close

ప్రిపరేషన్ పద్ధతి

టెట్‌లో మార్కుల వికాసం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన ‘టెట్‌’లో శిశు వికాసం- పెడగాజిని కీలకంగా గుర్తించి దీనికి 30 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టులో ఎక్కువమంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. శాస్త్రీయమైన పద్ధతిలో చదివితే ఈ లోపం సవరించుకోవచ్చు!
బి.ఇడి., డి.ఇడి., లాంగ్వేజ్‌ పండిట్‌ పూర్తిచేసిన వారందరూ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలంటే టెట్‌ అర్హత సాధించాలి. దీనికి డీఎస్‌సీలో 20% వెయిటేజీ కూడా ఉంది. పేపర్‌-I,పేపర్‌-IIరాసే అభ్యర్థులందరూ ప్రధానంగా మూడు పార్టులను అధ్యయనం చేయవలసి ఉంటుంది.
పార్ట్ - I: శిశు వికాసం
శిశువు సమగ్ర ప్రవర్తనాంశాలను వివరించే భాగమిది. ఇందులో ముఖ్యమైనవి పెరుగుదల- వికాసం, వికాస సూత్రాలు/ నియమాలు, వాటి అనుప్రయుక్తాలు, శిశు వికాస దశలో ముఖ్యాంశాలైన శారీర, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక అభివృద్ధి ప్రధానమైనవి.
వీటితోపాటు పియాజె సంజ్ఞాత్మక వాదం, కోల్‌బర్గ్‌ నైతిక వికాసం, నోమ్‌ చోమ్‌స్కీ భాషా వికాసం, కార్ల్‌రోజర్స్‌ ఆత్మ కేంద్రక సిద్ధాంతం, ఎరిక్‌సన్‌ సాంఘిక వికాస సిద్ధాంతం, విద్యార్థుల్లో కనబడే వైయక్తిక భేదాలు... అందులో ముఖ్యాంశాలైన ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, ఆసక్తి, ఆలోచన, సహజ సామర్థ్యాలు- వాటి మాపనం చదవాలి.
పార్ట్ - II: అభ్యసన అవగాహన
బోధన ద్వారా విద్యార్థులలో జరిగే వివిధ ప్రవర్తనా మార్పులకు సంబంధించి వివిధ మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలు ముఖ్యం. పావ్‌లోవ్‌ శాస్త్రీయ బంధనం, స్కిన్నర్‌ కార్య సాధక నిబంధనం, ధార్న్‌డైక్‌ యత్నదోష అభ్యసనం, కోహిలర్‌ అంతః దృష్టి అభ్యసనం, కోఫ్కా ప్రత్యక్ష అభ్యసనం, వైగాట్‌స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసనం, ఆల్బర్ట్‌ బండూరా పరిశీలనాభ్యసనం మొదలైనవాటి వివరణాత్మక అనుప్రయుక్తమైన అభ్యసనా బదలాయింపులపై శ్రద్ధపెట్టాలి. ఇంకా విద్యార్థిని బోధనలో అంచనా వేయడానికి అతనిలోని ప్రేరణ, స్మృతి, విస్మృతి అభ్యసనంలో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక అంశాల పరిశీలన ప్రధానమైనవి. ఈ అంశాలపై ప్రశ్నలు అధిక శాతం అవగాహన వినియోగానికి సంబంధించినవై ఉంటాయి.
పార్ట్ - III: పెడగాజి
ఉపాధ్యాయుడు కల్పించే బోధనానుభవాల వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రవర్తనా మార్పు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ విభాగాన్ని టెట్‌లో చేర్చారు. దీనిలో ప్రత్యేక అవసరాలుగల పిల్లల విద్య, శిశు కేంద్రీకృత విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు, నాయకత్వం- రకాలు, మార్గదర్శకత్వం- మంత్రణం, వివిధ బోధనా పద్ధతులు, బ్రూనర్‌ శిక్షణ సిద్ధాంతం, పిల్లల తిరస్కరణ, పిల్లలను పెంచే విధానాలు- వారి హక్కులు, జాతీయ ప్రణాళికా చట్రం- 2005,విద్యా హక్కు చట్టం- 2009 ముఖ్యమైనవి. కానీ పై అంశాల ప్రశ్నలన్నీ జ్ఞానాత్మక రంగానికి చెందినవై ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందనవసరం లేదు.
సైకాలజీ పుస్తకాల్లో లేని అంశాలు
TET Paper-I & II సిలబస్‌లో అకాడమీ సైకాలజీ పాఠ్య పుస్తకాల్లో లేని కొన్ని అంశాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. వాటిలో నోమ్‌ చోమ్‌స్కీ, కార్ల్‌ రోజర్స్‌, వైగాట్‌స్కీ సిద్ధాంతాలు అనుదైర్ఘ్య, తిర్యక్‌ పద్ధతులు ముఖ్యమైనవి. పెడగాజిలో అత్యధిక అంశాలను బయట నుంచే సేకరించుకోవాలి. వీటిలో బ్రూనర్‌ శిక్షణ సిద్ధాంతం, పిల్లల పెంపకం, పిల్లలపై అకృత్యాలు, వివిధ బోధనా పద్ధతుల నిర్వహణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం, జాతీయ ప్రణాళికా చట్రం- 2005, విద్యాహక్కు చట్టం- 2009 మొదలైనవి. వాటి కోసం ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారం సేకరించాలి.
సాధారణంగా మనో విజ్ఞానశాస్త్రాన్ని ఇతర సబ్జెక్టుల వలే చదివి మార్కులు తక్కువగా వస్తున్నాయని అభ్యర్థులు నిరుత్సాహపడుతూ ఉంటారు. ఈ కోవకు చెందినవారు దాదాపు 60-70 శాతం మంది ఉంటారు. ఈ సబ్జెక్టు ఉపాధ్యాయ శిక్షణలో మాత్రమే ఉండడం, మిగిలిన కిందిస్థాయి తరగతుల్లో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు సైకాలజీ అంటే ఒత్తిడికి గురికావడం, ముఖ్యంగా మాదిరి ప్రశ్నలను సాధన చేయకపోవడం వంటివి ఇంకొన్ని కారణాలు.
అధిక మార్కులకు మార్గాలు?
1. ప్రతి పాఠ్యాంశాన్నీ చదివి జ్ఞానాత్మక భావనలపై పట్టు సాధించి పునఃస్మరణ చేయాలి. వీటి ప్రశ్నలు విషయాన్ని నేరుగా ప్రశ్నించే జ్ఞాపకశక్తికి సంబంధించినవి కాబట్టి అంశాలను పునః స్మరించడం, పునరభ్యసించడం చేయాలి. శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన భావనలు, సిద్ధాంతాలు గ్రంధాలపై శ్రద్ద చూపాలి.
2. జ్ఞానాత్మక అంశాలను తరగతి గదికీ, విద్యార్థులకూ అనుప్రయుక్తం చేస్తూ స్థాయిని క్రమంగా పెంచుకోవాలి.
3. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి పాఠ్యాంశానికీ సంబంధించిన వీలైనన్ని ఎక్కువ ప్రామాణికమైన అవగాహన, అనుప్రయుక్తంతో కూడిన మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి.భిన్న కోణాల నుంచి ప్రశ్న అడిగినా ఈ అనుభవంతో సులువుగా జవాబు గుర్తించగలుగుతారు.
టెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అందులోని ప్రశ్నలు ప్రధానంగా జ్ఞానాత్మక అవగాహన, వినియోగరంగానికి చెందినవిగా ఉన్నాయి.
* సిలబస్‌లోని మూడు పార్టులలో మొదటి యూనిట్‌ పరిధి కాస్త అధిరకం. అందుకుగాను విషయాన్ని అర్థం చేసుకొంటూ చదవాలి.
* రెండో పార్టులో అభ్యసనానికి మాత్రం సంబంధించిన అంశాలుంటాయి. వీటిని విశ్లేషణత్మకంగా అవగాహన, పూర్తి అనుప్రయుక్తంగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
* మూడో పార్ట్‌ సాధారణ అంశాలతో కూడుకొని ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయుడు, తరగతి గదిలోని బోధన సన్నివేశం, విద్యార్థులపై గల పరిజ్ఞానంతో మార్కులు పొందవచ్చు.
* సైకాలజీలో సాంకేతిక పదాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉదా: వికాసకృత్యాలు, సహజాతాలు, సంజ్ఞానాత్మకత, సర్వాత్మవాదం, అవిపర్యయాత్మక భావనాలోపం, జీవాత్మక మార్పులు, సంచితత్వం, ఉద్గమాలు, నిర్గమాలు వంటి పదాలను ప్రత్యేకంగా చదవాలి.

Posted on 5.4.2016