closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

తెలంగాణలో కుతుబ్‌షాహీలు

 • తెలంగాణ చరిత్రలో కుతుబ్‌షాహీల పాలనకు విశేష ప్రాధాన్యం ఉంది. గోల్కొండను రాజధానిగా చేసుకుని అనేక దశాబ్దాల పాటు పరిపాలన జరిపిన వీరి కాలంలో చెప్పుకోదగ్గ అంశాలెన్నో. మత సామరస్యం, సాహిత్యానికి పెద్దపీట, భాషాభివృద్ధి, విశేష నిర్మాణాలు.. ఇలా ఒక్కొక్కరి కాలంలో ఒక్కో అంశానికి ప్రాముఖ్యత లభించింది. తెలంగాణకు తొలి ముస్లిం పాలకులుగా గుర్తింపు పొందిన కుతుబ్‌షాహీల చరిత్రలో విశేషాలివి..
 • తెలంగాణను పాలించిన తొలి ముస్లిం పాలకులు కుతుబ్‌షాహీలు. దాదాపు 175 సంవత్సరాల వీరి పాలన కాలంలో తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది.
 • క్రీ.శ. 1347లో స్థాపితమైన బహ్మనీ సామ్రాజ్యం క్రీ.శ.1500 నాటికి పతనమై 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. అందులో నుంచి ఏర్పడిందే గోల్కొండ రాజ్యం. దీన్నే కుతుబ్‌షాహీలు పాలించారు.
 • సుల్తాన్ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1512లో కుతుబ్‌షాహీ రాజ్యానికి గోల్కొండను రాజధానిగా చేశాడు. ఈయన పర్షియాలోని ట్రాన్స్ అక్సేనియా ప్రాంతానికి చెందిన హందం రాజ వంశస్థుడు. ఇతడు ఉద్యోగం కోసం భారతదేశానికి వచ్చి క్రీ.శ.1487లో బహ్మనీ పాలకుడైన మూడో మహ్మద్‌షా అంగరక్షక దళంలో సైనికుడిగా చేరాడు. తన ప్రతిభతో సుల్తాన్‌ను మెప్పించి తెలంగాణ ప్రాంతానికి తరఫ్‌దారుగా నియమితుడయ్యాడు. బహ్మనీ సామ్రాజ్య పతనానంతరం క్రీ.శ. 1512లో కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. తన పోషకుడైన బహ్మనీ సుల్తాన్ మరణానంతరం క్రీ.శ. 1518లో గోల్కొండ రాజధానిగా ఇతడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు.
 • సుల్తాన్ కులీ (క్రీ.శ. 1512-1543)
 • సుల్తాన్ కులీకి ఖవాస్ ఖాన్, కుతుబ్-ఉల్-ముల్క్ అమీరాల్ ఉమ్రా అనే బిరుదులుండేవి. ఇతడు గోల్కొండ దుర్గానికి మహమ్మద్ నగరమని పేరు పెట్టాడు. సుల్తాన్ కులీని ప్రజలు 'బడే మాలిక్' (పెద్ద సర్దారు) అని పిలిచేవారు. ఇతడి కాలంలో రాజ్యం తెలంగాణ మొత్తానికి విస్తరించింది. సుల్తాన్ కులీ సాహిత్యాభిమాని కావడంతో పండిత పరిషత్తులను స్థాపించాడు. సుల్తాన్ కులీని అతడి కుమారుడు జంషీద్ హత్య చేశాడు.
  జంషీద్ (క్రీ.శ. 1543-1550)
 • జంషీద్ సమర్థుడే కానీ పరమ క్రూరుడు. చిన్న నేరాలకు కూడా మరణ శిక్షలను విధించేవాడని ఫెరిష్టా అనే చరిత్రకారుడు రాశాడు. తండ్రిని హతమార్చిన జంషీద్ ప్రజాభిమానాన్ని పొందలేకపోయాడు. ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి ఇతడి తమ్ముడు ఇబ్రహీం దేవరకొండ దుర్గాధిపతిగా ఉండేవాడు. తర్వాత ఇతడు బీదర్‌కు పారిపోయి, గోల్కొండను ఆక్రమించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. విజయనగరంలో ఆశ్రయం పొంది అక్కడే అళియ రామరాయల దగ్గర ఏడేళ్లు ఉన్నాడు. జంషీద్ క్రీ.శ.1550లో రాజయక్ష్మ వ్యాధితో మృతి చెందాడు.
  ఇబ్రహీం కుతుబ్‌షా (క్రీ.శ. 1550-1580)
 • ఇబ్రహీం విజయనగర పాలకుల సహాయంతో తన సోదరుడు జంషీద్ మరణానంతరం గోల్కొండ పాలకుడయ్యాడు. గోల్కొండను పాలించిన సుల్తాన్‌లందరిలో విశిష్టమైన వ్యక్తిత్వం, ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి ఇతడే. దక్కన్ సుల్తాన్లకు మధ్యవర్తిత్వం వహించి, తుల్య ప్రాబల్య సిద్ధాంతాన్ని అనుసరించి వారి మధ్య అనవసర రక్తపాతాన్ని నివారించాడు. వివిధ కారణాల వల్ల విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దక్కన్ ముస్లిం రాజ్య కూటమిని ఏర్పరిచాడు. క్రీ.శ. 1565లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధంలో పాల్గొని విజయనగర నాశనానికి కారకుడయ్యాడు.
 • ఇబ్రహీం కుతుబ్‌షా దారిదోపిడీ దొంగలను శిక్షించి, శాంతిభద్రతలను మెరుగుపరిచాడు. ఇతడి కాలంలో న్యాయశాఖను పునర్ వ్యవస్థీకరించారు. రాజ్యమంతటా విశాలమైన రాజమార్గాలను నిర్మించాడు. ఇబ్రహీం కాలంలో గోల్కొండ రాజ్యం టర్కీ, అరేబియా, పర్షియా రాజ్యాలతో వర్తక వ్యాపారాలను సాగించి 'రెండో ఈజిప్ట్'గా ఘనత పొందింది.
 • ఇబ్రహీం కుతుబ్‌షా ఉర్దూ, పారశీక, తెలుగు కవులను పోషించి, ఆదరించాడు. తెలుగు కవులు ఇబ్రహీం కుతుబ్‌షాను 'మల్కీభ రాముడి'గా కీర్తించారు. ఇతడు 'ఆషిఖానా' అనే కవితాగోష్టులను నిర్వహించేవాడు. ఇబ్రహీం కాలంలో 'దక్కనీ ఉర్దూ' అనే మాండలిక ఉర్దూ భాష ప్రారంభమైంది. ఇతడు గొప్ప నిర్మాత. గోల్కొండ దుర్గం ప్రాకారాలను బలపరిచాడు. ఇతడి కాలంలోనే బాలాహిస్సార్ నిర్మాణం పూర్తయ్యింది. ఇతడు 'చరాసియా' అనే కొత్త ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. క్రీ.శ. 1580లో మరణించాడు.
  మహమ్మద్ కులీ కుతుబ్‌షా (క్రీ.శ. 1580-1612)
 • ఇబ్రహీం కుతుబ్‌షా మూడో కుమారుడు. కుతుబ్‌షాహీ సుల్తాన్లలో గొప్పవాడు. 14 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు చెబుతారు. మొగల్ చక్రవర్తి అక్బర్ తన రాయబారి వసూద్‌బేగ్‌ను మహమ్మద్ కులీ ఆస్థానానికి పంపించాడు. ఆ రాయబారిని గౌరవించి, అమూల్యమైన బహుమానాలిచ్చి తన మైత్రిని ప్రకటించాడు. క్రీ.శ. 1611లో తూర్పు తీరంలో వర్తకం చేసుకోవడానికి ఆంగ్లేయులకు అనుమతినిచ్చాడు.
 • క్రీ.శ. 1603లో ఇరాన్ చక్రవర్తి షాహీ అబ్బాస్, అగ్జలూ సుల్తాన్‌ను గోల్కొండకు తన రాయబారిగా పంపించగా మహమ్మద్ కులీ అతడిని సాదరంగా ఆహ్వానించి, విలువైన కానుకలిచ్చి పంపించాడు.
 • మహమ్మద్ కులీ పారశీక భాషలో ఎన్నో రచనలను చేశాడు. దక్కనీ ఉర్దూను ప్రోత్సహించాడు. ఇతడు గొప్ప పండితుడు. అనేక గీతాలను రచించాడు. ఇతని ఆస్థానంలో వివిధ భాషా కవులుండేవారు. మహమ్మద్ కులీ హిందువులను ఉన్నతోద్యోగాల్లో నియమించాడు. ఇతడి కాలంలో హైందవ, మహమ్మదీయ సంస్కృతులు సమ్మేళనమై దక్కన్ సంస్కృతిగా రూపుదాల్చింది. మహమ్మద్ కులీ గొప్ప నిర్మాత. ఇతడు మూసీ నదికి దక్షిణంలో హైదరాబాద్ నగరాన్ని నిర్మించి, అనేక భవనాలను కట్టించాడు.
  మహమ్మద్ కుతుబ్‌షా (1612-1626)
 • మహమ్మద్ కులీ కుతుబ్‌షా కుమార్తె హయత్‌బక్షీ బేగం భర్త. మహమ్మద్ కులీకి పుత్ర సంతానం లేకపోవడంతో ఆయన తర్వాత అల్లుడు మహమ్మద్ కుతుబ్‌షా సింహాసనం అధిష్ఠించాడు. ఇతడి కాలంలో మొగల్ చక్రవర్తి జహంగీర్ రాయబారి మీర్‌మక్కి గోల్కొండను దర్శించగా, సుల్తాన్ విలువైన బహుమతులను పంపించాడు. మహమ్మద్ కుతుబ్‌షా హైదరాబాద్ నగరానికి సుల్తాన్ నగరం అని పేరు పెట్టాడు.
 • మహమ్మద్ కుతుబ్‌షా గొప్ప విద్యావంతుడు, కవి, కవి పోషకుడు. ఇతడికి భవన నిర్మాణంలో ఆసక్తి ఎక్కువ. ఖైరతాబాద్ మసీదును, నాలుగంతస్థులున్న అమ్మాన్ భవనాన్ని (న్యాయ స్థానం), ఈద్‌గా (క్రీ.శ. 1624)ను, నబీబాగ్‌ను నిర్మించాడు. హైదరాబాద్‌లో మక్కా మసీదు నిర్మాణాన్ని ఇతడు క్రీ.శ. 1617లో ప్రారంభించగా, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు 1694లో పూర్తి చేశాడు.
  అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672)

 • మహమ్మద్ కుతుబ్‌షా పెద్ద కుమారుడు. 12 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు బాలుడు కావడంతో తల్లి హయత్‌బక్షీ బేగం సంరక్షకురాలిగా పరిపాలనను నిర్వహించింది. ఇతడి కాలంలో గోల్కొండ రాజ్య పతనం ప్రారంభమైంది. మొగల్ చక్రవర్తి షాజహాన్ క్రీ.శ. 1636లో గోల్కొండపై దండయాత్ర చేయగా, అబ్దుల్లా కుతుబ్‌షా మొగలులతో సంధి చేసుకున్నాడు. వారు వివిధ షరతులు విధించగా, అబ్దుల్లా అన్నింటినీ అంగీకరిస్తూ విధేయ పత్రంపై సంతకాలు చేశాడు. ఇతడి కాలంలోనే కోహినూరు వజ్రం కొల్లూరు గనుల్లో దొరికింది. క్రీ.శ. 1636లో అబ్దుల్లా గోల్డెన్ ఫర్మానాను జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార సౌకర్యాలు కల్పించాడు.
  అబుల్‌హసన్ (తానీషా) (క్రీ.శ. 1672-1687)
 • ఇతడు అబ్దుల్లా కుతుబ్‌షా మూడో కుమార్తె బాద్‌షాబీబీ భర్త. హిందువులను ఉన్నతోద్యోగాల్లో నియమించాడు. హిందువులైన అక్కన్నను సర్వ సైన్యాధ్యక్షుడిగా, మాదన్నను మీర్‌జుమ్లా పదవుల్లోనూ నియమించాడు. వీరిద్దరూ పింగళి వంశీయులు. వీరి స్వస్థలం అనుమకొండ. మాదన్న గొప్ప పాలనాదక్షుడు. ఆయన పాలనా యంత్రాంగాన్ని సంస్కరించి, ఆర్థిక వనరులను పెంచాడు. అబుల్ హసన్ మాదన్న సహాయంతో మహారాష్ట్ర పాలకుడైన శివాజీతో క్రీ.శ. 1676లో మొగలులకు వ్యతిరేకంగా సంధి చేసుకున్నాడు. అక్కన్న, మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న పాల్వంచ పరగణాకు తహసీల్దారుగా నియమితుడయ్యాడు. ఇతడు ప్రభుత్వ ఖజానాతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. దీంతో ఇతడిని గోల్కొండ కోటలో బంధించారు. కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు.
 • క్రీ.శ. 1686లో జరిగిన మాల్‌ఖేడ్ యుద్ధంలో ఔరంగజేబు కుమారుడు షాఆలం గోల్కొండ సైన్యాన్ని ఓడించాడు. ఈ సందర్భంగా శాంతి సంధి జరిగింది. ఈ సంధి ప్రకారం అక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుంచి తొలగించాలని షరతు విధించాడు. క్రీ.శ. 1686 మార్చి 24న అక్కన్న, మాదన్నలను గోల్కొండ వీధుల్లో హత్య చేశారు.
 • క్రీ.శ. 1687లో మొగల్ చక్రవర్తి గోల్కొండపై దండయాత్ర చేసి కోట ముట్టడి ప్రారంభించాడు. అబ్దుల్లా పణి అనే గోల్కొండ సేనానికి లంచం ఇచ్చిన ఔరంగజేబు గోల్కొండ ప్రధాన ద్వారమైన ఫతేదర్వాజ తలుపులు తెరిపించాడు. మొగలులకు, గోల్కొండ సైన్యానికి మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటంలో అబ్దుల్ రజాక్ లారీ అనే గోల్కొండ సేనాపతి తన శరీరం మొత్తం గాయాలైనా, పోరాడుతూ సొమ్మసిల్లాడు.
 • మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని పాలకుడైన అబుల్ హసన్‌ను దౌలతాబాద్ కోటలో బంధించాడు. అతడు అక్కడే క్రీ.శ. 1700లో మరణించాడు.
  మాదిరి ప్రశ్నలు
  1. కుతుబ్‌షాహీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు?
      ఎ) క్రీ.శ. 1501     బి) క్రీ.శ. 1505     సి) క్రీ.శ. 1510     డి) క్రీ.శ. 1512
  జ: (డి)
  2. తెలుగు కవులు 'మల్కీభ రాముడి'గా ఎవరిని కీర్తించారు?
      ఎ) ఇబ్రహీం కుతుబ్‌షా     బి) సుల్తాన్ కులీకుతుబ్‌షా     సి) మహమ్మద్ కులీకుతుబ్‌షా     డి) అబ్దుల్లా కుతుబ్‌షా
  జ: (ఎ)
  3. కుతుబ్‌షాహీలు ఆంగ్లేయులకు మొదటిసారిగా తూర్పు తీరంలో వర్తకం చేసుకోవడానికి ఎప్పుడు అనుమతిచ్చారు?
      ఎ) క్రీ.శ. 1611     బి) క్రీ.శ. 1615     సి) క్రీ.శ.1625     డి) క్రీ.శ. 1636
  జ: (ఎ)
  4. హైందవ, మహమ్మదీయ సంస్కృతుల మిశ్రమంతో దక్కన్ సంస్కృతి ఎవరి కాలంలో రూపొందింది?
      ఎ) సుల్తాన్ కులీ     బి) ఇబ్రహీం కులీ     సి) మహమ్మద్ కులీ     డి) అబుల్ హసన్
  జ: (సి)
  5. కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది?
      ఎ) కొల్లూరు     బి) వజ్రకరూరు     సి) రామళ్లకోట     డి) పరిటాల
  జ: (ఎ)
  6. మాదన్న సహాయంతో ఏ మహారాష్ట్ర పాలకుడితో అబుల్ హసన్ సంధి చేసుకున్నాడు?
      ఎ) శంబాజీ     బి) రాజారామ్     సి) పీష్వా బాజీరావు     డి) శివాజీ
  జ: (డి)
  7. గోల్కొండ రాజ్యం ఎవరి కాలంలో విదేశీ వ్యాపారం సాగించి 'రెండో ఈజిప్ట్'గా ఘనత పొందింది?
      ఎ) అబ్దుల్లా కుతుబ్‌షా     బి) ఇబ్రహీం కుతుబ్‌షా     సి) మహమ్మద్ కులీ కుతుబ్‌షా     డి) మహమ్మద్ కుతుబ్‌షా
  జ: (బి)
  8. 'చరాసియా' అనే కొత్త ధర్మాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
      ఎ) సుల్తాన్ కులీ     బి) ఇబ్రహీం కులీ     సి) అబుల్ హసన్     డి) మహమ్మద్ కులీ
  జ: (బి)
  9. మక్కామసీదు నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
      ఎ) క్రీ.శ. 1610     బి) క్రీ.శ. 1614     సి) క్రీ.శ. 1617     డి) క్రీ.శ. 1622
  జ: (సి)
  10. కుతుబ్‌షాహీల్లో చివరి పాలకుడు ఎవరు?
      ఎ) మహమ్మద్ కులీ     బి) జంషీద్ కులీ     సి) అబుల్ హసన్     డి) అబ్దుల్లా కుతుబ్‌షా
  జ: (సి)
  11. కుతుబ్‌షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు?
      ఎ) సుల్తాన్ కులీ     బి) మహమ్మద్ కులీ     సి) జంషీద్     డి) మహమ్మద్ కుతుబ్‌షా
  జ: (ఎ)
  12. కుతుబ్‌షాహీ రాజ్యం ఎప్పుడు పతనమైంది?
      ఎ) క్రీ.శ. 1677     బి) క్రీ.శ. 1687     సి) క్రీ.శ. 1694     డి) క్రీ.శ. 1712
  జ: (బి)
  Posted on 15-11-2015

  డాక్ట‌ర్ ఎం. జితేంద‌ర్‌రెడ్డి