తాజా స‌మాచారం

టెట్‌కు ఇప్పటి వరకు 1.95 లక్షల దరఖాస్తులు
* టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు శనివారం(మార్చి 26) నాటికి 1.95 లక్షల దరఖాస్తులు అందాయని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకుడు, టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రుసుం చెల్లించి ఇంకా దరఖాస్తు సమర్పించని వారు 13 వేల మంది ఉన్నారన్నారు. ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నందున సుమారు 2.80 లక్షల దరఖాస్తులు అందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసేవారు కింది అంశాలను గమనించాలని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి సూచించారు.
* అభ్యర్థులు ఉపాధ్యాయులు కావాలనుకుంటున్న సబ్జెక్టులోనే తప్పనిసరిగా టెట్ రాయాలి. టెట్ సబ్జెక్టుల్లో లాంగ్వేజ్-1 విషయంలో 10వ తరగతి వరకు చదివిన మాధ్యమంగానీ, మొదటి భాషనుగానీ ఎంచుకోవాలి.
* భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ల(లాంగ్వేజెస్) విషయంలో శిక్షణ పొందిన సబ్జెక్టును మాత్రమే లాంగ్వేజ్-1గా ఎంచుకోవాలి. అంటే హిందీ పండిత్ హిందీని, తెలుగు పండితులు తెలుగును ఎంచుకోవాలి.
* ఒకసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, లాంగ్వేజ్-1 కింద ఎంచుకున్న భాష, పరీక్ష రాయదలచిన సబ్జెక్టులు( గణితం/సైన్స్, సోషల్ స్టడీస్), పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలను మార్చరు. ఒకవేళ దరఖాస్తులో పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి తప్పులు దొర్లితే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఇతర అంశాలకు సంబంధించి మార్పులు చేయాల్సి వస్తే ఫిర్యాదు బాక్సు ద్వారా మార్చాల్సిన వివరాలు సమర్పించాలి.
* గత టెట్‌లకు సంబంధించిన హాల్ టికెట్ సంఖ్యల కోసం టెట్ వెబ్‌సైట్‌లో చూడాలి. అక్కడ లభించకుంటే టీఎస్‌టెట్ విభాగాన్ని ఫోన్‌లో (సహాయ కేంద్రం) సంప్రదించాలి.

Posted on 26-3-2016