closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

కుతుబ్‌షాహీల ప‌రిపాల‌న‌

* కుతుబ్‌షాహీల ప్రత్యేకం
* తెలంగాణలో విశేష ప్రగతి
 • తెలంగాణ చరిత్రలో కుతుబ్‌షాహీల పాలన అనేక విశిష్టతలను సంతరించుకుంది. పరిపాలన వికేంద్రీకరణ.. పటిష్ఠమైన సైనిక బలగం.. న్యాయ పాలన.. వ్యవసాయ, వాణిజ్యాలకు ప్రోత్సాహం.. వజ్రాల వ్యాపారం.. మత సామరస్యం.. తదితర అంశాలెన్నో కుతుబ్‌షాహీల పాలనలో ప్రత్యేకతలు. వీరి పాలనా విధానం అనంతర కాలంలో ఎందరికో మార్గదర్శకం అయిందన్నది చరిత్రకారుల అభిభాషణ. నాటి పరిపాలన విధానాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
 • తెలంగాణను దాదాపు 175 సంవత్సరాలు పాలించిన కుతుబ్‌షాహీల కాలంలో.. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. వారి పరిపాలనా విధానం తరువాత పాలించిన వారికి మార్గదర్శకంగా నిలిచింది. కుతుబ్‌షాహీల కాలం నాటి పరిస్థితులను విదేశీ యాత్రికులైన టావెర్నియర్, థెవనాట్, పెరిష్టాలు వివరించారు.
 • పాలనా యంత్రాంగం

 • కుతుబ్‌షాహీలు బహమనీ పాలనా విధానాన్ని అనుసరించారు. రాజ్యానికి సుల్తాన్ ముఖ్య అధికారి. సుల్తాన్‌కు పరిపాలనలో మజ్లిస్-ఇ-కింగాస్ లేదా మజ్లీస్ దివాన్‌దరి అనే పరిషత్తు సలహాలిచ్చేది. దీనిలో మంత్రులు, అమీర్‌లు ఉండేవారు.
  పీష్వా (ప్రధానమంత్రి): సుల్తాన్ తర్వాత ముఖ్యాధికారి పీష్వా. ఇతడి కింద వజీర్‌లు అనే మంత్రులుండేవారు. వీరికి జాగీర్లు ఇచ్చేవారు.
 • వికేంద్రీకరణ

 • పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని తరఫ్‌లు, సర్కార్‌లు, పరగణాలు, గ్రామాలుగా విభజించారు. తరఫ్ (రాష్ట్ర) పరిపాలనకు తరఫ్‌దారు ఉండేవాడు. ఇతడికి సహాయకులుగా దివాన్ అనే రెవెన్యూ అధికారి.. ఖాజీ, పండిత్ అనే న్యాయ నిర్వహణాధికారులు ఉండేవారు. సర్కార్, పరగణాలను పౌజుదార్లు పాలించేవారు. వీరికి సహాయంగా ఖతీల్, ఖాజీ, దేశ్‌ముఖ్ తదితర అధికారులు ఉండేవారు.
 • సైనిక నిర్వహణ

 • కుతుబ్‌షాహీల రాజ్యంలో 5 లక్షల సైన్యం ఉన్నట్లు థెవనాట్ అనే విదేశీ యాత్రికుడు తెలిపాడు. ఐనుల్‌ముల్క్ (యుద్ధమంత్రి) సైన్యాన్ని పర్యవేక్షించేవాడు. సుల్తాన్ అంగరక్షక దళం (ఖాసాఖైల్) చక్రవర్తి పర్యవేక్షణలో ఉండేది. జాగీర్దార్లు సైన్యాన్ని పోషించి యుద్ధ సమయాల్లో సరఫరా చేసేవారు. కుతుబ్‌షాహీలు ఉన్నత పదవుల నియామకంలో హిందూ, ముస్లిం భేదాన్ని పాటించలేదు.
 • న్యాయ పాలన

 • రాజ్యానికి సుల్తాన్ ముఖ్యమైన న్యాయాధికారి. ఇతడి తర్వాత షరియత్ పంచ్ (ప్రధాన న్యాయమూర్తి) ఉండేవాడు. ఇతడి కింద ఖాజీ, ముఫ్తీ, ముహతాసీబ్ అనే న్యాయాధికారులు ఉండేవారు. ఠాణేదారు న్యాయవ్యవస్థలో అట్టడుగుస్థాయి అధికారి. ఇతడు స్థానిక గోత్సభ సహాయంతో కేసుల విచారణ చేపట్టేవాడు. బీజాపూర్ వాస్తవ్యుడైన మిర్జా ఇబ్రహీం జుబేరి తన 'బసాటిన్ సలాతిన్' (దస్తూర్ ఉల్ అమర్) అనే రాజనీతి గ్రంథంలో న్యాయ నిర్వహణ ఆదర్శప్రాయంగా ఉండాలని ఇచ్చిన సలహాను కుతుబ్‌షాహీలు పాటించారు.
 • శిస్తు నిర్వహణ

 • ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. భూమిశిస్తు వసూలుకు వేలంపాట నిర్వహించేవారు. వేలం పాడిన వారిని 'ముస్తజీర్లు' అనేవారు. రైతులపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది. గ్రామాల్లో చాలామందికి మిరాశీ ఇనాంలు ఉండేవి. మిరాశీ అంటే వంశపారంపర్యపు హక్కు. వీరి ఫర్మానాలు మిరాశీ హక్కులున్న 12 ఆయగార్లను పేర్కొంటున్నాయి. వారిని బలుతియాన్‌లు అనేవారు.
 • కుతుబ్‌షాహీలు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. మహమ్మద్ కుతుబ్‌షా తల్లి కానమ్ ఆగా హైదరాబాద్‌లోని మాసాబ్ టాంకును తవ్వించారు.
 • గ్రామసభలు

 • కుతుబ్‌షాహీల కాలంలో గ్రామసభలుండేవి. గ్రామసభల్లో పెత్తనం మిరాశీదార్లది. ప్రభుత్వ అధికారులైన వతన్‌దారులు, మిరాశీదారులు గ్రామ వ్యవహారాలను చూసేందుకు గోత్సభ గోత్ర కూటమిగా ఏర్పడేవారు.
 • వజ్ర ఖ్యాతి

 • కుతుబ్‌షాహీ రాజ్యం వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఎంతోమంది విదేశీ వర్తకులు వజ్రాల కోసం గోల్కొండను సందర్శించేవారు. గొల్లపల్లి, రాంజిపెంట, మల్లపల్లి, రామళ్లకోట, కొల్లూరు, పరిటాల, గోల్కొండ, వజ్రకరూరు గనులు వజ్రాలకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం కొల్లూరు గనుల్లో దొరికింది. కొల్లూరు, పరిటాల గనుల్లో 60 వేల మంది పనిచేసేవారని టావెర్నియర్ పేర్కొన్నారు. జాకోబు, బ్లూలైట్, రీజెంట్, పిట్సు అనే ప్రపంచ ప్రసిద్ధిచెందిన వజ్రాలు ఈ గనుల్లోనే దొరికాయి. ప్రభుత్వం వజ్రాల అమ్మకంపై 20 శాతం పన్ను వసూలు చేసేది.
 • ప్రసిద్ధ ప్రాంతాలు

 • కుతుబ్‌షాహీల కాలంలో తుపాకి మందుకు మచిలీపట్నం.. వస్త్ర పరిశ్రమకు ఓరుగల్లు.. ఉక్కు పరిశ్రమకు నిర్మల్, ఇందల్‌వాయి (నిజామాబాద్ జిల్లా).. కొయ్య బొమ్మలకు కొండపల్లి.. నీలిమందుకు నల్లగొండ.. కలప పరిశ్రమకు నరసాపురం ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలం నాటి బంగారు నాణేన్ని హూన్ను అనే వారు.
 • విదేశీ వాణిజ్యం

 • విదేశీ వాణిజ్యం పెద్దఎత్తున సాగేది. పులికాట్, చెన్నపట్నం, నరసాపురం, నిజాంపట్నం, మచిలీపట్నం తదితర ఓడరేవులుండేవి. తూర్పున మలయా, అరకాన్.. పశ్చిమాన టర్కీ, పర్షియా దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది.
 • సాంఘిక పరిస్థితులు

 • కుతుబ్‌షాహీల కాలంలో వర్ణ వ్యవస్థ బలపడి అనేక ఉపకులాలు స్థిరపడ్డాయి. వివిధ కులాల గురించిన సమాచారం హంసవిసతి కావ్యం ద్వారా తెలుస్తోంది. సమాజంలో బ్రాహ్మణులకు గౌరవం ఉండేది. వారు ఉన్నత ఉద్యోగాలను నిర్వహించేవారు. క్షత్రియులు సామంతులుగా, జాగీర్‌దార్లుగా, మిరాశీదార్లుగా ఉండేవారు. వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం చేసేవారు. శూద్రులు ముఖ్యంగా వ్యవసాయం ఇతర వృత్తులు చేసేవారు. నాటి సాంఘిక పరిస్థితుల్లో అస్పృశ్యులు గ్రామం వెలుపల ఉండి చనిపోయిన జంతువుల చర్మంతో చెప్పులు కుట్టేవారు.
 • బాల్య వివాహాలు, బహు భార్యత్వం, దేవదాసీ పద్ధతి, సతీ సహగమనం తదితర సాంఘిక దురాచారాలుండేవి. జ్యోతిష్యం, శకునాల మీద కూడా నమ్మకాలుండేవి. గోల్కొండ సుల్తాన్‌లు సతీ సహగమనాన్ని రూపుమాపడానికి ప్రయత్నించారు. పాలకులు హిందూ దేవాలయాలకు మాన్యాలిచ్చి పోషించేవారు. క్రీ.శ. 1652లో నిర్మించిన భద్రాచల రామాలయానికి అబుల్‌హసన్ భద్రాచలం, శంకరగిరి, పాల్వంచలను దానం చేశాడు. నాటి మసీదు నిర్మాణాల్లో హిందూ ప్రభావం కన్పిస్తుంది. హిందూ, ముస్లింల మధ్య సామరస్యం ముఖ్య లక్షణం. రంజాన్ పండగ, మొహర్రంలలో హిందువులు పాల్గొనేవారు. మొహర్రంనే తెలంగాణ గ్రామాల్లో పీర్ల పండగగా హిందూ ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేవారు. మహమ్మద్ కులీకుతుబ్‌షా గోల్కొండలో వసంతోత్సవాలను జరిపేవాడు. ఇతడు 14 పండగలను జాతీయ పర్వదినాలుగా గుర్తించాడు. గోల్కొండ రాజ్యంలో అధిక సంఖ్యాకులు హిందువులు. ఎక్కువ మంది వైష్ణవాన్ని ఆచరించారు. సుప్రసిద్ధ సూఫీ యోగి కబీర్ భద్రాచల రామదాసుకు రామనామ మహాత్మ్యాన్ని బోధించాడన్నది ప్రజల నమ్మకం.
 • మాదిరి ప్రశ్నలు

  1. పీష్వా అంటే ఎవరు?
  ఎ) ఆర్థికమంత్రి బి) ముఖ్యమంత్రి సి) సైన్యాధిపతి డి) ప్రధానమంత్రి
  జ: (డి)
  2. ముస్తజీర్లు ఎవరు?
  ఎ) భూమి శిస్తు వసూలు చేసేవారు
  బి) వ్యాపార పన్ను వసూలు చేసేవారు
  సి) సైనిక నిర్వహణ చేసేవారు
  డి) గ్రామాధికారులు
  జ: (ఎ)
  3. మాసాబ్‌టాంకును తవ్వించిందెవరు?
  ఎ) బీబీనేల్ బి) కానమ్ ఆగా సి) హయత్ బక్షీబేగం డి) బిల్‌కేస్
  జ: (బి)
  4. హూన్ను అనేది దేనిపేరు?
  ఎ) బంగారు నాణెం బి) వెండి నాణెం సి) సీసపు నాణెం డి) రాగి నాణెం
  జ: (ఎ)
  5. కిందివాటిలో కుతుబ్‌షాహీ యుగ ముఖ్యలక్షణం?
  ఎ) విదేశీ వాణిజ్యం బి) చెరువుల నిర్మాణం సి) భవన నిర్మాణం డి) హిందూ ముస్లిం సామరస్యం
  జ: (డి)
  6. గోల్కొండలో వసంతోత్సవాలను జరిపించిన పాలకుడు ఎవరు?
  ఎ) సుల్తాన్ కులీ బి) ఇబ్రహీం కులీ సి) మహమ్మద్ కులీ డి) అబుల్‌హసన్
  జ: (సి)
  7. షరియత్ పంచ్ అంటే ఎవరు?
  ఎ) భూమిశిస్తు వసూలు అధికారి బి) రెవెన్యూ అధికారి సి) న్యాయాధికారి డి) రాష్ట్ర పాలకుడు
  జ: (సి)
  8. కుతుబ్‌షాహీ పాలకులు వజ్రాల అమ్మకంపై ఎంత శాతం పన్ను వసూలు చేసేవారు?
  ఎ) 8 బి) 12 సి) 15 డి) 20
  జ: (డి)
  9. 'బసాటిన్ సలాతిన్' అనే గ్రంథాన్ని రచించిందెవరు?
  ఎ) మీర్జా ఇబ్రహీం జుబేరి బి) ఖుర్హా సి) గేసూదరాజ్ డి) అలిపుర్సి
  జ: (ఎ)
  10. ఖాసాఖైల్ అంటే ... ?
  ఎ) సుల్తాన్ అంగరక్షక దళం బి) విదేళీ వర్తకులు సి) స్వదేశీ వర్తకులు డి) రేవులో పన్ను వసూలు అధికారులు
  జ: (ఎ)
  11. మీర్‌జుమ్లా అంటే ఎవరు?
  ఎ) ప్రధానమంత్రి బి) సైనిక మంత్రి సి) యుద్ధ వ్యవహారాల మంత్రి డి) ఆర్థిక మంత్రి
  జ: (డి)
  Posted on 23-11-2015

  డాక్ట‌ర్ ఎం. జితేంద‌ర్‌రెడ్డి