closeటీఎస్‌పీఎస్సీ > తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భం ప్రత్యేకాంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర

ఆరు సూత్రాల ప‌థ‌కం

* ఆ సూత్రాలతోనే అసలు సమస్య
* కూలిపోయిన రక్షణ కవచం
* గట్టిగా నిలబడని నాయకత్వం
* ప్రాంతీయ కమిటీ రద్దు పెద్ద నష్టం
 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. తెలంగాణ ఉద్యమంలో.. ఎన్నో ఒప్పందాలు, ప్రకటనలు ఒక ఎత్తయితే ఆరు సూత్రాల పథకం ఒక ఎత్తు. రాష్ట్ర రాజకీయ, సామాజిక సమీకరణాలను మార్చేసిన ఈ ఆరు సూత్రాల పథకం ఎలా వచ్చింది? ఏం చెప్పింది? దీని ప్రభావమేమిటి? తదితర అంశాలపై తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం..
 • వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతిపదిక స్థానిక రిజర్వేషన్లు. ఈ అంశమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనుగడకు మూలాధారం. వాటిని అమలు చేస్తామనే హామీ అన్నిరకాలుగా లభించింది. అయితే వాటిని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు రావడం.. ప్రభుత్వం అంగీకరించి, నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన వారందరినీ వెనక్కి పంపాలని నిర్ణయించడంతో ఆందోళన చెలరేగింది. ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో 'మేం పరాయి మనుషులుగా బతకాల్సిందేనా?' అంటూ ఆంధ్ర ప్రాంతవాసులు ప్రశ్న లేవనెత్తారు. స్థానికేతరులను వెనక్కి పంపడానికి ఉద్దేశించిన జీవో 36ను సవాల్ చేశారు. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టు ముందు నిలిచింది. ముల్కీ నిబంధనల్ని సమర్థిస్తూ, అవి రాజ్యాంగ బద్ధమైనవేనని, వాటిని అమలు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు ముల్కీ నిబంధనల అమలు కోసం 1972లోనే కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఓ మెలిక ఉంది. అప్పటిదాకా జరిగిన నియామకాల గురించి మరచిపోయి ఇకనుంచి జరిగేవాటికి ముల్కీ నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. అంటే 'గతం గతః' అని చెప్పారు. తద్వారా అప్పటిదాకా వచ్చిన నాన్‌ముల్కీలు స్థానికులైపోయారు. భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించారు. ఆవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం (1969) ఫలితంగా ముల్కీ నిబంధనలు తొలిసారిగా పక్కాగా అమలయ్యే అవకాశం వచ్చింది. అదికూడా ఆంధ్ర ప్రాంత నాయకులకు రుచించలేదు. 'అయితే తెలంగాణకు రక్షణలైనా రద్దు చేయాలి.. లేదంటే ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రమైనా ఇవ్వండంటూ 1972లో జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ ఉద్యమం చాలా ఉద్ధ్దృతమైన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు రాజీనామా చేయాల్సి వచ్చింది. 1973 జనవరి 10న కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. డిసెంబరు 10దాకా ఈ రాష్ట్రపతి పాలన కొనసాగింది.
 • రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న కాలంలో కేంద్రం ఇరు రాష్ట్రాల్లోని నేతలతో(ముఖ్యంగా కాంగ్రెస్) చర్చించి 1973, అక్టోబరు 1న ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించింది. ఈ ఆరు సూత్రాల పథకం అనేది అప్పటిదాకా తెలంగాణకున్న రక్షణలన్నింటినీ రద్దు చేసింది. రాష్ట్రంలో కొత్త స్థానిక రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకొచ్చింది.
 • ఆరు సూత్రాల పథకం ప్రకారం - రాష్ట్రమంతా సమానమే. వెనుకబడిన ప్రాంతాలు అన్నిచోట్లా ఉంటాయి. ఆ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి. అంటే తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా చూడాల్సిన ఆవశ్యకతను ఆరు సూత్రాల పథకం రద్దు చేసింది. 1956లో చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం - తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించి, ఇతర ప్రాంతాలతో సమానంగా ఎదగడానికి తెలంగాణకు ప్రత్యేక రక్షణలు కల్పిస్తే.. ఆరు సూత్రాల పథకం తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని తిరస్కరించింది. తెలంగాణ అస్తిత్వం పూర్తిగా పోయి ఆంధ్రప్రదేశ్.. అందులో వెనకబడిన ప్రాంతాలు అనే కొత్త సూత్రీకరణ ముందుకొచ్చింది. ఆ విధంగా తెలంగాణ అస్తిత్వానికి చట్టపరంగా గుర్తింపు లేకుండా పోయింది. ఉద్యోగాల్లో అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించాలనే ప్రాతిపదికన కొత్త వ్యవస్థలు ప్రవేశపెట్టింది. ఈ ఆరు సూత్రాలు కేవలం ప్రధానమంత్రి ప్రకటనే. వీటికి చట్టబద్ధత లేదు. దేని ప్రాతిపదికన ఈ ఆరు సూత్రాల్ని రూపొందించారు? వెనకాల ఏం జరిగిందనేది తెలియదు. ఇదంతా చీకటి కోణం. వెనకాల ఏం జరిగిందనేది ప్రజల ముందు కూడా పెట్టలేదు. కాంగ్రెస్ నేతలు తమలోతాము మాట్లాడుకొని, ప్రజల్ని భాగస్వాములను చేయకుండానే తీసుకున్న నిర్ణయాలివి.
 • రక్షణల అమలులో లోపాలనే నిలదీసి 1969లో ఉధ్ధృతంగా ఉద్యమించిన తెలంగాణ - 1973లో ఏకంగా తన రక్షణలన్నింటినీ రద్దుచేస్తే ఎందుకు ఊరుకుంది? ఉద్యమం ఎందుకు సాగించలేక పోయిందనే ప్రశ్న ఉద్భవించడం సహజం. నిజానికి తెలంగాణలో ఉద్యమం ఆగిపోలేదు. ఏదో రూపంలో ఉద్యమం నడుస్తూనే ఉంది. అయితే ముఖ్య రాజకీయ నేతలంతా కాడి కిందపారేసి, తెలంగాణ ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గాలికొదిలేయడంతో 1969 నాటి ఉద్ధృతి తెలంగాణలో లేకుండా పోయింది. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తదితర సమూహాలు కొంత ఆందోళన కొనసాగించినా వేడి మాత్రం లేకపోయింది. నిజానికి 1972లో జై ఆంధ్ర ఉద్యమం బలంగా వచ్చినప్పుడు, తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ అదేస్థాయిలో వచ్చి ఉండుంటే ఫలితం ఎలా ఉండేదో! కానీ ఆ పరిస్థితి తలెత్తలేదు.
 • ముల్కీ చట్టంపైనే వేటు

 • ఆరు సూత్రాల పథకం అమలులో భాగంగా తొలుతగా తెలంగాణ అస్తిత్వ పతాక ముల్కీ చట్టంపైనే వేటుపడింది. 1973 డిసెంబరు 28న ముల్కీ నిబంధనల చట్టాన్ని పార్లమెంటు రద్దు చేసింది. 1974 జులై 1న 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371 అధికరణను సవరించారు. 1957లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణకు ప్రత్యేక ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతికిచ్చిన అధికారాన్ని తాజా సవరణ ద్వారా తొలగించారు. అంటే తెలంగాణకు ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకున్న ప్రకరణను తొలగించి 371 (డి) అనే కొత్త ప్రకరణను రాజ్యాంగానికి జోడించారు. ఈ 371(డి)లో మొత్తం 10 అంశాలున్నాయి. ఇందులో మొదటి రెండు చాలా కీలకమైనవి. ఇవి రాష్ట్రపతికున్న అధికారాలను వివరిస్తాయి.
 • ప్రెసిడెన్షియల్ ఆర్డర్

 • 371(డి) ప్రకారం 1975 అక్టోబరు 18న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. వీటినే రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అంటారు. రాష్ట్రప్రభుత్వం మరో జీవో ద్వారా వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ జీవోలో కొన్ని కీలకాంశాలున్నాయి.
  * అన్ని ఉద్యోగాలను లోకల్ కేడర్లుగా వర్గీకరించారు. ఎల్‌డీసీ స్థాయిదాకా ఉన్న ఉద్యోగాలను జిల్లాస్థాయి ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఎల్‌డీసీ పైనున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను జోనల్‌స్థాయి ఉద్యోగాలుగా గుర్తిస్తారు. 53 విభిన్నమైన గెజిటెడ్ పోస్టులను ప్రత్యేకమైన పోస్టులుగా పేర్కొంటూ జోనల్‌స్థాయి ఉద్యోగాలని వర్గీకరించారు. మిగిలినవన్నీ రాష్ట్రస్థాయి పోస్టులు.
 • ఎవరు స్థానికులవుతారంటే...

 • అర్హత పరీక్షకు ముందు నాలుగేళ్లు ఇక్కడే చదివినవారు స్థానికులవుతారు. మరోవిధంగా అయితే ఉద్యోగ భర్తీకి జరిగే పరీక్షకు ముందు ఏడేళ్లలో ఏదైనా నాలుగేళ్లు ఎక్కడ ఉంటే ఆ జిల్లా, జోన్‌కు స్థానికులవుతారు.
  * రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా వర్గీకరించారు. తెలంగాణ జిల్లాలను 5, 6 జోన్ల కింద చేర్చారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. హైదరాబాద్ ఆరో జోన్లో భాగమైనా హైదరాబాద్‌లో కొన్ని పోస్టులను హైదరాబాద్ నగరానికి పరిమితం చేశారు (ఎంసీహెచ్ పరిధి మాత్రమే).
  * ఒక్కో కేడర్‌కు స్థానిక రిజర్వేషన్లు ఉండాలో లేదో స్పష్టం చేశారు. దీని ప్రకారం జిల్లాస్థాయి పోస్టుల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే 20 శాతం ఓపెన్ మెరిట్.
  * జోనల్ స్థాయి నాన్ గెజిడెట్ ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకు కేటాయించగా.. మిగిలిన 30 శాతం ఓపెన్ మెరిట్. జోనల్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 60 శాతం పోస్టులు స్థానికులతో భర్తీ చేయడానికి, మిగిలిన 40 శాతం ఓపెన్ మెరిట్ అవుతాయి.
  * ఆర్టికల్ 14లో వివిధ రకాల మినహాయింపులను పేర్కొన్నారు. సచివాలయం, రాష్ట్రస్థాయి విభాగాధిపతి కార్యాలయాలు, భారీ ప్రాజెక్టులు, ప్రత్యేక కార్యాలయం/వ్యవస్థలోని ఉద్యోగాలు, రాష్ట్రస్థాయి కార్యాలయం/ సంస్థలు, హైదరాబాద్ నగర పోలీసు చట్టంలో పేర్కొన్న కొన్ని పోలీసు అధికారుల ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్లు వర్తించవు.
 • అన్నీ పోయాయి..

 • ఆరు సూత్రాలు, 371(డి)ల కారణంగా తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది. ప్రత్యేక రక్షణలు లేవు. ప్రత్యేక ప్రతిపత్తి, హోదా కోల్పోయింది. అన్నింటికంటే ముఖ్యమైన నష్టమేమంటే.. ప్రాంతీయ కమిటీ రద్దు. అది ఉన్నన్ని రోజులు తెలంగాణకు జరిగిన అన్యాయాలను అడ్డుకోలేకున్నా, అన్యాయాలను లేవనెత్తడానికి, వివక్షను ఎత్తి చూపడానికి, తెలంగాణ వాదనను వినిపించడానికి ఓ వేదికగా ఉపయోగపడింది. కానీ అదిప్పుడు లేకుండా పోయింది. తెలంగాణలో ముల్కీ నిబంధనల ప్రకారం నివాస అర్హత అనేది 15 సంవత్సరాలు. కానీ కొత్త నిబంధనల ప్రకారం అర్హత 4 సంవత్సరాలే. దీని కారణంగా చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థానికులుగా మారారు. ఆ రకంగా హైదరాబాద్‌కు వచ్చిన చాలామంది స్థానికులుగా చెలామణి అయ్యారు. నివాసం లేకపోయినా నాలుగేళ్ల బోగస్ ధ్రువీకరణ పత్రాలు కూడా విరివిగా వచ్చేశాయి. దీంతో అలాంటి ధ్రువీకరణ పత్రాలు పలువురు సృష్టించుకున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టే వేదిక లేకుండా పోయింది. రక్షణలుండగానే తెలంగాణకు అన్యాయం జరిగి, అభివృద్ధి అంతంత మాత్రంగా జరిగితే - ఇక రక్షణ కవచం తొలగించాక తెలంగాణ పరిస్థితి ఏమౌతుందో ఎవరైనా ఊహించొచ్చు. తర్వాత వచ్చిన 610 జీవోనే ఉల్లంఘనలకు సజీవ సాక్ష్యంగా చెప్పొచ్చు.
 • ఆనాడు తెలంగాణ రాజకీయ నాయకత్వం పటిష్ఠంగా నిలిచి ఉంటే తెలంగాణ ఉద్యమం మరోమారు ఉద్ధృతమయ్యేది. కానీ నాయకత్వం ద్రోహం చేసి, పదవులను ఆశించడంతో అప్పుడే కాడి చేజారింది. అందుకే ఆరు సూత్రాల పథకం వచ్చినప్పుడు గానీ, 371(డి) వచ్చినప్పుడు గానీ తెలంగాణ నాయకత్వం గట్టిగా నిలబడలేదు. వాస్తవానికి ఆరు సూత్రాల పథకం జారీ అయ్యాక దాని అమలు కోసం అన్ని ప్రాంతాల కాంగ్రెస్ నేతలు కలసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అప్పుడే తెలంగాణ నేతలు గట్టిగా నిలబడితే బాగుండేది. స్థానికత విషయంలో పదిహేనేళ్ల గురించి పట్టుబట్టాల్సింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్‌లో చేరిపోయారో అప్పుడే కాంగ్రెస్ అధినాయకత్వం, ఆంధ్ర నాయకత్వం ఒత్తిడికి తలొగ్గి లొంగిపోయారు. ఆంధ్ర ప్రాంత నేతలు సాధించుకోగలిగినట్లుగా తెలంగాణ నేతలు పట్టుబట్ట లేకపోయారు. ఈ కారణంగానే ఆరుసూత్రాల పథకం రూపకల్పనలో గానీ, తర్వాత గానీ తెలంగాణకు చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లభించలేదు. వాస్తవానికి తెలంగాణ ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే - ఆయా పార్టీలు తమ పార్టీ అజెండాగా తెలంగాణ సమస్యను స్వీకరించి చర్చించే ప్రయత్నం గానీ, దాని ఆధారంగా ప్రభుత్వంతో తలపడే ప్రయత్నం గానీ ఎన్నడూ చేయలేదు. ఈ విషయంలో వామపక్షాలకు కూడా మినహాయింపునివ్వలేం. వాళ్లు కూడా స్థానిక రక్షణల విషయంలో పోరాటం గానీ, ఉద్యమం గానీ నిర్మించలేదు. అయితే అప్పుడున్న ప్రజాసంఘాలన్నీ తెలంగాణ ప్రజాసమితిలో భాగంగానే ఉండేవి. ఉద్ధృత ఉద్యమం జరిగి నాయకత్వం మోసం చేసిన తర్వాత వారు అప్పటికప్పుడు వేరుపడి ఉద్యమాన్ని మళ్లీ కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీమైన తర్వాత ప్రజల గళానికి వేదికైంది ప్రజాసంఘాలే.
 • ఆరు సూత్రాలకూ తూట్లు..

 • తెలంగాణ నాయకత్వానికున్న బలహీనత కారణంగా ఉన్న ఆరు సూత్రాల పథకానికి కూడా ఉల్లంఘనలు, తూట్లు పొడవడం ఆరంభమైంది. అవి కూడా పటిష్ఠంగా అమలు కాలేదు. ఈ రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు కాలేదు. 1984లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఎన్‌జీవోలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక నిబంధనలకు విరుద్ధంగా చాలామందిని డిప్యుటేషన్లపైనా, తాత్కాలిక పద్ధతిలో నియామకాల రూపంలో, బోగస్ ముల్కీ పత్రాలతో తీసుకొస్తున్నారని టీఎన్ జీవోలు ఆరోపించారు. కొన్ని పోస్టుల హోదా పెంచడం ద్వారా కూడా స్థానిక రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పించారు. ఇలా రకరకాల ఉల్లంఘనలు జరిగాయి. ఈ ఉల్లంఘనలపై జయభారత్‌రెడ్డి కమిటీని వేశారు. ఈ కమిటీ దాదాపు 60 వేల ఉద్యోగాల్లో స్థానికేతరులను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని తెలిపింది. ఈ నివేదికను పరిశీలించడానికి సుందరేశన్ కమిటీ వేసి అమలుకు సూచనలివ్వాల్సిందిగా కోరారు. మొత్తానికి ఉల్లంఘనలు సరిచేసే ఉద్దేశంతో 1985 డిసెంబరు 30న 610 జీవో వచ్చింది. స్థానికేతరులను వెనక్కి పంపాలనేది ఈ జీవో ప్రధాన ఆదేశం. 1996లో తెలంగాణ ఉద్యమం బలంగా తలెత్తే వరకూ.. 610 జీవోను ఎవరూ పట్టించుకోలేదు.
 • Posted on 25-10-2015