తాజా స‌మాచారం

టెట్‌లో అబ్బాయిలదే ఘనత!
* పేపర్‌-1లో 54.45, పేపర్‌-2లో 25.04 శాతం ఉత్తీర్ణత
* రెండు పేపర్లలో తొలి ర్యాంకు అమ్మాయిలకే
* జనరల్‌ అభ్యర్థుల ఉత్తీర్ణత స్వల్పం
* 21 నుంచి ఓఎంఆర్‌ పత్రం పొందేందుకు అవకాశం
* ఫలితాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్‌టెట్‌) ఫలితాల్లో అమ్మాయిలకంటే అబ్బాయిలు ఉత్తీర్ణత శాతంలో ముందు నిలిచారు. పరీక్షకు హాజరైన అమ్మాయిల సంఖ్య అబ్బాయిలకంటే ఎక్కువగా ఉన్నా ఉత్తీర్ణతలో అబ్బాయిలదే పైచేయి అయింది. మొత్తంమీద పేపర్‌-1లో ఉత్తీర్ణత శాతం పేపర్‌-2కన్నా రెట్టింపునకు పైగా ఉంది. ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్‌ జూన్ 17న విడుదల చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాని(డీఎస్‌సీ)కి అర్హత పొందాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. మే 22న 150 మార్కులకు టెట్‌ నిర్వహించారు. అందులో డీఎడ్‌ చేసినవారు పేపర్‌-1(సెకండరీ గ్రేడ్‌ టీచర్‌)కు, బీఈడీ పూర్తిచేసిన వారు పేపర్‌-2(స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు)కు హాజరయ్యారు. పేపర్‌-1కు మొత్తం 88,661 మంది హాజరుకాగా వారిలో 54.45శాతం మంది, పేపర్‌-2కు 2,51,906 మందిలో 25.04శాతం మంది అర్హత సాధించారు. ఫలితాల సీడీ విడుదల సందర్భంగా విద్యాశాఖ సంచాలకులు కిషన్‌ మాట్లాడుతూ.. టెట్‌ మార్కులకు డీఎస్‌సీలో 20శాతం వెయిటేజీ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు తమ ఓఎంఆర్‌ పత్రాలను జూన్ 21 నుంచి www.tstet.cgg.gov.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అందుకు గత టెట్‌కు రూ.20లు రుసుముగా నిర్ణయించగా ఈసారి దాన్ని రూ.15కు తగ్గించామన్నారు. ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని చెప్పారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలన్నా టెట్‌ తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
అబ్బాయిల ఉత్తీర్ణత 10శాతం అధికం
అబ్బాయిల ఉత్తీర్ణత అమ్మాయిల కంటే ఎక్కువగా ఉంది.పేపర్‌-1లో 9, పేపర్‌-2లో 11శాతం ఉత్తీర్ణతను అధికంగా సాధించారు. పేపర్‌-2లో సోషల్‌స్టడీస్‌, గణితం-సైన్స్‌ విభాగాలుంటాయి. విద్యార్హతలను బట్టి వాటికి విద్యార్థులు హాజరవుతారు. పేపర్‌-2లోని సోషల్‌స్టడీస్‌లో అబ్బాయిలు 28.77శాతం, అమ్మాయిలు 16.70శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గణితం-సైన్స్‌లో అబ్బాయిలు 34.84శాతం, అమ్మాయిలు 23.25శాతం మంది అర్హత సాధించారు.
పేపర్‌-1లో పెరుగు.. 2లో తరుగు
టెట్‌లోని పేపర్‌-1లో ఏటా ఉత్తీర్ణత పెరుగుతుండగా పేపర్‌-2లో మాత్రం భారీగా పడిపోతోంది. డీఎస్‌సీ పరీక్ష రాయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరని కేంద్రం నిబంధన విధించడంతో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా 2011లో టెట్‌ నిర్వహించారు. ఇప్పటి వరకు అయిదుసార్లు పరీక్ష జరపగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక టెట్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. 150 మార్కులకు నిర్వహించే టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులు 60% (90 మార్కులు), బీసీలు 50% (75 మార్కులు), ఎస్‌సీ, ఎస్‌టీలు, దివ్యాంగులు 40% (60) మార్కులు పొందాల్సి ఉంటుంది. ఇది డీఎస్‌సీకి అర్హత పరీక్ష. టెట్‌లో వచ్చిన మార్కులకు 20శాతం వెయిటేజీ ఇస్తోండటంతో దాన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు ప్రతిసారీ పోటీపడుతున్నారు. ఉత్తీర్ణత శాతం మాత్రం(తాజాది మినహా) పేపర్‌-1లో పెరుగుతుండగా, పేపర్‌-2లో తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
‘జనరల్‌' ఉత్తీర్ణత మరీ స్వల్పం!
పరీక్షలో ఉత్తీర్ణత శాతమే తక్కువగా ఉండగా.. వారిలో మిగతా విభాగాల అభ్యర్థులతో పోల్చుకుంటే జనరల్‌ అభ్యర్థుల ఉత్తీర్ణత మరీ తక్కువగా ఉండటం గమనార్హం. పేపర్‌-1లో జనరల్‌ అభ్యర్థులు 21.32 శాతం, బీసీ-52.62, ఎస్‌సీ-74.10, ఎస్‌టీ-54.35, దివ్యాంగులు-63.39 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-2లో (సోషల్‌, గణితం-సైన్స్‌ కలిపి) జనరల్‌-5.85 శాతం, బీసీ-20.24, ఎస్‌సీ-46.98, ఎస్‌టీ-30.98, దివ్యాంగులు-44.73 శాతం మంది అర్హత సాధించారు.


Posted on 18-6-2016