తాజా స‌మాచారం

ఏప్రిల్‌లో డీఎస్సీ!
* యథాతథంగా టెట్ నిర్వహణ
* జూన్ నాటికి ఉపాధ్యాయుల నియామకం పూర్తి
* ప్రభుత్వం సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో భాగంగా గతంలో ప్రకటించినట్లుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది. దీంతోపాటు ఏప్రిల్ నెలాఖరులో డీఎస్సీ జరిపి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కొద్ది రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ టెట్ ప్రకటన జారీ చేయడం...వరంగల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వివరణ కోరడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాని సంగతి తెలిసిందే. ఈక్రమంలో డీఎస్సీతో కలిపి టెట్ నిర్వహిస్తారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే టెట్ ప్రకటన జారీ చేసినందున దాన్ని యథాతథంగా నిర్వహించాలని....ఆ తర్వాత డీఎస్సీ జరపాలని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చింది.
మే నెలలో డీఎస్సీ ఫలితాలు..
ఏప్రిల్ 10నాటికి దాదాపు వార్షిక పరీక్షలన్నీ ముగుస్తాయి. ఈక్రమంలో ఏప్రిల్ నెలాఖరులో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని..వాటి ఫలితాలు మే నెలలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ రెండో వారంలో పాఠశాలల తిరిగి ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. డీఎస్సీ నిర్వహణకు కనీసం ఆరు నెలల ప్రక్రియ అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
మూడు నాలుగు రోజుల్లో ఖాళీల వివరాలు
రాష్ట్రంలో 10,961 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మూడు నెలల క్రితం పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. కొన్ని కొత్త పాఠశాలలను ఉమ్మడి ప్రభుత్వం నెలకొల్పినా పోస్టులను భర్తీ చేయలేదు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ ఖాళీలున్నాయి. వాటన్నింటిలోని ఖాళీల వివరాలను మూడు నాలుగు రోజుల్లో పంపాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం(నవంబరు 27) ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్, ఇతర సంక్షేమ శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. వివరాలు అందగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకొని డీఎస్సీ ప్రక్రియను ప్రారంభిస్తారు.
విద్యావాలంటీర్లు మానేస్తే వెంటనే భర్తీ
రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,500 మంది విద్యావాలంటీర్లను ప్రభుత్వం భర్తీ చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో పలు జిల్లాల్లో కొందరు ఉద్యోగం మానేసి పరీక్షలకు సిద్ధమౌతున్నారని జిల్లా విద్యాశాఖాధికారులు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో విద్యావాలంటీర్లకు గతంలో దరఖాస్తు చేసుకున్న వారి నుంచిగానీ...లేదా ఇతరులద్వారా గానీ స్థానికంగా నియమించుకునేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.