closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

కాకతీయుల అనంతర రాజులు

 • కాకతీయుల పతనానంతరం..క్రీ.శ. 1323లో వారి రాజధాని ఓరుగల్లును ఆక్రమించిన మహమ్మద్ బీన్ తుగ్లక్ దానికి సుల్తాన్‌పూర్ అని పేరు పెట్టాడు. మహమ్మద్ బీన్ తుగ్లక్ తెలంగాణతో పాటు ఆంధ్రా ప్రాంతాన్ని ఆక్రమించి 1324లో ఆ ప్రాంతాల్లో మహమ్మదీయ పాలనను ప్రవేశపెట్టాడు. దేవగిరి పాలకుడైన మాలిక్ బుర్హానుద్దీన్ తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్యం వహించి, తన తరఫ్‌దారుగా మాలిక్ మఖ్‌బూల్‌ను ఓరుగల్లులో నియమించాడు.
  దుర్భర పరిపాలన
 • మాలిక్ మఖ్‌బూల్ పాలనలో తెలుగు ప్రజలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. అతడి కాలంలో రైతులపై అధిక పన్నులు విధించారు. హిందూ దేవాలయాలను కూల్చి వాటి స్థానంలో మసీదులను నిర్మించారు. బ్రాహ్మణులను చంపి వారి అగ్రహారాలను ఆక్రమించారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ విధంగా అరాచకం ప్రబలి శాంతి భద్రతలు కనుమరుగయ్యాయి. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. చివరికి ప్రజలు ముస్లింల పరిపాలనను భరించలేని స్థితికి వచ్చారు. తెలుగు ప్రాంతాలు ఎదుర్కొన్న ఈ దుస్థితిని విలస తామ్రశాసనం, కలువచెరు శాసనం, గంగాదేవి రచించిన 'మధురా విజయం' పేర్కొన్నాయి.
 • ఈ పరిస్థితుల్లో తెలుగు ప్రాంతాల్లో ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. క్రీ.శ. 1323లో జరిగిన ఓరుగల్లు యుద్ధంలో చాలామంది తెలుగు నాయకులు మరణించారు. మిగిలిన నాయకులైన అన్న మంత్రి, కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమ నాయకుడు, మంచికొండ గణపతి నాయకుడు, అద్దంకి వేమారెడ్డి తదితరులు ముసునూరి ప్రోలయ నాయకత్వంలో ముస్లిం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. వీరంతా 1326 నాటికి ముస్లింలను తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లగొట్టారు. రేచర్ల సింగమ నాయకుడు దక్షిణ తెలంగాణలో పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ముసునూరి కుటుంబానికి చెందిన ప్రోలయనాయకుడు ఉత్తర తీర ప్రాంతాన్ని ఉత్తర తెలంగాణను కలిపి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.

  ప్రోలయ నాయకుడు (క్రీ.శ. 1326-1330)
 • ప్రోలయ నాయకుడు స్వతంత్ర ముసునూరి వంశ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజధాని భద్రాచలం దగ్గర ఉన్న రేకపల్లి. ప్రోలయ నాయకుడు చేసిన పోరాటాల్లో కాపయ నాయకుడు (పినతండ్రి కుమారుడు) కుడి భుజంగా ఉన్నాడు. ప్రోలయ నాయకుడు క్రీ.శ. 1330లో వెన్నయకు విలస గ్రామాన్ని దానంగా ఇస్తూ విలస తామ్ర శాసనం వేయించాడు. ఈ శాసనం ఇతడి ఘనతను తెలుపుతుంది. ప్రోలయ నాయకుడు ముస్లింల పాలనలో బ్రాహ్మణులు కొల్పోయిన అగ్రహారాలను తిరిగి ఇచ్చాడు. యజ్ఞయాగాదులను పునరుద్ధరించాడు. రైతుల నుంచి 1/6వ వంతు పంటను భూమిశిస్తుగా వసూలు చేశాడు. ప్రోలయ తర్వాత కాపయ నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు.
  కాపయ నాయకుడు (క్రీ.శ. 1330-1368)
 • కాపయ నాయకుడు హోయసల రాజైన బల్లాలుడి సహాయంతో ముస్లింల ఆధీనంలో ఉన్న ఓరుగల్లు కోటను క్రీ.శ. 1336లో ఆక్రమించాడు. ముస్లిం చరిత్రకారులు కాపయ నాయకుడిని క్రిష్ణానాయక్, కాన్యానాయక్, కాబానాయక్ అని పేర్కొన్నారు. ఇతడు 'ఆంధ్ర దేశాధీశ్వర' 'ఆంధ్రసురత్రాణ' బిరుదులతో ఓరుగల్లును రాజధానిగా చేసుకుని తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలను పాలించాడు. పూర్వ కాకతీయ రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 75 మంది తెలుగు నాయకులు ఇతడిని సేవించారని అనితల్లి వేయించిన కలువచెరు శాసనం పేర్కొంది.
 • క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించిన అల్లా ఉద్దీన్ హసన్ బహమన్‌షాకు రాజ్యస్థాపన సమయంలో కాపయ నాయకుడు సైనిక సహాయం చేశాడు. అయితే బహమనీ రాజ్యం కాపయ నాయకుడికి పక్కలో బల్లెంలా తయారైంది. రేచెర్ల పద్మనాయక రాజైన అనవోతా నాయకుడు ఓరుగుల్లుపై దండెత్తాడు. క్రీ.శ. 1368లో వరంగల్ సమీపంలోని భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. దీంతో ముసునూరి నాయక రాజ్యం పతనమై, ఓరుగల్లు పద్మ నాయకుల వశమైంది.
  రేచెర్ల పద్మనాయకులు (క్రీ.శ. 1326-1475)
 • రేచెర్ల పద్మనాయకులు కాకతీయుల కింద సైన్యాధిపతులుగా, దండనాధులుగా పనిచేశారు. కాకతీయుల పతనానంతరం తెలుగు ప్రాంతాల నుంచి ముస్లింలను పారదోలడంలో ముఖ్య భూమిక పోషించారు. తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరు దాదాపు 150 ఏళ్లు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వీరి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది.
 • పద్మనాయకులనే వెలమలు అని కూడా అంటారు. వీరు నల్గొండ జిల్లాలోని రాచకొండ, దేవరకొండ ప్రాంతాలను రాజధానులుగా చేసుకుని పాలించారు. వీరి చరిత్రకు ముఖ్య ఆధారం 'వెలుగోటి వంశావళి. దీని ఆధారంగా రేచెర్ల వంశానికి మూలపురుషుడు బేతాళ నాయకుడు. ఇతడి అసలు పేరు చెవ్విరెడ్డి. ఆమనగంటిపురం ఇతడి జన్మస్థలం.
 • చెవ్విరెడ్డి అసాధారణ ప్రజ్ఞ కలవాడు. గొప్ప పరాక్రమవంతుడు. ఇతడి పరాక్రమాన్ని గురించి తెలుసుకున్న కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు క్రీ.శ. 1252-53లో ఆమనగంటిపురం ప్రాంతానికి పాలకుడిగా నియమించి బేతాళ నాయకుడనే బిరుదునిచ్చాడు. ఇతడి వారసులు కాకతీయుల దగ్గర సైన్యాధిపతులుగా పనిచేశారు.
  సింగమ నాయకుడు (క్రీ.శ. 1326-1361)
 • సింగమ నాయకుడు తన పూర్వీకుల్లా కాకతీయ ప్రతాపరుద్రుడి సైన్యాధిపతిగా పనిచేశాడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో ప్రతాపరుద్రుడిని మెప్పించి 80 వరాలను పొంది 'అశీతి వరాల సింగమ నాయుకుడు' అని ప్రసిద్ధి చెందాడు. ఇతడు మహ్మదీయులను తెలుగు ప్రాంతాల నుంచి తరిమికొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఆమనగల్లును రాజధానిగా చేసుకుని స్వతంత్ర పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు.
  అనవోతా నాయకుడు (క్రీ.శ. 1361-1384)
 • సింగమ నాయకుడి కుమారుడు అనవోతా నాయకుడు. అతడికి సోమకుల పరశురామ, ఆంధ్రదేశాధీశ్వర, ఖడ్గనారాయణ, హిందూరాయ సురత్రాణ అనే బిరుదులున్నాయి. అనవోతా నాయకుడు రాచకొండను శత్రుదుర్భేద్యమైన దుర్గంగా నిర్మించి, రాజధానిగా మార్చాడు. ఇతడు ధరణికోట యుద్ధంలో కొండవీటిరెడ్డి రాజైన అనవోతారెడ్డిని ఓడించి జగనొబ్బగండ అనే బిరుదు పొందాడు.
 • పరిపాలనా సౌలభ్యం కోసం అనవోతా నాయకుడు తన రాజ్యాన్ని రెండుగా విభజించి తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండ ప్రాంతానికి రాజుగా నియమించాడు. అప్పటి నుంచి రాచకొండలో అనవోతా నాయకుడి సంతతివారు, దేవరకొండలో మాదానాయకుడి సంతతివారు పరస్పర సహకారంతో పాలించారు. అనవోతా నాయకుడు రాచకొండ ప్రాంతంలో రాయసముద్రం, అనపోతు సముద్రాలనే చెరువులను నిర్మించాడు. వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించి, శ్రీపర్వతానికి మెట్లు కట్టించాడు.
  రెండో సింగమ నాయకుడు (క్రీ.శ. 1384-1399)
 • అనవోతా నాయకుడి కుమారుడు రెండో సింగమ నాయకుడు. ఇతడికి కుమార సింగమనాయకుడు, కుమార సింగభూపాలుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు అనే ఇతర పేర్లుండేవి. ఇతడికి సర్వజ్ఞ చక్రవర్తి, ఆంధ్ర మండలాధీశ్వర, ప్రతిదండ భైరవ, ఖడ్గనారాయణ, సర్వజ్ఞచూడామణి అనే బిరుదులుండేవి. ఇతడు గొప్పకవి. కవి పండిత పోషకుడు. విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయామాత్యుడు ఈయన ఆస్థాన కవులు.
  రెండో అనవోతా నాయకుడు (క్రీ.శ. 1399-1421)
 • రెండో సింగమ నాయకుడి కుమారుడు. ఇతడికి ఇమ్మడి అనవోతానాయుడు, పిన్న అన్నమ నాయకుడు, కుమార అనవోతానీడు అనే ఇతర పేర్లుండేవి. ఇతడి చరిత్రకు ప్రధాన ఆధారం వెలుగోటి వంశావళి. కొండవీటి రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డిని ఇతడు వధించాడు.
  రావు మాదానాయకుడు (క్రీ.శ. 1421-1430)
 • ఇతడు రెండో అనవోతా నాయకుడి తమ్ముడు. ఇతడి భార్య నాగాంబిక రాచకొండ సమీపంలోని దేవలమ్మ నాగారం వద్ద 'నాగసముద్రం' అనే చెరువును నిర్మించి, ఈ చెరువు కట్టపై క్రీ.శ. 1429లో ఒక శాసనం వేయించింది. ఈ శాసనం రావు మాదానాయకుడి చరిత్రకు ప్రధాన ఆధారం.
 • ఇతడు గొప్ప వైష్ణవ మతాభిమాని. శ్రీశైల వంశంలో జన్మించిన రామానుజాచార్యుడి కుమారుడైన వెంకటాచార్యుడి శిష్యుడు.
  మూడో సింగమనాయకుడు (క్రీ.శ. 1430-1475)
 • ఇతడు మాదానాయకుడి అన్న కుమారుడు. ఇతడికి ముమ్మడి సింగమనాయకుడు, సర్వజ్ఞరావు సింగమనాయకుడు అనే బిరుదులుండేవి. ఇతడు సుదీర్ఘకాలం పాలించాడు. అనేక మంది కవులను పోషించాడు. వారిలో గౌరన, పోతన, కొరవి గోపరాజులు ముఖ్యులు. మూడో సింగమనాయకుడే చివరి రాచకొండ పద్మనాయక పాలకుడు.
  మాదానాయకుడు
 • దేవరకొండ రేచెర్ల పద్మనాయక రాజ్య స్థాపకుడు మాదానాయకుడు. ఇతడు మొదటి సింగమనాయకుడి కుమారుడు. దేవరకొండను రాజధానిగా చేసుకుని పాలించాడు. శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. శ్రీశైలం దేవాలయానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం క్షేత్రంలో ఉత్తర ద్వార మండపాన్ని, శివాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. మాదానాయకుడు దేవరకొండ దుర్గం సమీపంలో మాధవపురాన్ని నిర్మించి అక్కడే నివసించేవాడు. ఇతడి పాలనాకాలానికి సంబంధించి చరిత్రకారుల్లో స్పష్టత లేదు.
  పెద వేదగిరి (క్రీ.శ. 1384-1410)
 • మాదానాయకుడి కుమారుడు పెద వేదగిరి. ఇతడి శాసనాలు సింహాచలం, శ్రీకూర్మం తదితర పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయి. ఇతడు శివభక్తుడు. కవి పండిత పోషకుడు. ఇతడి ఆస్థానకవి శాకల్య అయ్యలార్యుడు. ఈయన 'భాస్కర రామాయణం'ను రచించాడు. దేవరకొండ రాజ్యాన్ని పాలించిన చివరి పద్మనాయక రాజు లింగమనేడు.
  వ్యవసాయమే ప్రధానం
 • పద్మనాయకుల కాలంలో ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. పండిన పంటలో 1/6వ వంతు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అనపోతు సముద్రం, నాగ సముద్రం, రాయ సముద్రం తదితర చెరువులను నిర్మించారు. వరి, జొన్న, సజ్జ, నువ్వులు, చెరకు, పత్తి, మిరప పంటలను పండించేవారు.
  ఆర్థిక పరిస్థితి
 • బ్రాహ్మణులు వ్యవసాయం చేసేవారు. వస్త్ర, కలంకారీ పరిశ్రమలకు ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రసిద్ధి చెందాయి. కృష్ణానది తీరంలో ఉన్న ఓడపల్లి ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు వ్యాపారం చేసేవారు.
  మతం: పద్మనాయకులు మొదట శైవులు. తర్వాత వైష్ణవాన్ని స్వీకరించి వ్యాపింపజేశారు. వీరి కాలంలో బసవేశ్వరుడి వీరశైవ ప్రభావం ఎక్కువగా ఉండేది. తీవ్రవాద శైవం ప్రజాదరణ పొందింది. భైరవాలయాలు, మైలారు దేవాలయాలు వెలిశాయి. భైరవారాధన ఫలితంగా 'రణం కుడుపు' ఆచారం ప్రారంభమైంది. రణం కుడుపు అంటే మృతుల రక్తమాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణదేవతలకు, భూతప్రేత పిశాచాలకు నివేదన చేయడం. మంత్రాలు, తాంత్రిక పూజలు ఎక్కువగా ఉండేవి. కాళికాదేవి, దుర్గాదేవి, చండీ, భద్రకాళి దేవతలను ఆరాధించేవారు.
 • పద్మనాయకుల్లో చివరి రాజులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. మూడో సింగ భూపాలుడి ఆస్థానంలో వేదాంత దేశికుడి కుమారుడైన నైనాచార్యులు ఉండేవాడు. ఇతడు వైష్ణవ మతవ్యాప్తికి కృషి చేశాడు. వేదాంత దేశికుడు ప్రచారం చేసిన వడగల్ వైష్ణవశాఖ ఈ కాలంలో వ్యాప్తిలో ఉండేది.
  విద్యా విధానం: అగ్రహారాలు, దేవాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. జ్యోతిష్యం, షడ్‌దర్శనాలు, శబ్దశాస్త్రాలు, ఆయుర్వేద విద్యలుండేవి. అప్పటి రాజులు, పండితులు ఉర్దూ, పారశీక, అరబ్బీ లాంటి భాషల్లో పాండిత్యం సాధించారు. సింగభూపాలుడు వసంతోత్సవాలు ఏర్పాటు చేసి రాజ్యంలో ఉన్న కవి, పండిత, గాయకులను సన్మానించేవాడు.
  సాహిత్యం: సింగభూపాలుడు 'రసార్ణవ సుధాకరం' అనే లక్షణ గ్రంథాన్ని, సారంగధరుడి 'సంగీత రత్నాకరం'పై సంగీత సుధాకారం అనే వ్యాఖ్యానాన్ని రాశాడు. 'రత్నపాంచాలిక' అనే సంస్కృత నాటకాన్ని రచించాడు.
  విశ్వేశ్వరుడు: రెండో సింగమనాయకుడి ఆస్థాన కవి విశ్వేశ్వరుడు. ఇతడు 'చమత్కార చంద్రిక' అనే సంస్కృత అలంకార గ్రంథాన్ని రచించాడు. విశ్వేశ్వరుడిని సింగభూపాలుడు 'సాహిత్య శిల్పావది' అని వర్ణించాడు.
  అప్పయార్యుడు: అప్పయార్యుడు రెండో సింగమనాయకుడి ఆస్థానకవి. ఇతడు అమరకోశానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు. సింగభూపాలుడి ఆస్థానంలో పశుపతి మేఘనాథుడు అనే కవి ఉండేవాడు. సింగభూపాలుడి ఆస్థానాన్ని కవి సార్వభౌముడైన శ్రీనాథుడు దర్శించాడు.
  రావు మాదానాయకుడు: ఇతడు వాల్మీకి రామాయణానికి 'రాఘవీయం' అనే వ్యాఖ్య రచించి శ్రీరాముడికి అంకితమిచ్చాడు.
  నాగనాథుడు: ఇతడు సంస్కృత భాషలో 'మదన విలాస బాణం' అనే గ్రంథాన్ని రచించాడు.
  గౌరన: గౌరన మూడో సింగమనాయకుడి ఆస్థానకవి. లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. ఇతడికి 'సరస సాహిత్య లక్షణ చక్రవర్తి' అనే బిరుదుండేది.
  పోతన: పోతన కొంతకాలం సర్వజ్ఞ సింగమ నాయకుడి ఆస్థానంలో ఉండి అతడి కోరికపై 'భోగినీ దండకం' రాశాడు. ఇతడు వీరభద్ర విజయం, నారాయణ శతకం, భాగవతం గ్రంథాలను కూడా రచించాడు.
  శాకల్య మల్లభట్టు: ఇతడు మూడో సింగమ నాయకుడి ఆస్థాన కవి. ఉదార రాఘవ కావ్యం, నిరోష్ఠ్య రామాయణం అనే గ్రంథాలను.. అవ్యయసంగ్రహం అనే నిఘంటువును రచించాడు.
  మాదిరి ప్రశ్నలు
  1. స్వతంత్ర ముసునూరి వంశ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?
  ఎ) కాపయ నాయకుడు బి) పోతి నాయకుడు సి) ప్రోలయ నాయకుడు డి) వెన్నయ నాయకుడు
  జ: (సి)
  2. ప్రోలయ నాయకుడి ఘనతను ఏ శాసనం పేర్కొంటుంది?
  ఎ) విలస శాసనం బి) పెంటపాడు శాసనం సి) పోలవరం శాసనం డి) రేకపల్లి శాసనం
  జ: (ఎ)
  3. ఆంధ్రసురత్రాణ అనే బిరుదు ఎవరిది?
  ఎ) అనవోతా నాయకుడు బి) ప్రోలయ నాయకుడు సి) కాపయ నాయకుడు డి) దుర్జయ నాయకుడు
  జ: (సి)
  4. కాపయ నాయకుడు ఓరుగుల్లును ఎప్పుడు స్వాధీనం చేసుకున్నాడు?
  ఎ) క్రీ.శ. 1336 బి) క్రీ.శ. 1339 సి) క్రీ.శ. 1347 డి) క్రీ.శ. 1350
  జ: (ఎ)
  5. రేచెర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారం ఏది?
  ఎ) రేచెర్ల వంశావళి బి) వెలుగోటి వంశావళి సి) రాచకొండ శాసనం డి) దేవరకొండ శాసనం
  జ: (బి)
  6. రేచెర్ల పద్మనాయక రాజ్యస్థాపకుడు ఎవరు?
  ఎ) సింగమ నాయకుడు బి) ఎరదాచా నాయకుడు సి) దామా నాయకుడు డి) వెన్నయ నాయకుడు
  జ: (ఎ)
  7. 'రత్న పాంచాలిక' అనే సంస్కృత నాటకాన్ని రాసిందెవరు?
  ఎ) రెండో సింగమనాయకుడు బి) మూడో సింగమనాయకుడు సి) రావు మాదానాయకుడు డి) రెండో అనవోతానాయకుడు
  జ: (ఎ)
  8. రాచకొండను పాలించిన చివరి పద్మనాయక పాలకుడు ఎవరు?
  ఎ) రావు మాదానాయకుడు బి) రెండో అనవోతా నాయకుడు సి) మూడో సింగమ నాయకుడు డి) మాదానాయకుడు
  జ: (సి)
  9. నాగ సముద్రం అనే చెరువును ఎవరు నిర్మించారు?
  ఎ) నాగాంబిక బి) సూరాంబిక సి) మూకాంబిక డి) దేవాంబిక
  జ: (ఎ)
  10. వాల్మీకి రామాయణానికి రాఘవీయం అనే వ్యాఖ్యను ఎవరు రాశారు?
  ఎ) రెండో సింగమ నాయకుడు బి) మొదటి సింగమ నాయకుడు సి) మూడో సింగమ నాయకుడు డి) రావు మాదానాయకుడు
  జ: (డి)
  Posted on 10-11-2015

  డాక్ట‌ర్ ఎం. జితేంద‌ర్‌రెడ్డి