చేరువలో దూరవిద్య!

అనేక సమస్యలు.. ఆర్థిక ఇబ్బందులు.. మధ్యలో ఆపేసిన వాళ్లు, అసలు చదువుకోని వాళ్లు... మొదట్లో చదువును నిర్లక్ష్యం చేసి తర్వాత జ్ఞానోదయమైన వాళ్లు.. వీళ్లందరికీ నచ్చిన కోర్సులో తక్కువ ఖర్చుతో డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లను అందిస్తున్నాయి దూరవిద్యా కేంద్రాలు. ప్రతి పౌరుడినీ అక్షరాస్యుడిని చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటి నుంచే ప్రాథమిక విద్య నుంచి పీహెచ్‌డీ వరకు పట్టాలు పుచ్చుకోవచ్చు.
దూరవిద్య ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చాలా దగ్గరైంది. రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా విస్తరిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి పీహెచ్‌డీ వరకు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసమే ప్రత్యేకంగా కొన్ని విశ్వవిద్యాలయాలు ఆవిర్భవించాయి. దాదాపు ప్రతి యూనివర్సిటీలోనూ దూరవిద్యా విభాగం ఉంది. ఈ సర్టిఫికెట్లను రెగ్యులర్‌తో సమానంగా గుర్తిస్తున్నారు. అందువల్ల కాలేజీలకు వెళ్లి చదవడం సాధ్యం కానివారు దర్జాగా దూరవిద్యలో చేరిపోవచ్చు. ఇగ్నో, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పలు ప్రైవేటు విద్యాసంస్థలు దూరవిద్యను అందిస్తున్నాయి.
ఓపెన్‌ స్కూలింగ్‌
బడికి వెళ్లి చదువుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం..ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు. వీరి కోసమే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) ఆవిర్భవించింది. పౌరులందరినీ విద్యావంతులు చేయాలనే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. ఇప్పుడున్న వయోజనుల్లో ఎందరో నిరక్షరాస్యులు ఉన్నారు. వారుకూడా ఓపెన్‌ స్కూల్‌ బాట పట్టవచ్చు. ప్రైమరీ (ప్రాథమిక), సెకండరీ (హైస్కూల్‌), సీనియర్‌ సెకండరీ (ఇంటర్మీడియట్‌) విద్యను ఈ విధానంలో పూర్తి చేయవచ్చు. రెగ్యులర్‌ చదువులకు సమానమైన గుర్తింపు ఈ విద్యా విధానానికి ఉంది. ఫీజులు తక్కువగానే ఉంటాయి. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే కోర్సులో చేరిపోవచ్చు. పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. సంబంధిత కోర్సు అయిదేళ్లలోగా ఎప్పుడైనా పూర్తిచేసుకోవచ్చు. ఈ వ్యవధిలో తొమ్మిదిసార్లు పరీక్ష రాసుకోవచ్చు.
సెకండరీ కోర్సుల్లో ప్రవేశానికి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే జులై 1 నాటికి 14 ఏళ్లు నిండాలి. సీనియర్‌ సెకండరీ కోర్సుల్లో ప్రవేశానికి సెకండరీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. జులై 1కి పదిహేనేళ్లు పూర్తవ్వాలి. సెకండరీ కోర్సులను తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ మొదలైన మాధ్యమాల్లో చదువుకోవచ్చు. సీనియర్‌ సెకండరీ కోర్సులు తెలుగు మీడియంలో అందించడం లేదు. అయిదు పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధిస్తే కోర్సు పూర్తవుతుంది. విద్యార్థులు అదనంగా మరో రెండు సబ్జెక్టులను తీసుకోవచ్చు. అది తప్పనిసరి కాదు. గరిష్ఠంగా ఏడు సబ్జెక్టులు చదువుకోవచ్చు.
అయిదేళ్లు నిండిన 14 ఏళ్ల లోపు బాలలకు, నిరక్షరాస్యులకు ఓపెన్‌ బేసిక్‌ ఎడ్యుకేషన్‌ (ఓబీఈ) పేరుతో ఏ, బీ, సీ అనే మూడు కోర్సులు ఉన్నాయి. ఇందులో ‘ఎ’ లెవెల్‌ మూడో తరగతి స్థాయి, ‘బి’ అయిదో తరగతి, ‘సి’ ఎనిమిదో తరగతికి సమానం. ఈ లెవెల్స్‌ తర్వాత సెకండరీ, అనంతరం సీనియర్‌ సెకండరీ కోర్సులు చేయవచ్చు.
వర్చువల్‌ ఓపెన్‌ స్కూలింగ్‌: ఎన్‌ఐఓఎస్‌లో వర్చువల్‌ విధానంలో ఆరు నెలల వ్యవధితో అగ్రికల్చర్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీలో సర్టిఫికెట్‌ కోర్సు అందిస్తున్నారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు ఫీజు రూ.1500. అలాగే పది అర్హతతో ఐసీటీ అప్లికేషన్స్‌లో 6 నెలల వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఫీజు రూ.3000.
ఒకేషనల్‌ కోర్సులు: సెకండరీ స్థాయిలో కార్పెంట్రీ, సోలార్‌ ఎనర్జీ టెక్నీషియన్‌, బయో గ్యాస్‌ ఎనర్జీ టెక్నీషియన్‌, బ్యాకరీ అండ్‌ కన్ఫెక్షనరీ, వెల్డింగ్‌ టెక్నాలజీ, టైప్‌ రైటింగ్‌ కోర్సులు ఉన్నాయి. సీనియర్‌ సెకండరీలో స్టెనోగ్రఫీ, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, హౌస్‌ కీపింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, క్యాటరింగ్‌ మేనేజ్‌ మెంట్‌, హోటల్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌, పౌల్ట్రీ ఫార్మింగ్‌, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌, ఫర్నిచర్‌ అండ్‌ క్యాబినెట్‌ మేకింగ్‌, ఎల‌్రక్టోప్లేటింగ్‌ తదితర కోర్సులు ఉన్నాయి. కోర్సును బట్టి వ్యవధి ఆరు నెలలు లేదా ఏడాది ఉంటుంది. యోగా టీచర్‌ ట్రైనింగ్‌, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ మొదలైన డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు.
చివరి తేదీ: అపరాధ రుసుం లేకుండా జులై 31, రూ.700 అపరాధ రుసుంతో సెప్టెంబరు 17 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. www.nios.ac.in
తెలుగు రాష్ట్రాల్లో: ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ, తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీల ద్వారా సెకండరీ, సీనియర్‌ సెకండరీ కోర్సుల్లో చేరవచ్చు. వీటికి సంబంధించిన అర్హతలు, వయసు అన్నీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) మాదిరిగానే ఉంటాయి. వీటిలోనూ ఓపెన్‌ బేసిక్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు ఉన్నాయి. జులై / ఆగస్టులో ప్రవేశాలకు ప్రకటన వెలువడుతుంది.
నేరుగా డిగ్రీలోకి
విద్యార్హతలతో సంబంధం లేకుండా, ఏ విద్యార్హతలూ లేనివారు నేరుగా డిగ్రీ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఇందుకోసం 18 ఏళ్లు నిండి, అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఈ విధానంలో ప్రవేశానికి బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రకటన వెలువడింది. జూన్‌ 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 24న ప్రవేశపరీక్ష ఉంటుంది. ఈ యూనివర్సిటీలో సాధారణ డిగ్రీ (బీఏ) కోర్సులను కేవలం రూ.6000 ఫీజుతో పూర్తిచేయవచ్చు. నేరుగా డిగ్రీలో ప్రవేశానికి ఆంధ్రా యూనివర్సిటీ ప్రకటన వెలువడింది. జులై 2లోగా దరఖాస్తు చేసుకోవాలి
వీటిని గమనించాలి
దూరవిద్య అందిస్తున్న విశ్వవిద్యాలయం / సంస్థకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) / ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) గుర్తింపు ఉండడం తప్పనిసరి. దీంతోపాటు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ) గుర్తింపు ఉండాలి. కేవలం సంస్థకు గుర్తింపు ఉంటే సరిపోదు. ఆ సంస్థ నిర్వహిస్తున్న కోర్సుకూ గుర్తింపు ఉండాలి. పరీక్ష కేంద్రం, స్టడీ సెంటర్‌ అందుబాటులో ఉండడం, స్టడీ మెటీరియల్‌ నాణ్యత, కాంటాక్ట్‌ తరగతుల నిర్వహణ, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం సరళంగా ఉండడం, అందుబాటు ధరల్లో ఫీజులు ఉండే సంస్థను ఎంచుకోవాలి.
ఇగ్నో
దూరవిద్య ప్రస్తావనలో ప్రథమంగా గుర్తొచ్చేది ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో). ఇక్కడ లేని కోర్సు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎవరు ఏ కోర్సులో చేరాలనుకున్నా ఇగ్నో చిరునామాగా నిలుస్తుంది. తక్కువ ఫీజు, నాణ్యమైన స్టడీ మెటీరియల్‌, అందుబాటులో అధ్యయన కేంద్రం ఉండడం దీని ప్రత్యేకత. ప్రపంచంలోనే దూరవిద్య విధానంలో ఇగ్నో ఒక విశిష్ట సంస్థగా గుర్తింపు పొందింది. సర్టిఫికెట్‌, డిప్లొమా, యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఇలా అన్ని విభాగాల్లోనూ అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోంది. ఏడాదికి రెండు సార్లు జనవరి, జులైలో నోటిఫికేషన్లు వస్తాయి. ఇక్కడ బీఏ, బీకాం కోర్సులకు ఏడాదికి రూ.2400 చొప్పున ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అదే బీఎస్సీ కోర్సుకైతే రూ.4200 చెల్లించాలి. వెబ్‌సైట‌: www.ignou.ac.in
సందేహాలు - సమాధానాలు
* దూరవిద్యలో డిగ్రీ చదివితే పోటీ పరీక్షలకు అర్హత ఉంటుందా?
దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసినవారు అన్ని పోటీ పరీక్షలకూ అర్హులే. ఈ అర్హతతో యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (సీడీఎస్‌ఈ) రాసుకోవచ్చు. బ్యాంక్‌ పీవో, క్లర్క్‌, రైల్వేలో ఏఎస్‌ఎం, గూడ్స్‌ గార్డు, రిజర్వేషన్‌ కమ్‌ ఎంక్వైరీ క్లర్క్‌ తదితర పోస్టులకు, కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్ష, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గ్రూప్‌ -1, గ్రూప్‌ -2, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ మొదలైన పరీక్షలన్నింటికీ పోటీ పడవచ్చు.
* బీటెక్‌, లా కోర్సులు దూరవిద్యలో చదవడానికి వీలుందా?
బీటెక్‌ / బీఈ, మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులను దూరవిద్యలో చదువుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం లేదు. అయితే ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌)తో సమానమైన డిగ్రీని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ద్వారా చదువుకోవచ్చు. ఇక్కడ కోర్సు పూర్తిచేసుకున్న వారికి అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ (ఏఎంఐఈ) డిగ్రీని ప్రదానం చేస్తారు. బీఈ / బీటెక్‌లతో సమాన గుర్తింపు ఉన్న కోర్సు ఇది. ఈ డిగ్రీతో యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌), ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గేట్‌లతోపాటు డిగ్రీ అర్హతతో ఉండే అన్ని పోటీపరీక్షలకూ హాజరుకావచ్చు. ఎల్‌ఎల్‌బీ కోర్సును దూరవిద్యలో కొనసాగించడానికి బార్‌ కౌన్సిల్‌ అనుమతించడం లేదు. కాబట్టి సాధ్యం కాదు. ఎల్‌ఎల్‌ఎంను కొన్ని యూనివర్సిటీలు దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.
* పదోతరగతి, ఇంటర్మీడియట్‌ లేకుండా డిగ్రీ దూరవిద్యలో చదివితే అన్ని పోటీ పరీక్షలకు, కోర్సుల్లో ప్రవేశానికి అర్హత లభిస్తుందా?
టెన్త్‌, ఇంటర్‌ చదవకపోయినప్పటికీ దూరవిద్య ద్వారా నేరుగా డిగ్రీ కోర్సు పూర్తిచేసినవాళ్లు అన్ని పరీక్షలకూ పోటీపడవచ్చు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు కావాలనుకున్నవారు 10+2 విధానంలో చదవాల్సిందే. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 10+2+3 విధానం తప్పనిసరి. న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోసం 10+2, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 10+2+3 విధానంలో చదివుండాలి.
* డిగ్రీ రెండేళ్లు రెగ్యులర్‌గా చదివిన తర్వాత ఉద్యోగం వస్తే మూడో ఏడాది కోర్సు దూరవిద్యలో ఆ ఒక్క ఏడాది చదువుకోవచ్చా? లేదంటే మళ్లీ మొదటి నుంచి చదవాల్సిందేనా?
అనుకోని కారణాలతో డిగ్రీ మధ్యలో ఆపేసినవాళ్లు తిరిగి ప్రథమ సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. రెండేళ్ల కోర్సు పూర్తిచేసి ఉంటే మూడో సంవత్సరం కోర్సు దూరవిద్యలో చేరి పరీక్షలు పాసై సర్టిఫికెట్‌ పొందవచ్చు. ఈ సౌలభ్యాన్ని పలు యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి.
* దూరవిద్యలో ఇగ్నో నుంచి సైకాలజీ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌ ఒకే విద్యా సంవత్సరంలో చేరవచ్చా? ఒకే విద్యా సంవత్సరంలో రెండు కోర్సులకు అనుమతి ఉందా?
ఒకే విద్యా సంవత్సరంలో దూరవిద్యలో రెండు డిగ్రీలు చేయడానికి అధికారికంగా అనుమతి లేదు. ఒక డిగ్రీతోపాటు మరో సర్టిఫికెట్‌ కోర్సును లేదా కొన్ని రకాల డిప్లొమాలను ఏకకాలంలో చేసుకోవచ్చు.
* మూడేళ్ల డిగ్రీ కోర్సు కేవలం ఒక్క ఏడాదిలో పూర్తిచేసుకోవడానికి వన్‌ సిటింగ్‌ విధానంలో చదువుకోవచ్చా? ఇలాంటి డిగ్రీలు చెల్లుబాటు అవుతాయా?
మూడేళ్ల కోర్సును ఒకే ఏడాదిలో పూర్తిచేసుకోడానికి అనుమతి లేదు. వన్‌ సిటింగ్‌ ప్రకటనలు చూసి మోసపోవద్దు. చేరితే సమయం, డబ్బులు రెండూ వృథా.
* పోటీపరీక్షలు, ఇంటర్వ్యూల్లో దూరవిద్యలో చదివినవారితో పోలిస్తే రెగ్యులర్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందా? నిజమేనా?
అది అపోహ మాత్రమే. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో రెగ్యులర్‌, దూరవిద్య ఇద్దరికీ సమాన ప్రాధాన్యమే ఉంటుంది. మెరుగైన ప్రతిభ చూపినవారికి రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. ప్రైవేటు నియామకాలకు సంబంధించి ప్రకటనలో దూరవిద్యలో కోర్సు చేసినవారికి అవకాశం లేదని స్పష్టం చేస్తే తప్ప అక్కడ కూడా రెగ్యులర్‌, దూరవిద్య ఇద్దరికీ సమాన ప్రాధాన్యమే ఉంటుంది.
* సైన్స్‌ డిగ్రీల కోసం రెగ్యులర్‌గా చదవాల్సిందేనా? దూరవిద్యలో చదువుకుంటే సమయం, డబ్బులు ఆదా అవుతాయి కదా?
దూరవిద్య రెగ్యులర్‌ విద్యకు పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు. సైన్స్‌ కోర్సులైన కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ మొదలైన వాటిని అవకాశం ఉన్నవారంతా రెగ్యులర్‌గా చదవడమే మంచిది. ప్రాక్టికల్స్‌, ల్యాబ్‌తో ముడిపడి ఉండే కోర్సులను నేరుగా చదువుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. దూరవిద్యలోనూ ల్యాబ్‌, ప్రాక్టికల్స్‌ మొదలైనవి ఉంటాయి. అయితే ఆ సౌలభ్యం పరిమితంగా ఉంటుంది. అందువల్ల అవకాశం ఉన్నవారు రెగ్యులర్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరితేనే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అలా చదవడం వీలు కానివారే దూరవిద్యను ఆశ్రయించడం మంచిది.

దేశ‌వ్యాప్తంగా దూర విద్య‌ను అందిస్తోన్న విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌లు