నోటిఫికేషన్

ఎంపికైతే పీజీ కోర్సు...అనంత‌రం పీవో ఉద్యోగం

* ప్రక‌ట‌న జారీచేసిన యునైటెడ్ బ్యాంక్
* వంద మందికి అవ‌కాశం
ప‌బ్లిక్ సెక్టార్ ప‌రిధిలోని యునైటెడ్ బ్యాంక్ వంద పీవో పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌రీక్షలో ఎంపికైన‌వాళ్లు ఏడాది వ్యవ‌ధి ఉండే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో చేరాలి. శిక్షణ అనంత‌రం పీవోగా విధుల్లోకి తీసుకుంటారు. ఆగ‌స్టు 7న నిర్వహించే ఈ ప‌రీక్ష స్వరూపం, కోర్సు, ఎంపిక ప్రక్రియ గురించి వివ‌రంగా...

ముందుగా ఆన్‌లైన్ రాత‌ప‌రీక్షను నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన విద్యార్థుల‌కు ముఖాముఖి ఉంటుంది. అన్ని అర్హత‌లూ సాధించిన‌వారిని ఏడాది వ్యవ‌ధి కోర్సుకు ఎంపిక‌చేస్తారు. ఈ కోర్సును నిట్ (ఎన్ఐఐటీ) అందిస్తుంది. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవాళ్లు ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (స్కేల్ 1) హోదాతో విధుల్లో చేరుతారు. ఈ స‌మ‌యంలో రూ.23,700 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. దీనికి అద‌నంగా డీఏ, హెచ్ఆర్ఏతోపాటు ప‌లు ఇత‌ర ప్రయోజ‌నాలు ఉంటాయి. అన్ని ర‌కాల ప్రోత్సాహ‌కాలు క‌లుపుకుని రూ.6.5 ల‌క్షల వార్షిక వేత‌నాన్ని అందుకోవ‌చ్చు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు: జులై 12
హాల్ టికెట్ల ల‌భ్యం: జులై 26 నుంచి
ఆన్‌లైన్‌ ప‌రీక్ష: ఆగ‌స్టు 7న‌
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150; మిగిలిన అంద‌రు అభ్యర్థుల‌కు రూ.700
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల‌, చిత్తూరు, కాకినాడ‌, గుంటూరు, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
విభాగాల వారీ ఖాళీల వివ‌రాలు: ఎస్సీ 15, ఎస్టీ 7, ఓబీసీ 27, జ‌న‌ర‌ల్ 51. మొత్తం వంద ఖాళీలు. వీటిలో 3 దివ్యాంగుల‌కు కేటాయించారు.
వ‌యోప‌రిమితి: క‌నిష్ఠం 21. గ‌రిష్ఠం 30 ఏళ్లు. జూన్ 2, 1986 కంటే ముందు; జూన్ 1, 1995 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా అంశంలో డిగ్రీ ఉత్తీర్ణత‌

ఆన్‌లైన్ ప‌రీక్ష ఇలా...
రీజ‌నింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ ఇండ‌స్ట్రీకి ప్రాధాన్యం) విభాగాల్లో ప్రశ్నలుంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 200 మార్కుల ప్రశ్నప‌త్రంలో మొత్తం 200 ప్రశ్నలు.అడుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

ఇంట‌ర్వ్యూ...
ప‌రీక్షలో ప్రతిభ చూపిన‌వారికి ముఖాముఖి నిర్వహిస్తారు. బృంద‌చ‌ర్చ జ‌ర‌ప‌డానికీ అవ‌కాశాలున్నాయి. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఇంట‌ర్వ్యూలు జ‌ర‌ప‌వ‌చ్చు. ప్రతిభ చూపిన‌వాళ్లను కోర్సుకు ఎంపిక‌చేస్తారు.

పీజీ డిప్లొమా కోర్సు...
కోర్సుకు ఎంపికైన‌వాళ్లు రూ.3.20 లక్షలు ఫీజుగా చెల్లించాలి. బ్యాంకు నామ‌మాత్రపు వ‌డ్డీకి రుణ‌స‌దుపాయం క‌ల్పిస్తుంది. పీవోగా విధుల్లో చేరిన త‌ర్వాత 60 నెలల్లో (ఈఎంఐ విధానం)ఈ ఫీజు చెల్లించుకోవ‌చ్చు. కోర్సు వ్యవ‌ధి ఏడాది. నెల‌కు రూ.2500 చొప్పున మొద‌టి 9 నెలలు స్టైపెండ్‌గా చెల్లిస్తారు. చివ‌రి 3 నెల‌లు రూ.12,000 చొప్పున ఇస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు పీవోగా విధుల్లో చేరుతారు. క‌నీసం రెండేళ్ల పాటు యునైటెడ్ బ్యాంక్‌లో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. మ‌ధ్యలో వైదొలిగితే వ‌డ్డీతో స‌హా కోర్సు ఫీజు, తీసుకున్న స్టైపెండ్‌, అద‌నంగా రూ.2 ల‌క్షలు చెల్లించాలి.

United Bank of India POs Info.

  • Notification
  • Apply Online