తాజా స‌మాచారం

టెట్‌ అభ్యర్థులూ గమనించండి
* పాత హాల్‌టికెట్లను అనుమతించరు
* బ్లాక్‌ బాల్‌పాయింట్‌ కలంతోనే ఓఎంఆర్‌ గడులు నింపాలి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు హాజరుకాబోయే వారు గతంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లతో వస్తే అనుమతించరు. మే 13వ తేదీ నుంచి హాల్‌టికెట్లను పొందిన వారిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని గమనించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్‌ ఛైర్మన్‌ జి.కిషన్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్ర టెట్‌ను మే 22వ తేదీ మే 22న నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన మే 20న కన్వీనర్‌ జగన్నాథరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పేపర్‌-1కు 1,00,184 మంది, పేపర్‌-2(స్కూల్‌ అసిస్టెంట్‌)కు 2,73,310 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. బ్లాక్‌ బాల్‌పాయింట్‌ కలంతోనే ఓఎంఆర్‌ గడులు నింపాల్సి ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలు మండల, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో కూడా ఉన్నందున అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఒక రోజు ముందుగా పరీక్షా కేంద్రాలను పరిశీలించుకొని రావాలన్నారు. ఆయా మార్గాల్లో బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, డిజిటల్‌ చేతిగడియారాలు లాంటివి అనుమతించరని చెప్పారు. పరీక్ష ముగిసిన మరుసటి రోజు మే 23వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తామని కిషన్‌ తెలిపారు.

Posted on 21-5-2016