తాజా స‌మాచారం

సున్నా వచ్చినా భాషా పండితులు కావచ్చు!
* బోధించాల్సిన సబ్జెక్టుకు 30 మార్కులే
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగం వస్తే ఆ ఉపాధ్యాయులు బోధించాల్సింది తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషా సబ్జెక్టునే.. వాటిల్లో సున్నా మార్కులు వచ్చినా, ఇతర సబ్జెక్టుల్లో అర్హత మార్కులు సంపాదిస్తే చాలు.. వారు భాషా పండితులు కావచ్చు! అంటే, వారు ఏ సబ్జెక్టును బోధించవలసి ఉంటుందో దాంట్లో పరిజ్ఞానాన్ని పరీక్షించకుండా ఇతర సబ్జెక్టులకు అధిక మార్కులు ఇస్తుండటం గమనార్హం. భాషలో పట్టు లేకుంటే భవిష్యత్తులో అసలు విద్యార్థులకు ఎలా బోధిస్తారు? ఇప్పుడు అదే ప్రశ్న టెట్‌కు హాజరుకాబోతున్న అభ్యర్థులతోపాటు నిపుణులూ సంధిస్తున్నారు.
ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సార్లు టెట్ నిర్వహించారు. చివరిసారిగా 2014 మార్చి16న పరీక్ష జరిపారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ)కు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 నిర్వహిస్తారు. వీటిల్లో ఉత్తీర్ణులైతేనే డీఎస్‌సీ పరీక్ష రాయడానికి వీలవుతుంది. మొత్తం 150మార్కులకు పరీక్ష నిర్వహిస్తే ఓసీలకు 60శాతం(90 మార్కులు), బీసీలకు 50, ఎస్‌సీ, ఎస్‌టీలకు 40 శాతాన్ని అర్హత మార్కులుగా నిర్ణయించారు. భాషా పండితుల పోస్టు దక్కించుకోవాలంటే(స్కూల్ అసిస్టెంట్) టెట్-2 పేపర్‌లో ఉత్తీర్ణులు కావాలి. వీరికి నిర్వహించే మొత్తం 150మార్కుల్లో భాషా సబ్జెక్టులకు కేవలం 30మార్కులే(లాంగ్వేజ్-1) ఉంటాయి. ఆంగ్లం(లాంగ్వేజ్-2)కు 30మార్కులు, శిశు అభివృద్ధి, బోధనా పద్ధతులకు 30మార్కులు, సాంఘికశాస్త్రం/గణితం, సైన్స్‌లకు కలిపి 60మార్కులు కేటాయించారు. టెట్‌లో అర్హత సంపాదించి డీఎస్‌సీ ద్వారా ఉద్యోగం వస్తే బోధించే సబ్జెక్టుకు 30మార్కులే ఉండటాన్ని నిపుణులు కూడా తప్పుబడుతున్నారు. తెలుగు, హిందీ పండిత్ కోర్సులు చేసిన.. బీఈడీలో ఏదైనా ఒక భాష మెథడాలజీని ఎంచుకున్నవారు, బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసిన వారితోపాటు, ప్రస్తుతం భాషా పండితులుగా గ్రేడ్-2 ఉద్యోగం చేస్తున్న వారు కూడా గ్రేడ్-1 కోసం టెట్ రాయబోతున్నారు. వీరంతా కలిపి కనీసం 50వేల మంది వరకు ఉండొచ్చని అంచనా.
అభ్యంతరాలివీ...
* బోధనా పద్ధతులు, ఆంగ్లభాష పరంగా పట్టు ఎవరికైనా తప్పదు. అభ్యంతరమల్లా సాంఘికశాస్త్రం, గణితం, సైన్స్‌లపైనే. హిందీ, ఉర్దూ భాషాపండితులకు సైతం వాటికి సంబంధించి 60మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. అభ్యర్థులకు ఒకవేళ మిగతా సబ్జెక్టుల పైనా అవగాహన అవసరమనుకుంటే వాటిని 30మార్కులకు కుదించాలి. తెలుగు సబ్జెక్టుకు 60మార్కులు కేటాయించాలి.
* భాషా సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చి, మిగతా 120 మార్కుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 90మార్కులు తెచ్చుకున్నా భాషాపండిత ఉద్యోగానికి అర్హత సంపాదించినట్లే. అంటే విద్యార్థులకు బోధించాల్సిన సబ్జెక్టులో కనీస పరిజ్ఞానం లేకున్నా.. టెట్‌లో అర్హత సాధించవచ్చు.
* ఇతర రాష్ట్రాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాటికి తోడు ప్రత్యేకంగా భాషాపండిత పోస్టులున్నాయి. దాంతో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) భాషా పండిత పోస్టులను దృష్టిలో పెట్టుకోలేదు. ఆ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం ఎన్‌సీటీఈ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక పాఠ్యప్రణాళిక రూపొందించేలా కృషిచేయాలని అభ్యర్థులు, సబ్జెక్టు నిపుణులు కోరుతున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు ఏపీ ట్రైబ్యునల్‌ను ఇటీవల ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయసమ్మతమైన వీరి డిమాండును పరిశీలించాలని ట్రైబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు అభ్యర్థులు తెలిపారు.