తాజా స‌మాచారం

టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వండి
* ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖి
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అనుమతి కోరుతూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఎన్నికల కమిషన్‌కు మంగళవారం లేఖ రాసింది. టెట్‌ను నిర్వహించాలని గత నెలలో నిర్ణయించిన ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడానికి మూడు రోజులకు ముందు ఎన్నికల కమిషన్ పాఠశాల విద్యాశాఖకు నోటీసు జారీ చేసింది. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయడంతో కమిషన్ వివరణ కోరింది. టెట్ కేవలం అర్హత పరీక్షేనని, ఉద్యోగ నియామకాలు దాని వల్ల జరగవని విద్యాశాఖ సమాధానమిచ్చింది. తర్వాత ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. తాజాగా టెట్ ప్రక్రియను మొదలు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అది డిసెంబరు చివరి వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్ లేఖ రాశారు.