనిచేశాయి. సభాసంఘం కొన్ని విభాగాలపై దృష్టి సారించి అధ్యయనం చేసింది. మరోవైపు గిర్‌గ్లానీ కమిషన్ అక్టోబరు 6న ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగానే ఆయా ప్రభుత్వ శాఖలు సమాచారం ఇవ్వడం లేదంటూ గిర్‌గ్లానీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రత్యక్షంగా రాజు గారు దిగి వచ్చినా అడిగిన సమాచారం దొరికేలా లేదని' ఆయన వ్యాఖ్యానించారు. 'రాజ్యాంగ బద్ధమైన నియమాల అమలు పట్ల ఎంత చిత్తశుద్ధి ఉండాలో అంత లేదని' పేర్కొన్నారు. ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. అడిగిన సమాచారం రాకపోవడంతో అధ్యయనానికి మరింత సమయం కోరడంతో కమిషన్ కాలపరిమితిని ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కూడా మరోమారు గడువును పొడిగించారు. చివరకు 2004, సెప్టెంబరు 21న గిర్‌గ్లానీ నివేదికను సమర్పించారు. అప్పటికల్లా తెలుగుదేశం ప్రభుత్వం పోయి, వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను ప్రభుత్వం బహిరంగ పర్చలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 2005న ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాయి. ప్రభుత్వం గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను బయటపెట్టకుంటే తామే వెల్లడిస్తామని హెచ్చరించాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా గిర్‌గ్లానీ కమిషన్ తుది నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. దీంతో వారంరోజుల తర్వాత ప్రభుత్వం నివేదికను వెల్లడించింది. శాసనసభలో ప్రవేశపెట్టింది.
  18 రకాల ఉల్లంఘనలు
 • గిర్‌గ్లానీ నివేదిక చాలా కీలకమైంది. ఇందులో మూడు భాగాలున్నాయి. మొదటి భాగం.. ఉపోద్ఘాతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాధాన్యం, ఎందుకు ఉల్లంఘనలు జరిగాయో వివరించారు. రెండో భాగం.. ఉల్లంఘనలు ఎక్కడెక్కడ జరిగాయో చెప్పారు. మూడో భాగం.. బాగు చేయడానికి, అమలు చేయడానికి సూచనలు చేశారు.
  ఉల్లంఘనలు.. తప్పిదాలు
 • అవకతవకలపై నివేదిక సమర్పించిన గిర్‌గ్లానీ కమిషన్ 18 రకాల ఉల్లంఘనలు.. వాటిలో 126 ప్రత్యేక తప్పిదాలను గుర్తించింది. 35 నివారణ చర్యలను సూచించింది.
  * రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానిక నియామకాల నుంచి శాఖాధిపతులు, సచివాలయం, ప్రత్యేక కార్యాలయాలకు మినహాయింపులిచ్చారు. అంటే వీటిలో స్థానిక రిజర్వేషన్లు అమలు కావు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా అర్హులే. ఉత్తర్వుల సమయంలో ఓ 50 శాఖలు మాత్రమే ఉండేవి. కానీ వాటి సంఖ్యను తర్వాతికాలంలో విపరీతంగా పెంచారు. శాఖాధిపతి కార్యాలయం నిర్వచనం ఎక్కడా లేకపోవడంతో వీటి సంఖ్యను పెంచి, స్థానిక రిజర్వేషన్ల నుంచి మినహాయింపునిస్తూ వెళ్లారు. అంతేకాకుండా శాఖలను విడగొట్టి ఉపశాఖలను ఏర్పాటు చేశారు. వాటికి కొత్తగా శాఖాధిపతులను నియమించారు. ఉదారహణకు వ్యవసాయశాఖ లోంచి ఉద్యాన శాఖను వేరు చేశారు. వైద్యశాఖలో, విద్యశాఖలో ఇలాగే చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేకపోయినా న్యాయశాఖను మొత్తంగా స్థానిక రిర్వేషన్ల నుంచి మినహాయించారు. దీంతో జిల్లాస్థాయి కోర్టుల్లోని ఉద్యోగాలకు కూడా స్థానిక రిజర్వేషన్లు లేకుండా పోయాయి. ఏ శాఖలోనైనా శాఖాధిపతి ఒకరే ఉండాలి గానీ నలుగురు ఉండరు. అవసరమైతే రాష్ట్రపతి నుంచి అనుమతి తెచ్చుకొని ఆయా శాఖాధిపతులను పెంచుకోవాలి. అలా చేయకపోవడం రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే.
  * కీలకమైన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఉల్లంఘన మరోటి. మినహాయింపుల్లేని పోస్టులు కూడా భర్తీ చేశారు. ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసిన ఇంజినీర్లను, ప్రాజెక్టు తర్వాత వేరేచోట స్థానిక రిజర్వేషన్ల స్థానాల్లో నింపారు. ఇలా లోకల్ క్యాడర్‌కు దక్కాల్సిన పోస్టుల్లో అన్యాయం జరిగింది. తర్వాత డిప్యుటేషన్ల పేరుతో సిబ్బందిని ఒక జోన్ నుంచి మరో జోన్‌కు, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు తీసుకొని రావడం.. ఇంకో ఉల్లంఘన. అలాగే స్పెషల్ డ్యూటీలపై తీసుకురావడం.
  * స్థానిక రిజర్వేషన్లను పాటించకుండా తాత్కాలిక పద్ధతిలో నియామకాలు చేసుకొని, తర్వాత వారిని క్రమంగా క్రమబద్ధీకరించడం.
  * చాలా పోస్టుల స్థాయిని మార్చడం. పలు నాన్‌గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్‌గా మార్చారు. జోనల్ గెజిటెడ్ పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా మార్చారు. తద్వారా వాటికి స్థానిక రిజర్వేషన్ల కోటా తగ్గడమో, పూర్తిగా లేకుండా పోవడమో జరిగింది.
  * హైదరాబాద్‌కు సంబంధించిన హోదాను గుర్తించలేదు. వేరే జోన్‌గా చూడటం, ఫ్రీజోన్‌గా పరిగణించడం చేశారు.
  * ఉపాధికల్పన కేంద్రాల్లో బోగస్ నమోదులు, తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా నియామితులైన వారున్నారు.
  * కారుణ్య నియామకాల్లో స్థానిక రిజర్వేషన్లను పాటించలేదు.
  సూచనలు
  * తప్పులను సరిచేయడానికి చర్యలు చేపట్టాలి.
  * రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడానికి ఓ యంత్రాంగం అవసరం. ఇది లేకపోవడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి.
  * అవసరమైతే ఓ సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలి. క్యాబినెట్‌లోనూ మంత్రుల సమూహాన్ని ఏర్పాటు చేసి దీని అమలును పర్యవేక్షించేలా చూడాలి.
  * సచివాలయంలోని సాధారణ పరిపాలనశాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులపై, 610 జీవో అమలుపై ఓ శిక్షణా విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సుశిక్షితులైన అధికారులను అక్కడుంచాలి.
  * బాధ్యతలను కచ్చితంగా నిర్వహించి, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
  * ఎన్ని శాఖాధిపతి కార్యాలయాలుండాలో రాష్ట్రపతి అనుమతి తీసుకొని, మిగిలిన వాటికి స్థానిక రిజర్వేషన్లను వర్తింపజేయాలి.
  * ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్‌లో తన స్థానికతను విధిగా పేర్కొనాలి.
 • ఇంత చెప్పిన తర్వాత కూడా గిర్‌గ్లానీ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చురుగ్గా కదల్లేదు. దీని సూచనల అమలు కూడా నత్తనడకే. 2004లో నివేదిక వస్తే 2006 దాకా దీని అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ సంఘాలు, తెలంగాణ వాదులు డిమాండ్‌లు చేసిన మీదట.. తొలుత దీన్ని పరిశీలించేందుకు 2004 అక్టోబరు 12న మంత్రుల బృందాన్ని నియమించారు. వీరికి సాయం చేయడానికి అధికారుల బృందాన్ని వేశారు. మొత్తం నివేదిక సారాంశాన్ని మంత్రుల బృందానికి తెలియజేయడం ఈ అధికారుల బృందం పని. 2006 మార్చిలో నివేదిక ఇవ్వగా దీని అమలుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై నిరసనలు రావడంతో ఆ జీవో అమలును ఆపేశారు. ఆ తర్వాత గిర్‌గ్లానీ నివేదిక అమలుపై మళ్లీ ఓ అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. గిర్‌గ్లానీ నివేదిక అమలును పర్యవేక్షించడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో సభాసంఘాన్ని వేశారు. ఇంతలో రెండో అధికారుల కమిటీ 2006 ఆగస్టులో తన నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 548 జీవోను జారీ చేసింది. 2006 అక్టోబరు 4న విడుదలైందది. 610 జీవోను సంపూర్ణంగా అమలు చేస్తామన్నది 548 జీవో సారాంశం. అలా అప్పటి నుంచి కొద్దికొద్దిగా గిర్‌గ్లానీ నివేదిక అమలు చర్యలు ఆరంభమయ్యాయి.
  * 150 దాకా ఉన్న శాఖాధిపతి కార్యాలయాలను 102కు కుదించాలని నిర్ణయించారు.
  * సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోనూ అన్ని ప్రాంతాల వారికీ సమానావకాశాలు కల్పించాలని నిర్ణయించారు.
  * శాఖాధిపతులకు, ఆ శాఖలకు మంజూరైన పోస్టులకు క్యాడర్‌ను తొలిసారిగా నిర్ధారించారు.
  * కారుణ్య నియామకాల్లోనూ స్థానికతను అనుసరించాలని నిర్ణయించారు.
  * తాత్కాలిక, పొరుగుసేవల ద్వారా చేసే నియామకాల్లోనూ స్థానిక రిజర్వేషన్లు..
  * కిందిస్థాయి న్యాయవిభాగంలోనూ స్థానిక రిజర్వేషన్ల అమలు.
  నత్తకు నడకలు నేర్పి....
 • మొత్తానికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేసే, 610 జీవోను అమలుచేసే కార్యక్రమానికి అడుగులు పడ్డాయి. అంటే జీవో (610) జారీ అయిన 20 సంవత్సరాలకుగానీ అమలు దిశగా ముందుకు కదలలేదు. అప్పటిదాకా దాని ఆలోచన కూడా ఎవరికీ లేకుండా పోయింది. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఒక్క జీవో అమలు కోసం ఇన్ని కమిటీలు, ఇన్ని చర్చలు, ఇంత కాలయాపన జరిగి ఉండదు.
 • రాష్ట్ర భవితవ్యంతో, ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన విషయంలో ఇంత ఉదాసీనత ప్రదర్శించారు. తెలంగాణ ఆందోళన ఎందుకొచ్చిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. స్థానిక రిజర్వేషన్ల పట్ల ఉద్యమాలు జరిగినప్పుడు తప్పించి మరే సమయంలోనూ వాటిని గౌరవించలేదు, పట్టించుకోలేదు. ఇంతటి సుదీర్ఘమైన చర్చ మొదలయ్యాక (1996) కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆరంభించడానికి మరో పది సంవత్సరాల సమయం పట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోనీ పదేళ్ల తర్వాతైనా ఆశించిన స్థాయిలో అమలు జరిగిందా అంటే అదీ లేదు. కొన్ని కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యుత్తుబోర్డు, సింగరేణి వంటి వాటిలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడం మొదలైంది. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల వాటా పెరగడం ఆరంభమైంది. 'రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నియమితులైన స్థానికేతరులను 18 వేల మందిని గుర్తించాం.. వారిని వెనక్కి పంపడానికి చర్యలు తీసుకుంటున్నామని' రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీకి నివేదించింది. ఇందులో కూడా తెలంగాణలో ఒక జిల్లా వారిని మరో జిల్లాకు పంపడానికి ప్రాధాన్యమిచ్చారే తప్ప ఆంధ్ర ప్రాంతీయులను పెద్దగా ముట్టుకోలేదు. తద్వారా 610 జీవో అమలు చేస్తే తెలంగాణ వారికే నష్టమనే భావన కల్పించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. 610 జీవో అమలును ఏ ఉద్దేశంతో అమలు చేయాలని తెలంగాణ సమాజం కోరుకుందో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరలేదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇంతటి ఉద్యమం జరిగితే తప్ప ఈ స్థానికులకు అవకాశాలు పెంచే ప్రయత్నం మొదలు కాలేదు.
  గిర్‌గ్లానీ కమిషన్ విచారణాంశాలు
  * 610 జీవోను అమలు చేయడంలో జరిగిన అన్యాయాలను గుర్తించి నివేదిక ఇవ్వడం; అసంగతాలను సరిదిద్దడం.
  * రాష్ట్రపతి ఉత్తర్వుల ఆచరణలో చోటుచేసుకున్న తప్పులు, దారితప్పిన సందర్భాల గురించి నివేదించడం.
  * తదుపరి రక్షణలను సూచించడం.
  610 జీవో ముఖ్యాంశాలు
  1. రాష్ట్రపతి నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన స్థానికేతరులను 1986 మార్చి 31లోపు వారి స్వస్థలాలకు పంపాలి. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి వారికి అక్కడ స్థానం కల్పించాలి.
  2. ప్రాజెక్టుల్లో నాన్‌గెజిటెడ్ క్యాడర్లలో పనిచేస్తున్న స్థానికేతర ఉద్యోగులందరినీ వెంటనే వెనక్కి పంపాలి.
  3. శాఖాధిపతులు, సచివాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో కూడా అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరగాలి. అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులను ఎంపిక చేసి, వారికి సమాన అవకాశాలు కల్పించాలి.
  4. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఎవరైనా ఉపాధికల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకుంటే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
  5. అక్రమ నియామకాలు, పదోన్నతులకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెట్టుకున్న అప్పీళ్లను కూడా 1986 మార్చి 31లోగా పరిష్కరించాలి.
  6. వివిధ స్థానిక ప్రాంతాలు, క్యాడర్ల మధ్య విచ్చలవిడిగా బదిలీలు చేయకూడదు.
  7. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి 1986 జూన్ 30 దాకా జరిగిన అన్ని నియామకాలను, పదోన్నతులను పునఃసమీక్షించాలి.
  గిర్‌గ్లానీ వ్యాఖ్యలు
 • ఎందుకింతగా ఉల్లంఘనలు జరుగుతున్నాయనే అంశంపై గిర్‌గ్లానీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి..
 • 'పరిస్థితులు కాలానుగుణంగా మారుతుంటాయి. పరిపాలనలోనూ మార్పులు చేర్పులు అవసరమవుతాయి. కానీ ఈ మార్పులు చేర్పులు చేయాల్సిన సందర్భంలో రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయనే స్పృహ కోల్పోయి, ఆ విషయాన్ని మరచిపోయి వ్యవహరిస్తున్నందున ఈ సమస్యలు తలెత్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులపై మతిమరుపుతో వ్యవహరించినట్లుంది. పాలకుల ఆశ్రిత జన పక్షపాతం ఈ ఉల్లంఘనలకు కారణంగా కనిపిస్తోంది. పాలనలో అవసరార్థం కొన్ని మార్పులు, సంస్కరణలు చేయాల్సి రావొచ్చునేమో. కానీ రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయనే సంగతిని గుర్తుంచుకొని, దానికి లోబడి సంస్కరణలను, నిర్ణయాలను తీసుకొని ఉంటే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండేవి కావు. రాష్ట్రపతి ఉత్తర్వుల వివరాలు కూడా చాలామందికి తెలియవు. ఏడో జోన్ అనీ, ఫ్రీజోన్ అనీ మాట్లాడుతున్నారు. ఈ మాట అంటున్నారంటే వారికి రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి అవగాహన లేదని అర్థం. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడా ఈ పదాలు లేవు. లేకపోయినా వీటిని విరివిగా వాడుతున్నామంటే, ఉత్తర్వుల గురించిన సమగ్ర సమాచారం, అవగాహన లేదన్నట్లే.. పైగా ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు. తత్ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకొని అమలు చేస్తున్నారు'.
  నిపుణుడు గిర్‌గ్లానీ
 • జేఎం గిర్‌గ్లానీ.. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి. దేశ విభజన సమయంలో వీరి కుటుంబం పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేసింది. సర్వం కోల్పోయిన కుటుంబం చాలా కష్టాలు పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి స్నాతకోత్తర డిగ్రీ పూర్తి చేసుకున్న గిర్‌గ్లానీ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. సర్వీస్ విషయాలపై అవగాహన ఉన్న నిపుణుడిగా, అవినీతి మచ్చలేని నిబద్ధతగల అధికారిగా పేరొందారు. పంచాయతీరాజ్ కమిషన్ సభ్యుడిగా, ఐఏఎస్‌ల న్యూస్ బులెటిన్ ఎడిటర్‌గా పనిచేసిన గిర్‌గ్లానీ వ్యక్తిగతంగా కవి కూడా. సింధ్‌లకు చెందిన సింధ్‌రతన్ అనే త్రైమాసిక పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. 81 సంవత్సరాల వయసులో 2009లో చనిపోయారు. గిర్‌గ్లానీ వ్యక్తిగతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలమైన వ్యక్తేం కాదన్నది ఆచార్య జయశంకర్ ఉవాచ. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు విషయంలో మాత్రం ఆయన పట్టుదలతో ఉండేవారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన ఈ అంశాలను అమలు చేయకుంటే ఎలా? అనేది ఆయన బలమైన భావన. కీలకమైన, ఉమ్మడి రాష్ట్రానికి ఊపిరైన రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానిక రిజర్వేషన్లను సరిగ్గా అమలు చేయాలన్న స్పృహ ప్రభుత్వానికి లేకపోవడం ఏంటని ఆయన బాధపడేవారని ఆచార్య జయశంకర్ చెప్పేవారు. గిర్‌గ్లానీ కమిషన్ నివేదికలో కూడా ఇదే విషయం ధ్వనిస్తుంది. 'స్థానిక రిజర్వేషన్లున్న చోటనే వాటిని గౌరవించలేదు.. ఇక లేనిచోట పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయినా గణాంకాలిలా ఉన్నాయి'. అంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయం విషయంలో గిర్‌గ్లానీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమైకత్యకు ప్రాతిపదికనుకున్న నిబంధనల పట్ల, రాజ్యాంగ నిబంధనల పట్ల నిర్లక్ష్యధోరణితో ఉన్నామని ఆయన పేజీకో సారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ నియామాలను గౌరవించకుంటే ఎలా? మనం చేసిన చట్టాలను మనమే గౌరవించకుంటే ఎలా? అనేది ఆయన ఆవేదన. అందర్నీ కలిపేసుకొని.. పురోభివృద్ధికి చట్టాలు తయారు చేసుకుంటే వాటికి అంతే గౌరవం ఇవ్వాలనేది ఆయన ఆలోచన. ఈ నివేదికను చూసిన కర్ణాటక ప్రభుత్వం తర్వాత స్థానిక రిజర్వేషన్లపై తమ రాష్ట్రంలోనూ గిర్‌గ్లానీ సాయం కోరింది.

 • Posted on 08-11-2015