close

ప్రిపరేషన్ పద్ధతి

అర్హత పరీక్షలో... అధిక మార్కులు ఎలా?
బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రకటన ఇటీవల విడుదలైంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో దీనికి 20% వెయిటేజీ కూడా ఉంది. ఈ పరీక్షలో ఎక్కువ మార్కులు పొందడానికి ఎలా సన్నద్ధత సాగించాలో పరిశీలిద్దాం.
టెట్‌ సిలబస్‌, ప్రశ్నపత్రం తీరును మొదట పరిశీలించాలి. పేపర్‌- 1, 2లను మొత్తం 5 విభాగాలుగా విభజించారు.
పరీక్షలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌- పెడగాజి విభాగం అత్యంత కీలకం. సాధారణంగా అభ్యర్థులందరూ ఈ విభాగం నుంచి అత్యధిక మార్కులు పొందలేమనే భావనలో ఉంటారు. కానీ ప్రణాళికబద్ధంగా సన్నద్ధత కొనసాగిస్తే అత్యధిక మార్కులు పొందవచ్చు. సిలబస్‌ ప్రధానంగా 3 విభాగాలు: శిశువికాసం, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం, పెడగాజి.
* బాలల వికాసానికి సంబంధించిన మనోవిజ్ఞానపరమైన అంశాలను గతంలో ఎప్పుడూ చదివి ఉండరు. కాబట్టి ఈ విభాగంపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఇందులో యూధ జీవనం, అవిపర్యయాత్మక భావన, సామీప్య వికాస మండలం, సర్వాత్మవాదం, స్కఫోల్డింగ్‌ ఉద్గమాలు, నిర్గమాలు, సహజాతాలు, వికాసకృత్యాలు లాంటి పదాలను క్షుణ్ణంగా అభ్యసించాలి.
* ప్రతిరోజూ నిర్ణీత సమయాన్ని కేటాయించి సంక్లిష్ట పదాలకు సొంత నోట్స్‌ను అనుప్రయుక్తంగా తయారు చేసుకోవాలి. దీంతోపాటు వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి.
* ఈసారి ప్రశ్నల సరళి గత టెట్‌ కన్నా భిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు. జ్ఞానాత్మకంగా అంశాలకు ప్రాధాన్యం క్రమంగా తగ్గి, అవగాహన, వినియోగ స్థాయి ప్రశ్నలకు ప్రాధాన్యం పెరగడం గమనించాలి.
తెలుగు
* తెలుగులో అనేక అంశాల మధ్యగల సారూప్యత వల్ల అభ్యర్థి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా సామెతలు, జాతీయాల మధ్య ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇవి చూడటానికి రెండూ ఒకేలా ఉంటాయి. సూక్ష్మ భేదాన్ని పరిశీలించగలిగితే వాటి తేడాను గుర్తించవచ్చు.
* వ్యాకరణాంశాల్లో సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కాస్త సూక్ష్మదృష్టితో పరిశీలించవలసి ఉంటుంది.
* వ్యాకరణాంశాల మధ్య తేడాలను గమనిస్తూ సొంత నోట్సు తయారు చేసుకోవడం లాభిస్తుంది. దీంతోపాటు పాత ప్రశ్నపత్రాల పరిశీలనా చేయాలి.
ఆంగ్లం
* ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని రోజువారీ ప్రణాళిక ప్రకారం సన్నద్ధత కొనసాగించాలి.
* ఈ విభాగానికి ఎక్కువ సాధన అవసరం. కాబట్టి వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
* ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌లో ఎక్కువశాతం మంది తప్పు చేస్తుంటారు. దీనికి కారణం ప్రామాణికమైన పుస్తకాన్ని ఎన్నుకోకపోవడమే. ఈ విషయంలో జాగ్రత్త అవసరం.
గణితం
* కంటెంట్‌ విషయంగా పరిశీలిస్తే గణితానికి టెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందాలంటే సిలబస్‌పై పట్టుతోపాటు ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ఉండాలి.
* సమస్యల సాధనకు ఎక్కువ సమయం పడుతుంది.అధిగమించడానికి సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం, వర్గాలు, వర్గమూలాలు, సూక్ష్మీకరణ అంశాలను వేగంగా చేయాలి.
* 20 వరకు ఎక్కాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీనివల్ల 60% వేగంగా ప్రశ్నలను సాధించగలరు.
* గణితేతర అభ్యర్థులు తప్పనిసరిగా గణితాన్ని రోజూ సాధన చేయాలి. మేథ్స్‌ నేపథ్యం కలిగినవారు సాధనకు తక్కువ సమయాన్ని కేటాయించి మార్కులను నష్టపోతున్నారని గమనించాలి.
సామాన్యశాస్త్రం
* అకాడమీ పుస్తకాలు ఈ విభాగంలో ఎక్కువ మార్కుల సాధనకు సహకరిస్తాయి. వాటిని వీలైనన్ని ఎక్కువసార్లు చదవడం మేలు. మార్కెట్‌లో లభించే మెటీరియల్‌పై ఆధారపడితే మార్కులను కోల్పోవాల్సి వస్తుంది.
* సాంకేతిక పదాలు, సంకేతాల విషయంలో అధికశాతం మార్కులను కోల్పోతున్నారు. దీనికి పునశ్చరణ చాలా అవసరం. లేదంటే పరీక్షలో తికమకపడే అవకాశం ఉంది.
* గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు పాఠశాల స్థాయి పఠన గ్రంథాల నుంచే వచ్చాయని తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాలి.
సాంఘిక శాస్త్రం
* భౌగోళికశాస్త్రంలో పటాల అధ్యయనం పాఠ్యాంశాన్ని ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తుంది. కాబట్టి, మ్యాపులు, గ్లోబు లేకుండా భౌగోళికశాస్త్ర అధ్యయనం పూర్తికాదని గమనించాలి.
* చరిత్రను చదవడంలో కాలక్రమణ పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ.. వివిధ సంఘటనలు, యుద్ధాలు-సంధులు (ఒడంబడికలు), రాజుల పరిపాలన, రాజకీయ పరిణామాలకంటే సామాజిక, ఆర్థిక పరిస్థితులను బాగా అధ్యయనం చేయాలి.
* ఈమధ్య ఏ పోటీపరీక్షలోనైనా పౌరశాస్త్ర అంశాలన్నీ కరెంట్‌ ఇవెంట్స్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి సబ్జెక్టుకు వర్తమానాంశాలను జోడించి, చదువుకోవాలి.
* అర్థశాస్త్ర విభాగాన్ని చాలామంది క్లిష్టతరంగా భావిస్తారు. ఇది సరైన భావన కాదు. ఈ సమస్యను అధిగమించాలంటే మొదట ప్రాథమిక భావనలపై పట్టు సాధించి ఉదాహరణలతో అనుసంధానిస్తూ చదవాలి.
మెథడాలజీ
ఇతరుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే ఈ విభాగంపై దృష్టిసారించడం తప్పనిసరి. ఇందులో లక్ష్యాలు- స్పష్టీకరణలు, విలువలు - ఉద్దేశాలు, విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు (ఆగమన, నిగమన, సంశ్లేషణ- విశ్లేషణ, అన్వేషణ, ప్రకల్పన, ప్రయోగ, క్రీడ, సాంఘిక ఉద్గార, వనరుల పద్ధతులు) సామాన్య, సాంఘిక శాస్త్రాల సహసంబంధం, స్వభావ అంశాలతోపాటు ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం ముఖ్యమైనవే.
గుర్తుంచుకోవాల్సినవి
గణిత, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లోని లక్ష్యాలు-స్పష్టీకరణల అధిక సారూప్యత వల్ల ఎక్కువ తప్పులు చేస్తున్నారు. దీన్ని అధిగమించడానికి ముందు సబ్జెక్టులోని అంశాలను ముందుగానే వేరుచేసి, సొంత నోట్సు తయారు చేసుకోవాలి.
* పేపర్‌-1, 2ల్లోని మెథడ్స్‌లోని అంశాలను సహ సంబంధం, సారూప్యత ధర్మాల ఆధారంగా కలిపి చదవడం ఎక్కువ లాభిస్తుంది.
* సాధారణ సబ్జెక్టుల్లా సైకాలజీని బట్టీ విధానం ద్వారా కాకుండా భారత్వం ప్రకారం విశ్లేషణాత్మకంగా, నిర్ణీత కాలక్రమణ పట్టికతో చదువుతూ మంచి స్థాయి ఉన్న మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. గందరగోళానికి గురికాకుండా ఎక్కువసార్లు చదవడం ద్వారా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
* పరీక్ష సమయం తక్కువగా ఉంది. కాబట్టి మార్కుల కేటాయింపు ప్రాధాన్య క్రమాన్ని గుర్తించి దానిని అనుసరించి సమయాన్ని కేటాయించుకోవడం ముఖ్యం.
* మెథడాలజీలో లక్ష్యాలు, స్పష్టీకరణల మధ్య సహసంబంధాన్ని గుర్తించడం ద్వారా మార్కులను పొందవచ్చు.
* అభ్యర్థులు తమకు పట్టున్న మెథడాలజీని మొదట చదివిన తర్వాత మిగిలినవాటిని చదవడం వల్ల బదలాయింపు ద్వారా అభ్యసనం సులభతరమవుతుంది.
* పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి పరీక్షకు ముఖ్యమైనవి, ముఖ్యంకాని అంశాలు అంటూ ఉండవు. ఒక తప్పు సమాధానం తుది ఎంపికలో ఉద్యోగానికి దూరం చేయవచ్చు. కాబట్టి ప్రతీ అంశం పట్ల జాగ్రత్త వహించాలి.
* సన్నద్ధతకు ముందు సిలబస్‌ను పూర్తిగా చదివి, అర్థం చేసుకుని ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే నిర్ణయానికి రావాలి. ఇదే సగం విజయాన్ని అందిస్తుంది.
* సైకాలజీకి అకాడమీ పుస్తకంపైనే ఆధారపడకూడదు. ప్రభుత్వం ప్రకటించిన సిలబస్‌ను పరిశీలించి తదనుగుణంగా మంచి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి.
* గణితం, చరిత్ర, భూగోళశాస్త్రం, జీవశాస్త్రాల్లో సిలబస్‌ ఎక్కువ. పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను పరిశీలించి మొదట ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే సమయం, శ్రమ ఆదా అవుతాయి.
* రోజుకు ఒక సబ్జెక్టే చదవకుండా నిర్ణీత సమయం ప్రకారం అన్ని సబ్జెక్టులనూ చదవడం మంచిది.
ముఖ్యమైన తేదీలు
* ఫీజు ఆన్‌లైన్‌ చెల్లింపు: 22.06.2017 వరకు
* అప్లికేషన్‌ ఆన్‌లైన్‌ సమర్పణ: 23.06.2017
* వెబ్‌సైట్‌: http://tstet.cgg.gov.in
* హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: 17.07.2017 నుంచి
* పరీక్ష తేదీ: 23.07.2017
* ఫలితాల వెల్లడి: 05.08.2017

Posted on 19.06.2017