నోటిఫికేషన్

రుణాల పర్యవేక్షణకు 200 కొలువులు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 200 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌- క్రెడిట్‌ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదలయింది. ఐబీపీఎస్‌తో సంబంధం లేకుండా నేరుగా ఈ పోస్టులను బ్యాంకే భర్తీ చేస్తుంది. స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల కేటగిరీకి చెందిన వీటిని దరఖాస్తు చేసుకోవడానికి 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారెవరైనా అర్హులే. ఈ కొలువులకెలా సిద్ధం కావాలో పరిశీలిద్దాం! క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టుకు సంబంధించిన సబ్జెక్టుపై ప్రొఫెషనల్‌ నాలెడ్జి ప్రశ్నలుంటాయి. ఆర్థికం, బ్యాంకింగ్‌ వ్యవహారాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. 50 ప్రశ్నలకు 100 మార్కులు కాబట్టి ఇది కీలకమైనది.

క్రెడిట్‌ ఆఫీసర్లు స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కేటగిరీలో ఎంపికవుతారు. పదోన్నతులతో అదే కేటగిరీలో స్కేల్‌-4 వరకూ కొనసాగుతారు. ఆ తరువాత ఇతర జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్ల మాదిరిగానే ఇతర ఉన్నత స్కేల్‌ గ్రేడ్‌లకు చేరుకుంటారు. క్రెడిట్‌ ఆఫీసర్ల ప్రారంభ నెలసరి వేతనం రూ.45 వేలకు పైగా ఉంటుంది. లోన్‌ ఆఫీసర్లుగా కూడా పిలిచే ఈ అధికారులు రుణ సంబంధిత వ్యవహారాలను చూస్తుంటారు. సంస్థలు, వ్యక్తులకు ఇచ్చే వివిధ రకాల రుణవ్యవహారాల పర్యవేక్షణ వీరి విధి. రుణాలు కోరుకునేవారి దరఖాస్తులు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకు నిర్దేశించిన ప్రకారం సక్రమంగా ఉన్నాయో లేదో వీరు చూస్తారు. ఆమోదించిన రుణాలు సకాలంలో దరఖాస్తుదారులకు విడుదలయ్యేలా చూడటం, వాటిని తిరిగి సక్రమంగా చెల్లించేలా చూడటం తద్వారా నాన్‌ పర్‌ఫార్మింగ్‌ రుణాలను తగ్గించడం వంటివి పర్యవేక్షిస్తారు.

ఎంపిక విధానం
* అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ రాతపరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌ (ఒకవేళ నిర్వహిస్తే) &/ పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉంటుంది. ఏమేం నిర్వహించాలో బ్యాంకు తర్వాత నిర్ణయిస్తుంది.
* అవసరమైతే బ్యాంకు ఆన్‌లైన్‌ పద్ధతిలో రాతపరీక్షను నిర్వహించే అవకాశముంది. దీనిలో ఒక్కోటి 50 ప్రశ్నలతో కూడిన నాలుగు విభాగాలు మొత్తం 200 ప్రశ్నలతో అంతే సంఖ్యలో మార్కులతో ఉంటాయి. వీటిలో రీజనింగ్‌కు 25 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు 25 మార్కులు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు 100 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన వాటిల్లో 25% మార్కులను తీసివేస్తారు.
* రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 50 మార్కులతో కూడిన పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనిలో కనీసం 25 మార్కులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్‌ కేటగిరీవారికి 22.5 మార్కులు వస్తే సరిపోతుంది.

సన్నద్ధతకు ఇదీ తీరు
రాతపరీక్ష పీఓ తరహాలో ఉంటుంది. ప్రశ్నలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

రీజనింగ్‌: దీనిలోని అంశాలను జనరల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌లుగా చూడవచ్చు. డేటా సఫిషియెన్సీ నుంచి కూడా ప్రశ్నలుంటాయి. పీఓ స్థాయిలోని పరీక్షల్లో అనలిటికల్‌/క్రిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అన్నిట్లోనూ ఎక్కువ సమయం తీసుకునే సబ్జెక్టు కావడంతో అభ్యర్థులు దీన్ని కాస్త కఠినంగా భావిస్తారు. అయితే బాగా నేర్చుకుని ఎక్కువగా సాధన చేస్తే వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగే విభాగమిది. దీనిలో దాదాపు సగం ప్రశ్నలు డేటా ఇంటర్‌ ప్రెటేషన్‌ నుంచి వస్తాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజి: గ్రామర్‌, ఒకాబులరీ, కాంప్రహెన్షన్‌ల నుంచి సాధారణంగా ప్రశ్నలు వస్తాయి. 30-40 శాతం ప్రశ్నలు గ్రామర్‌ ఆధారంగా ఉండొచ్చు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఎస్సేను వేగంగా చదివేలాగా అభ్యాసం చేయాలి. ప్రశ్నలను ఎస్సే కంటే ముందే చదవటం ప్రయోజనకరం.

ప్రొఫెషనల్‌ నాలెడ్జి: క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టుకు సంబంధించిన సబ్జెక్టుపై ప్రశ్నలుంటాయి. ఆర్థికం, బ్యాంకింగ్‌ వ్యవహారాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. 50 ప్రశ్నలకు 100 మార్కులు కాబట్టి ఇది కీలకమైనది.

సాధన.. సాధన
ఆన్‌లైన్‌ రాతపరీక్షను నవంబర్‌ 25న నిర్వహిస్తారు. దాదాపు 40 రోజుల సమయముంది. ప్రస్తుతం ఐబీపీఎస్‌ పీఓ, క్లర్క్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సన్నద్ధమైతే సరిపోతుంది. ఇతర సబ్జెక్టులకు ప్రత్యేకంగా తయారవ్వాల్సిన అవసరం లేదు. మొదటిసారి పరీక్ష రాసేవారు మాత్రం అన్నింటికీ సన్నద్ధమవాలి. సబ్జెక్టులన్నింటిపై అవగాహన పెంచుకుని వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. విద్యార్హతగా గ్రాడ్యుయేషన్‌ను పేర్కొన్నప్పటికీ ఎంబీఏ (ఫైనాన్స్‌)/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ ఎఫ్‌ఆర్‌ఎం/ సీఏఐఐబీ క్వాలిఫికేషన్‌ ఉన్నవారికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన సబ్జెక్టులపైనే ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టు ఉంటుంది. అభ్యర్థులు తదనుగుణంగా సిద్ధమవ్వాలి.

నోటిఫికేషన్‌ వివరాలు
* విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌ (60%), రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు (55%)
* వయసు (04.10.2017 నాటికి): 23-32 సంవత్సరాల మధ్యవారు
* దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ- రూ.600, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ- రూ.100
* దరఖాస్తు చివరితేదీ: 21.10.2017
* ఆన్‌లైన్‌ రాతపరీక్ష తేదీ: 25.11.2017
* పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి.

Posted on17-10-2017

Union Bank of IndIa Info.

  • Notification
  • Apply Online
  • Website