తాజా స‌మాచారం

ఒక్కసారి ఉత్తీర్ణులైతే ఏడేళ్లు అర్హత
* టెట్‌ మార్గదర్శకాలు విడుదల
* ఏటా ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహణ
* తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు

ఈనాడు - హైదరాబాద్‌: ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’(టెట్‌) నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల ఉత్తర్వును తెలంగాణ విద్యాశాఖ డిసెంబరు 23న విడుదల చేసింది. ఏటా ఏప్రిల్‌ లేదా మేలో నిర్వహించాలని భావిస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించిన రాతపరీక్షకు హాజరుకావాలంటే తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఒకసారి టెట్‌ ఉత్తీర్ణులైతే విద్యాశాఖ సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఆ తరవాత ఏడేళ్లలో ఎప్పుడూ డీఎస్సీ నిర్వహించినా సంబంధిత రాతపరీక్షలకు హాజరుకావచ్చు.
ఇవీ మార్గదర్శకాలు..: ఐదో తరగతిలోపు పాఠశాల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన టెట్‌కు హాజరుకావాలంటే ఇంటర్మీడియట్‌తో పాటు రెండేళ్ల ప్రాథమిక విద్యాకోర్సు డిప్లొమో ఉత్తీర్ణులై ఉండాలి. 6 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల ఉపాధ్యాయ పోస్టులకు పోటీపడే అభ్యర్థి టెట్‌ రాయాలంటే డిగ్రీతో పాటు, తప్పనిసరిగా బీఈడీ పాసై ఉండాలి. డిప్లొమో లేదా బీఈడీ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్నవారూ టెట్‌ రాయవచ్చు. టెట్‌ నిర్వహణకు విద్యాశాఖ సంచాలకుడు ఛైర్మన్‌గా ఐదుగురితో కమిటీ వేశారు. విద్యాశాఖలో దీనికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
పరీక్ష రాయడానికి రెండున్నర గంటల సమయం ఇస్తారు. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో 150 బహుళ ఐశ్ఛిక ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు ఉంటుంది. డిప్లొమోవారికి ఒక పరీక్ష, బీఈడీ వారికి మరో పరీక్ష ఉంటుంది. రెండింటికి అర్హతలున్నవారు రెండూ రాయవచ్చు. ఓపెన్‌ కేటగిరీ వారు 60శాతం, బీసీలకు 50, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కనీసం 40శాతం మార్కులు వస్తేనే టెట్‌ ఉత్తీర్ణులైనట్లుగా లెక్కిస్తారు. టెట్‌ ఉత్తీర్ణులైనవారు డీఎస్సీ నిర్వహించే ఉపాధ్యాయ పోస్టుల రాతపరీక్షకు హాజరైతే 20శాతం వెయిటేజీ మార్కులిస్తారు. మిగతా 80 శాతం డీఎస్సీలో ఉంటాయి. 2010 ఆగస్టు 23కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్‌ రాయాల్సిన అవసరం లేదు.