closeటీఎస్‌పీఎస్సీ > విపత్తు నిర్వహణ > ప్రిపరేషన్ పద్ధతి

విపత్తు నిర్వహణ ప్రిపరేషన్ విధానం
విస్తృత అధ్యయనం అవసరం

 • టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లో విపత్తు నిర్వహణ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) కూడా ఒక సబ్జెక్టుగా ఉంది. మిగతా సబ్జెక్టుల మాదిరిగా ఇది కూడా ప్రాధాన్యమైనదే. దీనికి ఏ విధంగా తయారు కావాలో పరిశీలిద్దాం.

  విపత్తు నిర్వహణ అంటే ఏమిటి? తెలంగాణ, భారతదేశంలో సునామీ, భూకంపం, వరదలు, కొండచరియలు విరగడం లాంటివి తరచుగా ఏయే ప్రాంతాల్లో సంభవిస్తాయి లాంటి అంశాలను చదవాలి. అలాగే సహజ సహజ విపత్తుల గురించి కూడా అధ్యయనం చేయాలి. ఇవి కలగడానికి ఒక ప్రాంత భౌగోళిక, వాతావరణ, పర్యావరణ కారకాలు, ఇవి ఆయా ప్రాంతాల్లో కలగడానికి కారణాలను గుర్తించి వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రకృతి విపత్తుల వల్ల అక్కడి ప్రజలపై, ప్రాంతంపై కలిగే ప్రభావాలు, నష్టాలు మొదలైనవి చదవాలి. గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఈ విభాగంలోనే భూకంపాలు, సునామీ, తుపానులపై ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. అభ్యర్థులు దీన్ని గమనించాలి. మానవ సంబంధ విపత్తులకు సంబంధించిన అంశాల్లో..... న్యూక్లియర్‌ ప్రమాదాలు, అణురియాక్టర్లు పేలడం, లీకేజీ, మానవుడి చర్యల వల్ల కలిగే కార్చిచ్చు, రైలు, విమాన ప్రమాదాలు, భవనాలు కూలడం, గని సంబంధ ప్రమాదాల గురించి తెలుసుకోవాలి.
  ఈ విపత్తులు వచ్చినప్పుడు తీసుకోవలసిన చర్యలు, ఇప్పటివరకు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మానవ సంబంధ విపత్తులు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో గమనించి వాటిని ప్రత్యేకంగా చదవాలి. అలాగే మానవ సంబంధ విపత్తులు సంభవించకుండా ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విపత్తు తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టాలి లాంటివి చదవాలి. ప్రకృతి సంబంధ విపత్తులను ఆధునిక సాంకేతికత ద్వారా ముందుగా తెలుసుకోవడం, వీటి గురించి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించే వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా భారతదేశం సహజ విపత్తులయిన సునామీ, వరదలు, తుపాను లాంటి వాటిని గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇలాంటి సమాచారాన్ని సేకరించి చదవాలి.
  సంవత్సరాలు, తేదీలపై ప్రత్యేక దృష్టి
  గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో విపత్తులు సంభవించిన సంవత్సరాలు, తేదీలు, చనిపోయినవారి సంఖ్య, జరిగిన నష్టం లాంటి వాటిపై ప్రశ్నలు అడిగారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రముఖ సహజ విపత్తుల్లో ఈ రకమైన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  1) 11-3-2012 నాటికి ఏదేశపు భూకంపం, సునామీవల్ల వేలాది మంది చనిపోయి ఒక సంవత్సరం అయ్యింది?
  ఎ) మెక్సికో బి) ఫిలిఫ్పైన్స్‌ సి) ఇండోనేషియా డి) జపాన్‌
  జవాబు: డి
  పదేపదే అవే ప్రశ్నలు
  గత సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని జనరల్‌స్టడీస్‌ పేపర్లలో విపత్తు నిర్వహణపై కొన్ని ప్రశ్నలు పునరావృతమయ్యాయి. ప్రతి పేపర్‌లో అడిగిన 10 నుంచి 15 ప్రశ్నల్లో కనీసం 5 ప్రశ్నలు దాదాపు అంతకు ముందు పరీక్షల్లో వచ్చినవే. కాబట్టి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా చదవాలి. కొన్నిసార్లు ఒకే ప్రశ్నను 4 నుంచి 5 సార్లు వివిధ పరీక్షల్లో అడిగారు.
  ఉదాహరణకు కింది ఉదాహరణ పరిశీలిద్దాం.
  1) విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు
  ఎ) పునర్నివాసం బి) పునర్‌ నిర్మాణం సి) నివారణ డి) పైవన్నీ
  జవాబు: డి
  భారతదేశంలో విపత్తు నిర్వహణ
  భారతదేశంలో విపత్తు నిర్వహణ గురించి ప్రత్యేక దృష్టి సారించాలి. దీనిలో అంశాలైన నేషనల్‌ డిజాస్టర్‌ మేనేమెంట్‌ అథారిటీ, దీని విధులు, చేపడుతున్న చర్యలు, దీని అధ్యక్షులు, ఏర్పడిన సంవత్సరం, విపత్తు నిర్వహణ కాంగ్రెస్‌, వరదలు, భూకంపాలపై విడుదల చేసిన పటాలు, విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే సంస్థలు అవి ఉండే చోటు, శిక్షణ కార్యక్రమాలు, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, వివిధ విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే మంత్రిత్వశాఖలు లాంటివి ఎక్కువగా చదవాలి.
  జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ కోణం
  విపత్తు నిర్వహణలో జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌ (వర్తమాన విషయాలు) కోణం కూడా ఉంది. భూకంపాలు, వరదలు, సునామీలు, వీటి ప్రభావం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి జాగ్రఫీ విషయ పరిజ్ఞానం కొంతవరకు అవసరం. అలాగే ఈ విపత్తుల వల్ల ఏ తీరప్రాంతాల్లో నష్టం జరుగుతున్నది, ఏయే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటి ప్రభావానికి గురి అవుతున్నాయి లాంటివాటి కోసం తెలంగాణతో పాటు భారతదేశ నైసర్గిక స్వరూపంపై అవగాహన అవసరం. నదులు, వాటి జన్మస్థలం, ఇవి ప్రవహించే రాష్ట్రాలు, వీటి వరదల వల్ల ఏ ప్రాంతాలు ముంపునకు గురి అవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా తెలంగాణ, భారతదేశ పటాలు పరిశీలిస్తూ చదివితే ఉపయోగం.
  ఉదాహరణ: అసోంలో ఎక్కువగా వరదలు ఏ నది వల్ల వస్తాయి/ సంభవిస్తాయి?
  ఎ) గోమతి బి) గంగా సి) బ్రహ్మపుత్ర డి) యమున
  జవాబు: సి
  గడిచిన ఒకటి రెండు సంవత్సరాల్లో దేశంలో, ప్రపంచవాప్తంగా ప్రముఖంగా సంభవించిన వరదలు, భూకంపాలు, సునామీలు లాంటి వాటిని కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో చదవాలి. ముఖ్యంగా ఏయే ప్రాంతాల్లో, ఏయే దేశాల్లో ఇవి సంభవించాయి, వీటి తేదీలు, తుపానులకు పెట్టిన పేర్లు, కలిగిన నష్టం, ప్రకృతి విపత్తులపై ప్రముఖులు రచించిన పుస్తకాలు లాంటివి కరెంట్‌ అఫైర్స్‌ అంశాలుగా పరిగణిస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
  ఉదాహరణకు: ఇటీవల ప్రచురితమైన 'నేషనల్‌ హజార్డ్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌' పుస్తక రచయిత ఎవరు?
  ఎ) రంజన్‌బసు బి) కళ్యాణ్‌ చక్రవర్తి సి) సత్యేష్‌చక్రవర్తి డి) చందన్‌ సురభిదాస్‌
  జవాబు: సి
  పదాల అర్థాలపై ప్రశ్నలు
  సునామీ, డిజాస్టర్‌, మాన్‌సూన్‌ లాంటి పదాలకు అర్థాలు, ఇవి ఏ భాషనుంచి వచ్చాయి అనే అంశాలను కూడా చదవాలి. గత పరీక్షల్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా సునామీ, భూకంపం, వరదలకు సంబంధించిన సమాచారం అన్ని కోణాల్లో సేకరించి ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రశ్నల్లో ఎక్కువ భాగం వీటినుంచే వస్తున్నాయని గమనించాలి.
  Posted on 02-09-2015